సమయం లేదు మిత్రమా..!

By KTV Telugu On 19 October, 2023
image

KTV TELUGU :-

పోటీ చేయాలా వద్దా.. తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ మథన పడుతున్న పరస్థితులివి. పార్టీ కేడర్ ఆయనపై  తీవ్ర ఒత్తిడి తెస్తోంది. పవన్ మాత్రం ఎటూ తేల్చుకోలేపోతున్నారు. తనకు కొన్ని పరిమితులున్నాయని ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు.

జనసేన ఆశావహులు పవన్ తలుపు తడుతున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో బాగా నష్టపోయామని ఈ సారి మాత్రం అందుకు సిద్ధంగా  లేమని పవన్ ను మోటివేట్ చేసేందుకు జనసైనికులు, వీర మహిళలు ప్రయత్నించారు. మంగళవారం  రాత్రి ఆయనతో భేటీ అయిన సందర్భంగా కొందరైతే ఫలానా నియోజకవర్గాలు అంటూ ఎవరికి వారు డిసైడైనట్లు కూడా సమాచారం. తెలంగాణలో ముక్కోణ పోటీ ఉన్నట్లు కనిపిస్తోందని..కాకపోతే తమ పార్టీకి కూడా విజయావకాశాలున్నాయని వాళ్లు పవన్ వద్ద తమ అభిప్రాయం చెప్పారు. 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుపట్టలేదని ఈ సారి మాత్రం బరిలోకి దిగాల్సిందేనని జనసైనికులు డిమాండ్ చేయడంతో పవన్ కల్యాణ్ పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థన మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి  తప్పుకుని పొరబాటు చేశామని కూడా కార్యకర్తలు పవర్ స్టార్ తో అన్నట్లుగా సమాచారం. ఈ సారి పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీని చేజేతులా మూసేసుకున్నట్లు అవుతుందని హితబోధ చేశారు.

కార్యకర్తల మనోభావాలను తాను అర్థం చేసుకోగలనని, తన మీద  ఒత్తిడి ఉన్నదని పవన్ సమాధానమిచ్చారు. తక్షణమే ఎన్నికల్లో పోటీకి సంబంధించిన  ప్రకటన చేయాలని జనసైనికులు కోరగా పవన్ కల్యాణ్  ఒకటి రెండు రోజులు  గడువు కోరారు. అయితే కార్యకర్తలు మాత్రం రెండు రోజులు చాలా ఎక్కువ సమయమని అంటున్నారు. పవన్ జాప్యం చేయడానికి కారణాలున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు ఉంది. టీడీపీతో పొత్తును ఆయన ఇటీవలే ప్రకటించారు.తెలంగాణ ఎన్నికల్లో పోటీపై టీడీపీ ఆలోచిస్తోంది. తాము రంగంలోకి దిగితే బీజేపీ ఓట్లు చీలిపోతాయన్న అనుమానం  ఆయనకు కలుగుతుంది దీని వల్ల తన మిత్రపక్షం బీజేపీ అవకాశాలను తానే దెబ్బకొట్టినట్లవుతుందని పవన్ ఆలోచిస్తున్నారు. సెటిలర్ల ఓట్లు చీలగొట్టడం ద్వారా తాను బీఆర్ఎస్ కు ప్రయోజనం కలిగించానన్న ఫీలింగ్ రాకూడదని ఆయన లెక్కగడుతున్నారు. పైగా 40 నియోజకవర్గాల్లో  ప్రతీ చోట తనకు 5 వేల నుంచి 6 వేల ఓట్లు ఉన్నాయని పవనే స్వయంగా ప్రకటించి ఉన్నారు. ఇదే ఇప్పుడాయన డైలమాకు కారణమవుతోంది..

పవన్ ఈ సారి దృఢనిశ్చయాన్ని ప్రకటించక తప్పదు. కాంగ్రెస్ కు టీడీపీ పరోక్ష మద్దతు ఇవ్వాలన్న ప్రయత్నంలో ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎదురైతే జనసేన పోటీ చేసి కూడా ప్రయోజనం ఉండదు. బరిలోకి దిగిన చోట ఐదువేల ఓట్లు కూడా రావు. అందుకే పోటీ చేయడం లేదని ప్రకటించాలా.. లేదా కార్యకర్తలు కోరినట్లుగా బోల్జ్ గా పోవాలా అన్నది చూడాలి. ఒకటి  మాత్రం నిజం టైమూ గంటల వ్యవధిలోకి వచ్చింది. అందుకే సమయం లేదు మిత్రమా రణమా. ఉపసంహరణమా అనాల్సి వస్తోంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి