భువనేశ్వరి కొంగు బిగిస్తారా?

By KTV Telugu On 29 September, 2023
image

Ktv Telugu :

చంద్రబాబు నాయుడి అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు నైరాశ్యంలో కూరుకు పోకుండా చూసేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను రంగంలోకి దింపాలని టిడిపి నాయకత్వం భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు కూతురిగా భువనేశ్వరి జనంలోకి వస్తే మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో బ్రాహ్మణి కూడా ఎన్టీయార్ మనవరాలే కాకుండా నందమూరి బాలకృష్ణ కూతురిగా నందమూరి అభిమానులంతా ఆమెకు బ్రహ్మరథం పడతారని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో చంద్రబాబు నాయుణ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన మర్నాడే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. జాతీయ నాయకుల మద్దతు కూడగట్టడంతో పాటు కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు ఏపీలో తన తండ్రికి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయాలని లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అయితే ఇప్పటి వరకు లోకేష్ కు కేంద్రమంత్రులెవరూ అపాయింట్ మెంట్ కూడా ఇచ్చినట్లు లేదు. అందుకే లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు.

త్వరలో జనంలోక భువనేశ్వరి, బ్రాహ్మణి
చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ ప్రచారం చేయనున్న మహిళలు
పార్టీనేతల్లో ధైర్యం నింపడంతో పాటు జనానికి భరోసా ఇవ్వడానికే అంటోన్న నేతలు
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం
గతంలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినపుడు జనంలోకి వచ్చిన తల్లి విజయమ్మ
జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా పాదయాత్ర చేసి పార్టీకి అండగా నిలిచిన షర్మిల
విజయమ్మ, షర్మిల కారణంగా దూసుకుపోయిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
అదే తరహాలో భువనేశ్వరి, బ్రాహ్మణి తిరగాలని టిడిపి వ్యూహకర్తల సూచన
లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంలో బాబు కుటుంబం
లోకేష్‌ను అరెస్ట్ చేస్తేనే భువనేశ్వరి, బ్రాహ్మణి బయటకు వచ్చే అవకాశం

చంద్రబాబు నాయుడి అరెస్ట్ కు నిరసనగా జిల్లాల్లో టిడిపి శ్రేణులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ అవి టిడిపి నాయకత్వం ఆశించినస్థాయిలో అయితే లేవు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే బహిరంగంగా కార్యకర్తలకు రాసిన లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే వరకు ప్రజలు పార్టీకి దూరం కాకుండా ఉండాలంటే భువనేశ్వరి, బ్రాహ్మణి జనంలోకి వెళ్తే బాగుంటుందని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపినపుడు ఆయన తల్లి వై.ఎస్. విజయమ్మ, చెల్లెలు షర్మిల బయటకు వచ్చి జగన్ కు మద్దతుగా ప్రజల్లో తిరిగారు. షర్మిల పాదయాత్రతో జనాన్ని ఆకట్టుకున్నారు. తిరుగులేని ప్రసంగాలతో అదరగొట్టారు షర్మిల.

అప్పుడు విజయమ్మ, షర్మిల తరహాలోనే ఇపుడు భువనేశ్వరి , బ్రాహ్మణి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర అయినా చేస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు. విజయమ్మ ఏ విషయంపైన అయినా అవగాహనతో స్పష్టంగా మాట్లాడతారు. ఇక షర్మిల అయితే స్పీచ్ కాపీలు చూసుకోవలసిన అవసరం లేకుండా అనర్గళంగా ఆసువుగా ఉత్తేజిత ప్రసంగాలు చేయగలరు. అందుకే అప్పట్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఈ ఇద్దరూ కొండంత అండగా ఉండేవారు. బ్రాహ్మణి ఏ విషయం మీద అయినా స్పాంటేనియస్ గా మాట్లాడగలరని అర్దం అవుతోంది. ఆమె చరుగ్గా కూండా ఉంటారు కాబట్టి టిడిపికి బలమే అవుతారని రాజకీయ పండితులు అంటున్నారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి ఎపిసోడ్ కీ చంద్రబాబు నాయుడి ఎపిసోడ్ కీ చిన్న తేడా ఉంది. అప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఆయనే అధినేత కాబట్టి. ఆయన అరెస్ట్ కావడంతో పార్టీ నేతలకు ధైర్యం చెప్పడానికి..ఆయన అక్రమ అరెస్ట్ గురించి ప్రజలకు వివరించడానికి తల్లి విజయమమ్మ, చెల్లెలు షర్మిల తిరిగారు. ఇపుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా.. ఆయన తరపున పార్టీ నేతలకు ధైర్యం చెప్పడానికి.. ఆయన అరెస్ట్ గురించి ప్రజలకు వివరించడానికి నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబు నాయుడి కేసులోనూ లోకేష్ సహనిందితుడని సిఐడీ అంటోంది.

బహుశా చంద్రబాబు నాయుడి తర్వాత సిఐడీ పోలీసులు నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని టిడిపి నాయకత్వం, చంద్రబాబు కుటుంబ సభ్యులు భయపడుతున్నట్లు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకేష్ కూడా అరెస్ట్ అయితేనే ఈ ఇద్దరూ జనంలోకి వస్తారని అంటున్నారు. త్వరలోనే యువగళం పాదయాత్రను ఎక్కడ ఆపేశానో అక్కడి నుండే మొదలు పెడతానని నారా లోకేస్ ట్విట్టర్ లో ప్రకటించారు. బహుశా అక్టోబరు ఒకటి తర్వాత ఎప్పుడైనా లోకేష్ యాత్ర మొదలు కావచ్చునంటున్నారు. ఆ యాత్రలో ఉండగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తే మాత్రం భువనేశ్వరి, బ్రాహ్మణి జనంలోకి రాక తప్పదని వారంటున్నారు.