నాడు జగన్ నేడు భువనేశ్వరి

By KTV Telugu On 20 October, 2023
image

KTV TELUGU :-

చంద్రబాబు నాయుడి అరెస్ట్ తో డీలా పడి ఉన్న పార్టీ శ్రేణుల్లో  నైరాశ్యం పోగొట్టడంతో పాటు  చంద్రబాబు నాయుడి అరెస్ట్ వార్త తట్టుకోలేక గుండెలు ఆగి మరణించిన అభిమానులు, పార్టీ నేతల కుటుంబాలను పరామర్శించడానికి  ఓదార్పు యాత్ర తరహాలో ఓ యాత్ర నిర్వహించాలని  టిడిపి నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి   వారానికి మూడు  రోజుల పాటు  కొన్ని కొన్ని కుటుంబాలను కలిసి వారిని పరామర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లవచ్చునని టిడిపి నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం  పేరుతో చంద్రబాబు నాయుణ్ని ఏపీ సిఐడీ సెప్టెంబరు 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ముందు ఆయన్ను హాజరు పర్చగా రిమాండ్ రిపోర్టు ను  పరిశీలించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. దాంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 40రోజులకు పైగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుణ్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  కక్షసాధింపు గా లేని కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించిందని టిడిపి ఆరోపిస్తోంది.

చంద్రబాబు నాయుడి అరెస్ట్ వార్త  తెలియగానే  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  టిడిపి అభిమానుల్లో కలకలం రేగింది. చంద్రబాబు నాయుణ్ని అమితంగా అభిమానించే  వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు గుండెలు ఆగి మరణించారని టిడిపి నాయకత్వం   ప్రకటించింది. వంద మందికి పైగా  ఇప్పటి వరకు బాబు అరెస్ట్ వార్త  తట్టుకోలేక మరణించారని   టిడిపి నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పై అభిమానంతో ఆయన జైలుకు వెళ్లడం భరించలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాల్సిన బాధ్యత  పార్టీపై ఉందని  భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణే  ఈ కుటుంబాలను పరామర్శిస్తే బాగుంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

గతంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తన తండ్రి మరణ వార్త విని గుండెలు ఆగి మరణించిన వారి కుటుంబాలను వారి ఇంటికే వెళ్లి పరామర్శించారు. దానికోసం మూడు విడతలుగా ఓదార్పు యాత్ర నిర్వహించారు. ప్రతీ కుటుంబాన్ని స్వయంగా  కలిసి వారికి చేతనైనా ఆర్ధిక సాయం అందించడమే కాకుండా మీకు ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.  ఓదార్పు యాత్ర  తో జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ కూడా పెరిగింది. జనంలో ఆయన  పేరు ముద్ర పడిపోయింది. అందుకే ఈ మార్గం ద్వారానే చంద్రబాబు సతీమణి కూడా పరామర్శ యాత్ర చేస్తే  బాధ్యత నెరవేర్చినట్లూ అవుతుంది..పార్టీ పట్ల ప్రజల్లోనూ  అవగాహన పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ యాత్ర నారా లోకేష్  చేయాలి. కానీ చంద్రబాబు నాయుడికి ఇంత వరకు బెయిల్ రాలేదు.  కొన్ని పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. కొన్ని హైకోర్టులోనూ కొన్ని ఏసీబీ కోర్టులోనూ పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ  మానిటర్ చేసుకోవలసిన బాధ్యత లోకేష్ భుజ స్కంధాలపై పడింది. ఆయన తన తండ్రి తరపున వాదించే న్యాయవాదులను  సమన్వయం చేసుకోవడం వారికి అవసరమైన డాక్యుమెంట్లు అందించడం ఇతరత్రా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం లో బిజీగా ఉన్నారు. ఆయన ఆ పనులు వదిలి పరామర్శ యాత్ర చేయడం  సాధ్యమయ్యేది కాదు. అందుకే లోకేష్ బదులుగా భువనేశ్వరి ని యాత్రకు సిద్ధం చేయాలని పార్టీ భావిస్తోందని అంటున్నారు.

వారంలో మూడు రోజుల పాటు యాత్ర చేసేలా షెడ్యూల్ చేయబోతున్నారు. ఈ యాత్ర చేస్తూనే చంద్రబాబు నాయుణ్ని ఎంత అన్యాయంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందో వివరించాలన్నది టిడిపి ఆలోచన. తన భర్త ఏ తప్పూ చేయని నిప్పులాంటి మనిషి అని..అనుక్షణం ప్రజలకోసమే ఆలోచిస్తూ ఉంటారని..భువనేశ్వరి అంటున్నారు. జైల్లో ఉండీ కూడా  ప్రజల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నారని ఆమె వివరించారు. ప్రజల కోసమే ఆయన  పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీసి జైలుకు వెళ్లారని ఆమె అంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి