రోజా ఖేల్ ఖతం..?

By KTV Telugu On 6 May, 2024
image

KTV TELUGU :-

ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజాకు  నోరు ఎక్కువ, పవర్  తక్కువ అన్నట్లుగా తయారైందీ వైసీపీలో పరిస్తితి. ఆమె ఏకపక్ష నిర్ణయాలు, ఇష్టానుసార ప్రవర్తనల వల్ల అధికార పార్టీలో చిచ్చు రేగి చాలా రోజులైంది. ఇప్పుడది తారాస్థాయికి చేరి రోజా సీటుకు ఎసరు వచ్చే అవకాశాలు పెరిగాయి. ఆమెను ఓడించి తీరుతామని పార్టీలోని ప్రత్యర్థులే భీష్మించుకు కూర్చున్నారు. పైగా వారంతా  ఇప్పుడు  టీడీపీలో చేరిపోయారు…

ఆర్కే రోజా.. వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌. ఎవరినైనా, ఏ స్థాయి నేతనైనా ఎంత మాటయినా అనేయగలరని పేరు తెచ్చుకున్నారు.రోజా టీడీపీ తరఫున రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004లో నగరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి చిత్తయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రోజా 2014లో నగరి నుంచి పోటీ చేసి కేవలం 858 ఓట్ల తేడాతో విజయం సాధించారు.2019లో మరోసారి వైసీపీ తరఫున బరిలో నిలిచి గెలుపొందారు. అయితే వైసీపీ గాలి ప్రభంజనంలా వీచిన ఈ ఎన్నికల్లోనూ రోజా కేవలం 2 వేలకు పైగా ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగానూ రోజా అవకాశం దక్కించుకున్నారు. రోజా  ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేళ..ఆమెకు కష్టాలు  తప్పడం  లేదు.టీడీపీ  అక్కడ  బలంగా  తయారైంది. పైగా పార్టీలో మరో రెండు వర్గాలు  ఆమెను ఓడించేందుకు సిద్ధమయ్యారు…

తమిళనాడును ఆనుకుని ఉంటుందీ నగరి నియోజకవర్గం. ఆమెది కూడా అటు  ఇటుగా అదే ప్రాంతం. పైగా  రోజా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నప్పటికీ.. ఆమె  కుటుంబం మాత్రం తమిళనాడులో ఉంటుంది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు అది కూడా ఒక  పాయింట్ గా మారింది. నగరిలో ఇల్లు కట్టుకున్నప్పటికీ రోజా  అక్కడ ఉండరని, ఓటర్లకు అందుబాటులోకి రారని వారు ఆరోపిస్తున్నారు.  పైగా ఆమెపై పుట్టెడు ఆరోపణలున్నాయి…

రోజా విపరీతమైన అవినీతి  చేశారని ఆరోపణలున్నాయి. కబ్జాలు, కమిషన్లకు ఆమె పెట్టింది పేరని  అంటారు. పైగా సీఎం జగన్ కు చాలా క్లోజ్ అని చెప్పుకుంటూ నగరి నియోజకవర్గంలో ఎవరినీ దగ్గరకు రానివ్వడం  లేదని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారు.  అడపా దడపా వచ్చే విమర్శలు కూడా  ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బాగా వేగం పుంజుకున్నాయి.  నగరిలో రోజా  బాధితులు ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలంతా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రోజాకు ఈసారి టికెట్‌ ఇవ్వవద్దని వీరంతా గట్టిగా డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అయితే రోజాకే జగన్‌ టికెట్‌ ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా టీడీపీలో చేరారు. రోజాను చిత్తుగా ఓడిస్తామని ప్రతినబూనారు. మరో పక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరిలో రోజాకు వ్యతిరేకంగా రాజకీయాలు  చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అన్ని  సర్వేలు రోజా పరాజయాన్నే  సూచిస్తున్నాయి. స్థానిక ప్రజలు రోజా తీరుపై  విసిగిపోయి ఉన్నారని సర్వేలు నిగ్గు తేల్చాయి.  అందుకే నగరిలో ఆమె హ్యాట్రిక్  సాధించడం అసాధ్యమని తేలిపోయింది..

రోజా జగనన్నకు  చాలా ఇష్టమైన ప్రియ  శిష్యురాలు అనడంలో సందేహం లేదు. ఆ ఒక్క  పాయింట్ ను అడ్డం పెట్టుకునే  ఆమె ఇంతకాలం రెచ్చిపోయారని చెబుతారు.  ఈ సారి జగన్ గెలవడమే డౌట్  గా ఉన్నప్పుడు రోజా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనలేదుగా…రిజల్ట్  కోసం వేచి చూడటమే..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి