వైసీపీ అధినేత జగన్ యాక్టివ్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజుకు మూడు స్టేట్ మెంట్స్ ఇస్తూ కూటమి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. మళ్లీ అధికారానికి రాబోతున్నామని…. యెల్లో మీడియా సహా ఒక్కొక్కరి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైపు మొగ్గు చూపి తమ కేడర్ ను వేధిస్తున్న పోలీసులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని భారీ డైలాగులు కొడుతున్నారు. జగన్ అంత చేస్తున్నా సొంత పార్టీ నేతల్లోనే ధైర్యాన్ని నింపలేకపోతున్నారు. ఇంతకాలం జగనన్న అంటూ భుజానెత్తుకున్న వాళ్లే కాడి దించేసి పక్క పార్టీల్లోకి పారిపోతున్నారు.
అధికారం పోయిన కొద్ది రోజులకే ఇద్దరు రాజ్యసభ సభ్యులు పలాయనం చిత్తగించారు. తమ పదవులకు సైతం రాజీనామా చేశారు. ఆ క్రమంలో చాలా మంది నేతలు వెళ్లిపోయారు. కొందరు ఎన్నికల ముందే వెళ్లిపోగా.. మరికొందరు ఎన్నికల్లో ఓడిపోయిన కొద్దిరోజులకే బైబై చెప్పేశారు. జగన్ బంధువు కూడా అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి…జనసేన కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి అయిన ఉమ్మడి చిత్తూరు నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఇద్దరు జగన్ భక్తులు బయటకు నడిచేందుకు రెడీ అవుతున్నారు.
కాపు నాయకుడు మాజీ జర్నలిస్టు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కషాయ కండువా కప్పుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు సోము వీర్రాజుతో ఆయన మాట్లాడుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 2019లో విజయం దక్కించుకున్న ఆయన.. తరచుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకున్నారు. కాపుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వారి పక్షాన గళం వినిపించారు. ఈ క్రమంలోనే మంత్రి పదవిని దక్కించుకున్నారన్న వాదన కూడా ఉంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికల్లో కన్న బాబు ఓడిపోయారు. ఆ తర్వాత.. వైసీపీ నుంచి ఆయనకు ఎలాంటి ఆదరణ లభించలేదు. పైగా.. కాపుల్లోనే ఆయనపై వ్యతిరేకత వచ్చింది.దీనితో వైసీపీలో ఉండి లాభం లేదని కన్నబాబు డిసైడయ్యారట. కాపుల మద్దతు అయినా కూడగట్టుకుంటే రాజకీయ మనుగడ ఉంటుందని కన్నబాబు భావిస్తున్నారు.
చిలకలూరిపేట నేత ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వెళ్లిపోయేందుకు ముహుర్తం పెట్టుకున్నారని చెబుతున్నారు. ఆయనకు జగన్ పై ఎలాంటి కోపం లేదు. కాకపోతే 2019 నుంచి 2024 వరకు చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహించిన విడదల రజనీతో ఉన్న పేచీ కారణంగానే ఆయన వెళ్లిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిలకలూరి పేట నియోజకవర్గంలో 2014 వరకు మర్రి రాజశేఖర్ హవా చలాయించారు. 2009లో ఆయన విజయం కూడా దక్కించుకున్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే, 2019 ఎన్నికలకు వచ్చే సరికి వైసీపీ అధినేత జగన్.. ఆయనను మార్చి.. విడదల రజనీకి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే మర్రికి మంత్రి పదవి ఆశచూపారు. మంత్రి పదవి దక్కకపోయినా ఆఖర్లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ లోపే రజనీ మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం రజనీ, రాజశేఖర్ మధ్య ఆధిపత్య పోరు ఉంది. 2024లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన రజనీ ఓటమి తర్వాత ఇప్పుడు మళ్లీ చిలకలూరిపేట వైపు చూస్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు పర్మీషన్ ఇవ్వాలంటూ జగన్ కు రాయబారాలు పంపుతున్నారు. ఈ పరిణామాలు ఇష్టం లేకనే రాజశేఖర్, వైసీపీని వదిలెయ్యాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన రాజశేఖర్ కుదిరితే టీడీపీలోకి వెళ్తారని సన్నిహితులు చెబుతున్నారు. లేని పక్షంలో జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఏదేమైన వైసీపీ నుంచి బయటకు వెళ్లే జంప్ జిలానీల సంఖ్య పెరుగుతోంది. కూటమి మరింతగా బలపడుతోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…