చంద్రబాబు రిస్క్ తీసుకుంటున్నారా ?

By KTV Telugu On 7 February, 2024
image

KTV TELUGU :-

ఏపీలో పొత్తులు ఎటుపోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మూడు పార్టీల్లో ఎవరికెంత ప్రయోజనం. జగన్ పనైపోయిందని సర్వేలు చెబుతున్న  తరుణంలో విజయావకాశాలు మెరుగుపడిన టీడీపీకి మరో పొత్తు భాగస్వామి అవసరమా..పొత్తుకు చంద్రబాబు ఎందుకు ఒప్పుకుంటున్నారు..

ఆంధ్రప్రదేశ్  పాలిటిక్స్ మారుతున్నాయి. ఇంతవరకు బీజేపీతో జనసేనకు పొత్తు ఉంది. ఇటీవలే టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించింది.  టీడీపీ-జనసేన – బీజేపీ ఒకే తాటిపై ఇంకా రాలేదు. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక తికమకపడుతున్న మూడు పార్టీల కేడర్ కు క్లారిటి ఇచ్చే ప్రయత్నం మంగళవారం  జరిగింది. చంద్రబాబుకు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పిలుపువచ్చింది. చంద్రబాబు కూడా ఆ పిలుపు కోసమే  ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ఆయన ఒప్పుకున్నారు. ఢిల్లీలో అజెండా సిద్ధమైనట్లు కూడా కొందరు లీకులు ఇస్తున్నారు. ఇదీ ఇచ్చి పుచ్చుకునే పొత్తు కాదని, బీజేపీ మాత్రమే పుచ్చుకునే పొత్తు అని కూడా చర్చ జరుగుతోంది.  ఏకంగా బీజేపీ పది లోక్ సభా స్థానాలు అడిగేందుకు సిద్ధమైందంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది వార్తా లేక వదంతా అన్నది చెప్పడం కష్టమే అయినా..ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి బలం లేని బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం, గత్యంతరం లేని  పరిస్థితుల్లో చంద్రబాబు అందుకు ఒప్పుకోవడం జరిగిపోతాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ గెలిచి హ్యాట్రిక్ కొడతారని సర్వేలు చెబుతున్నాయి. అప్పుడు కేంద్రం తన డిమాండ్లు నెరవేర్చాలన్నా, తనను ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా.. అక్కడి అధికార పార్టీతో సఖ్యతగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే గతం గతహా అంటూ అన్ని మరిచిపోయి..బీజేపీతో కలిసిపోయేందుకు ఆయన  సిద్ధమయ్యారు. అటు ఇటుగా బీజేపీ డిమాండ్లకు ఆయన తలొగ్గుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి…

చంద్రబాబు గెలవడం ఖాయం కావచ్చు. ఆయనకు ఆ సంగతి తెలిసి ఉండొచ్చు.మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి. పొత్తులపై జననాడి ఎలాంటి సంకేతాలిస్తోంది. టీడీపీ కేడర్ కు ఎందుకు టెన్షన్ పెరిగిపోతోంది..

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేందుకు ఇప్పటికిప్పుడు  విశ్లేషణ ఇవ్వాలంటే సర్వేలను మాత్రమే ఆధారంగా చేసుకోవాలి. టీడీపీ గెలుస్తుందని చెప్పే అన్ని సర్వేల్లోనూ ఒక విచిత్రమైన లాజిక్కు బయటపడుతోంది. టీడీపీ,  జనసేన కలిసి పోటీ చేస్తే ఘనవిజయం ఖాయమని ఆ సర్వేలు చెబుతున్నాయి. అదే బీజేపీ వచ్చి కలిస్తే మాత్రం  టెన్షన్ తప్పదని అవే సర్వేలు నిగ్గు తేల్చుతున్నాయి. బీజేపీ పట్ల ఏపీ జనంలో వ్యతిరేకత ఉందని, దానితో టీడీపీకి ఓటేసే వాళ్లు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనసు మార్చుకుంటారని సర్వేలు ప్రకటిస్తున్నాయి. టీడీపీ -జనసేన కలిసి పోటీ చేస్తే 120 నుంచి 140 స్థానాల వరకు రావడం  ఖాయమంటున్న సర్వేలు, బీజేపీని కూడా కలుపుకుపోతే వంద సీట్లకు పరిమితమవుతారని విశ్లేషిస్తున్నాయి.మూడు పార్టీలు కలిస్తే ఓడిపోయినా ఆశ్చర్యం లేదని కొన్ని సర్వేలు ప్రకటించాయి. వాళ్లు ముగ్గురు కలిస్తే ఓటర్లు అధికార పార్టీ వైపు చూస్తారని, అప్పుడు వైసీపీ పండగ చేసుకుంటుందని కూడా సర్వేలు  విశ్లేషిస్తున్నాయి. దీనితో ఇప్పుడు టీడీపీ కేడర్ కు కొత్త భయం పట్టుకుంది. తమ అధినేత బీజేపీతో పొత్తుకు అంగీకరిస్తూ  రిస్క్ చేస్తున్నారని వాళ్లు భయపడుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి నిర్మాణం, విశాఖ ఉక్కు కర్మాగారం సహా అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను బీజేపీ  పట్టించుకోలేదని జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విభజన హామీల అమలుతో పాటు ఎలాంటి సహాయమూ చేయలేదని… ఏపీ నుంచి కేంద్రానికి  నిధులు వెళ్లడమే గానీ, కేంద్రం నుంచి ఏపీకి రావడమే లేదని జనం అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే బీజేపీతో  టీడీపీ పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశమవుతోంది….

2019 ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ పొత్తు తెగిపోయింది. ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు  స్వయంగా విమర్శించారు. దానితో దూరం మరింతగా పెరిగింది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఎంతకైనా కొట్లాడతానని చంద్రబాబు ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు  రూటు  మార్చుకుని బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీకి ఆయన మంచి అస్త్రమే ఇచ్చేసినట్లునుకోవాలి. మోదీకి చంద్రబాబు  సరెండర్ అయ్యారని వైసీపీ సోషల్ మీడియా ఇకపై కొడై కూసే ప్రమాదం ఉంది. లేనిపోని ఆరోపణలు  జనంలోకి తీసుకువెళ్లే ఛాన్సుంది. అందుకే చంద్రబాబు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారని చెప్పక తప్పదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి