బీజేపీ నిర్ణయం..పవన్ కు మోదం !!

By KTV Telugu On 29 July, 2023
image

KTV Telugu ;-

 

చాలా కాలంగా బీజేపీ మదిలో ఉన్న మాట ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. పవన్ కల్యాణ్ ను తమ కూటమి నేతగా ప్రకటించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. బీజేపీ శ్రేణులను కూడా ఒప్పించే ప్రక్రియ చాప కింద నీరులా సాగిపోతోంది.

జనసైనికులకు, వీర మహిళలకు, పవన్ అభిమానులకు అమితానందాన్నిచ్చే వార్త త్వరలోనే తెరపైకి రానుంది. చంద్రబాబుతో మనకెందుకులే అన్నట్లుగా బీజేపీ నేతలు పూర్తిగా జనసేనానిపై డిపెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడున్న పరిస్తితుల్లో జగన్ తో గట్టిగా తలపడే అవకాశేం ఉందని బీజేపీ అగ్రనాయకత్వానికి రిపోర్టులు అందటమే ఇందుక్కారణంగా భావిస్తున్నారు.

ఒక నిర్ణయం అమలు చేయాలంటే ముందు మీడియాకు లీకులివ్వాలి. తర్వాత క్రమంగా దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. జననాడిని అర్థం చేసుకుని తర్వాత అసలు కథ నడిపించారు. ఏపీ సీఎం అభ్యర్థి విషయంలో కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇదే గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటారన్న ప్రచారం స్లోగా ప్రారంభమైంది. అది ఎప్పుడైనా ఊపందుకోవచ్చు. పైగా ఇటీవల ఎన్డీయే మీటింగు కు ఏపీ నుంచి పవన్ ను మాత్రమే ఆహ్వానించారు. పవన్ తో బంధం బలం గా బిగుసుకుంటున్న వేళ జనసేనాని కూడా ఢిల్లీ నుంచి తిరిగి వస్తూనే ఎన్డీయే సర్కార్ ఏపీలో ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. ఇక ఏపీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. ఆమె జనసేన తో పొత్తులు నిన్నా ఇవాళే కాదు రేపు కూడా ఉంటాయని బలంగా నొక్కి చెప్పారు. ఈ నేపధ్యంలో మీడియా అడిగిన అనేక ప్రశ్నల కు పురంధేశ్వరి నుంచి ఆసక్తి కరమైన జవాబులే వచ్చాయి. ఏపీ లో జనసేన బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తారా ప్రకటిస్తే ఎవరు అని అడిగినపుడు ఆమె అంతా ఢిల్లీ లోని కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది అని బదులివ్వడం విశేషం. అంతే కాదు ఏపీ లో కొత్త పార్టీలతో పొత్తులు అంటే టీడీపీ లాంటివి అన్న మాట. ఆ విషయం కూడా కేంద్ర నాయకత్వమే చూసుకుంటుంది అని ఆమె చెప్పడం గమనార్హం

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం టీడీపీతో పొత్తు ఉండదనే చెప్పారు. అలా మాట్లాడే బీజేపీ శ్రేణులకు అప్పట్లో ఆయన నాయకుడిగా ఉండేవారు. ఆ కారణంగా టీడీపీ మీడియా అయన్ను బాయ్ కాట్ చేసింది కూడా. పురంధేశ్వరికి కూడా టీడీపీతో పొత్తు పెద్దగా ఇష్టం లేదన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆమె ఆచి తూచి మాట్లాడుతున్నారు. అనవసరమైన ప్రకటనలకు పోకుండా బంతిని అధిష్టానం కోర్టులో పడేస్తున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి రాజకీయం నడపాలనకుంటోంది. జనం కోరుకుంటే తాను సీఎం అవుతానన్న పవన్ వ్యాఖ్యలు.. పదవిపై ఆయనలోని కోరికను బయటపెడుతున్నట్లు బీజేపీ గుర్తించింది. అందుకే సామాజిక వర్గ సమీకరణలను సైతం లెక్క వేసుకుని మరీ పురంధేశ్వరిని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా నియమించారనుకోవాలి. పవన్ కల్యాణ్ ను శాశ్వత మిత్రుడిగా కూడా బీజేపీ పరిగణిస్తోంది.

బీజేపీకి నిజంగానే పవన్ ను సీఎం చేయాలన్న ఐడియా ఉందా అని ప్రశ్నించుకుంటే ఖచితంగా చెప్పలేమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును దారికి తెచ్చుకునేందుకే పవన్ ను బూచిగా చూపిస్తుండొచ్చని లెక్కగడుతున్నారు. అప్పుడు బీజేపీ, జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తారన్నది వారి ఆలోచన అంట. అసలు విషయంపై ఒకటి రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి