పీకే మెటీరియల్ పనిచేస్తుందా ?

By KTV Telugu On 25 December, 2023
image

KTV TELUGU :-

ప్రశాంత్ కిషోర్ వ్యూహం పనిచేస్తుందా. అతనిలో ఇంకా ఓ గొప్ప వ్యూహకర్త దాగొన్నాడా. టీడీపీకి అతను ఎసెట్ అవుతాడా. ఇవన్నీ మానుకున్న పీకే మళ్లీ ఫీల్డ్ లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు.. వైసీపీ వాళ్లు మెటీరియల్, మేస్త్రీ అంటూ ఎందుకు ఎగతాళి చేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్ వెంట  బెట్టుకురాగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రత్యేక విమానంలో వచ్చారు. మళ్లీ ప్రత్యేక విమానంలో వెళ్లే లోపు నాలుగు గంటల వ్యవధిలో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే  కీలక చర్చలే జరిగాయి. ఇప్పటికే టీడీపీకి  ఒక వ్యూహకర్త ఉన్నప్పటికీ పీకే సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు డిసైడైనట్లు సమాచారం. రెండు మూడు సార్లు స్వల్ప మీటింగు తర్వాత ఈ సారి సుదీర్ఘ సమావేశం  నిర్వహించారు. మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశానని పీకే చెబుతున్నప్పటికీ టీడీపీ అధినేతకు ఆయన సీరియస్ సలహాలే ఇచ్చారు. ఇంతవరకు టీడీపీ ప్రచార వ్యూహాలను సైతం పీకే విశ్లేషిస్తూ ఇంకా ఏమేమి చేయాలో చెప్పుకొచ్చినట్లు సమాచారం. మ‌హిళా ఓటు బ్యాంకును  టీడీపీకి అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు బాగానే ఉన్నాయని  పీకే టీమ్ జరిపిన సర్వేలో తేలిందట.  అయితే.. ఈసారి యువ‌త చాలా ఆవేశంతో ఉన్నారని ఉద్యోగాలు, ఉపాధిలేక‌.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారని  యువ‌త నాడిని ప‌ట్టుకుని.. వారికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తే చంద్రబాబుకు తిరుగుండదని పీకే చెప్పారట. ఈ దిశగా తన బృందం తెచ్చిన ఒక నివేదికను సైతం పీకే , టీడీపీ అధినేత చేతిలో పెట్టారు.జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.  సాధార‌ణ ప్ర‌జ‌లు కొన్నాళ్లుగా ర‌గిలిపోతున్న నిత్యావ‌ర‌స‌ర ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ప్రభావం చూపుతాయని, ఈ విష‌యాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని చంద్ర‌బాబుకు పీకే సూచించారట. మ‌రోవైపు.. దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయని పీకే అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. జగన్ కేబినెట్‌లో ఒకరిద్దరు మినహా మిగిలిన‌ మంత్రులకు ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని పీకే వ్యాఖ్యానించారు.ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాల వ్యూహరచన ఉండాలని, అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని పీకే సూచించార‌ని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. చంద్రబాబు అరెస్టుతో తటస్థులు, వైసీపీ వర్గాల్లో జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని పీకే స్పష్టం చేశారు..

పీకే విజయవాడ వచ్చి చంద్రబాబును కలవడమే వైసీపీకి  ఒక ఝలక్. వ్యూహాలు మానుకున్నానని చెప్పుకుని రాజకీయాల్లోకి దిగిన పీకే.. ఇప్పుడు చంద్రబాబు కోసం  పాత వృత్తిలోకి రావడం హైలైట్. అందుకే వైసీపీ వాళ్లు భయంతో  కూడిన  ఎదురుదాడి చేస్తున్నారు. టీడీపీ తొలి వ్యూహకర్త రాబిన్ శర్మపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్‌ కిశోర్‌ టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో వైసీపీ, టీడీపీ మధ్య ‘ఎక్స్‌’లో ట్వీట్ల వార్‌ మొదలైంది. దీనిపై మొదటి ట్వీట్‌ మంత్రి అంబటి రాంబాబు నుంచి వచ్చింది. మెటీరియల్‌ మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేస్తాడు అని పీకేను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దీనికి టీడీపీ కౌంటరిస్తున్నప్పటికీ ఏదో లోపిస్తున్నట్లు అనిపిస్తోంది. కోడి కత్తి, వివేకానంద రెడ్డి హత్య పీకే ప్లాన్ అన్నట్లుగా మాట్లాడిన  టీడీపీ ఇప్పుడు మాత్రం అతడ్ని ఎలా  వ్యూహాకర్తగా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.ఐ ప్యాక్ ఏమిటి, పీకేకు దానికి ఉన్న సంబంధం ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ఐ ప్యాక్ విడుదల చేసిన ప్రకటన  కూడా కొన్ని అనుమానాలకు దారి తీసింది. ఐ ప్యాక్ జగన్ కోసం పనిచేస్తోందని,  వైసీపీని  గెలిపిస్తుందని ఆ సంస్థ ట్వీట్ చేసింది.  దానితో  ఐ ప్యాక్ నుంచి పీకే ఎప్పుడో బయటకు వెళ్లిపోయారని టీడీపీ వాదిస్తోంది. అయితే పీకే వర్గం  మరో మాట చెబుతోంది. చంద్రబాబు, లోకేష్ అభ్యర్థన మేరకే ఆయన వచ్చి కలిశారని చెబుతున్నారు. ఇంకా  పీకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా అంటున్నారు. కాకపోతే టీడీపీతో పనిచేసేందుకు ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాత్రం తేలిపోయింది.

పీకే చాలా తెలివిగల వ్యక్తి. తాను స్థాపించిన ఐ ప్యాక్ వైసీపీకి పనిచేస్తుంది. తాను  టీడీపీకి పనిచేస్తాడు. ఎవరు గెలిచినా అది తన గొప్పదనమేనని చెప్పుకోవచ్చు. పైగా పీకే లేనిదే ఐ ప్యాక్ లేదు.తాను పనిచేయకపోయిన తను శిక్షణ ఇచ్చిన  మనుషులే అక్కడ ఉంటారు.. సో.. పీకే రెండువైపులా పదునైన కత్తి అని మరిచిపోకూడదు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి