వ్యతిరేకత జగన్ మీదనా ? ఎమ్మెల్యేల మీదనా ?

By KTV Telugu On 21 December, 2023
image

KTV TELUGU :-

ఏపీలో అధికార పార్టీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.  ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం ఎమ్మెల్యేలే అన్నట్లుగా వైసీపీ అధినేత వ్యవహరిస్తున్నారు. వారిని మార్చేస్తే తన గెలుపు సులువు అనుకుంటున్నారు.  కానీ జగన్ రాజకీయ వ్యూహాలు .. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో ఉన్న పరిస్థితుల్ని చూస్తే.. అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిత్తమాత్రులుగానే ఉన్నారని.. అసలు వ్యతిరేకత ఉంటే గింటే ప్రభుత్వంపైనే ఉంటుందంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా జగన్ ఎమ్మెల్యేలతో ఆటాడుకుంటున్నారా ? లేకపోతే అంతా ఎమ్మెల్యేల వల్లే తప్పు జరిగిందని చెప్పాలనుకుంటున్నారా ?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చాలావేగంగా బలహీనపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  దిద్దుబాటుకోసమని ఆయన తీసుకుంటున్న చర్యలు పరిస్థితిని సరిదిద్దకపోగా ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.  తన పార్టీ ఇంత వేగంగా ప్రజల మద్దతు కోల్పోవడానికి అసలు కారణాలు ఏమిటో గుర్తించకుండా ఎమ్మెల్యేలను బలిచేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలను తప్పిస్తే  తాను ఘనవిజయం సాధిస్తానని భావిస్తున్నారు.  కొన్ని చోట్ల అప్పుడే ప్రత్యామ్నాయ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా చాలాచోట్ల ఇలా చేయబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఈ ద్వితీయశ్రేణి నాయకత్వం దూరమైతే గ్రామాల్లో, కిందిస్థాయిలో చేసే నష్టం మామూలుగా ఉండదు. ఈసారి జగన్‌ను ఓడించబోయేది చంద్రబాబు-పవన్ కల్యాణ్ కాదు, ఈ ద్వితీయశ్రేణి రాజకీయ నాయకత్వమే. వీరు చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లతో చేరిపోయి నష్టం కలిగించవచ్చు లేక పార్టీలో ఉండే జగన్ ప్రయత్నాలకు గండికొట్టవచ్చు. ఇది ద్వితీయ శ్రేణి నాయకత్వం పరిస్థితి.

నాయకుడికి, ప్రజలకు మధ్య చాలా రాజకీయ యంత్రాంగం ఉంటుంది. గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు- ఇలా రాష్ట్రమంతా విస్తరించి ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వ వ్యవస్థను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వారికి ప్రభుత్వంలో ఎటువంటి పనీ, పాత్రా లేకుండా చేశారు. వారంతా జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు చెల్లని రూపాయలు అయ్యారు. ఇప్పుడు జగన్ వారు ఫెయిలయ్యారని చెప్పి, వచ్చే ఎన్నికల్లో తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

జగన్ గెలవాలని గత ఎన్నికల్లో ఎంతెంతో ఆధారపడిన వర్గాలలో ఇప్పుడు ఎంత మంది ఆయనతో ఉన్నారు? ప్రభుత్వోద్యోగులు లేరు. జగన్ మీటలు నొక్కుడు చూసి మధ్యతరగతి, మేధావి వర్గాలు విస్మయానికి లోనవుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ తీరానికి తీసుకెళతారోననే ఆందోళనతో మండిపడుతున్నాయి. సామాజిక వర్గాలు కూడా ముందటిమాదిరిగా ఏకపక్షంగా లేవు. జగన్‌ను నెత్తికెత్తుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఇప్పుడు జగన్‌తో సంతృప్తిగా లేదు. రెడ్డి సామాజికవర్గానికి ప్రభుత్వంలో, పదవుల్లో పెద్ద పీట వేసినా రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది జగన్ పనితీరు చూసి దూరమయ్యారు.  కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం, కొందరు రాజీనామా చేయడం ఇందుకు సూచనలు. కాపు సామాజిక వర్గంలో విభజన వచ్చింది. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలు కాపు సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక బీసీ మంత్రం కూడా పనిచేయడం లేదు. బీసీలకు కూడా జగన్ కిరీటం పెట్టింది ఏమీ లేదని ఆ సామాజిక వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నదో జగన్ గుర్తించడం లేదని వైసీపీలో చ్రచ జరుగుతోంది.

జగన్‌పై ఐదేళ్లలోనే ఎందుకు ఇంతటి విభ్రమ వచ్చింది? ఎందుకంటే.. కారణం ఆయనే. పనిచేసే సచివాలయం లేదు. మంత్రి మండలి లేదు. ముఖ్యమంతి ఒక దుర్భేద్యమైన సౌధంలో ఉంటారు. ఆయన ఎవరినీ కలవరు. ఎవరికీ అపాయింటుమెంట్లు ఉండవు. ముఖ్యమంత్రికి, ప్రజలకు మధ్య సజీవ వారధిగా ఉండాల్సిన నాయకత్వం పూర్తిగా సంబంధాలు కోల్పోయి ఉంటుంది. ఇలాంటి తప్పుల్ని సరిదిద్దుకోకుండా.. అభ్యర్థులనే జగన్ టార్గెట్ చేయడం .. వారిని మార్చేసి తాను గెలుస్తానని అనుకుంటూ ఉండటం ఆశ్చర్యకరంగా మారింది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి