ఏపీలో హిందూధర్మానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రతీ చోటా ఓ ప్రధాన మందిరమైనా ఉండేలా శ్రద్ధ చూపుతోంది. హిందూ విశ్వాసాన్ని పరిరక్షించడం ప్రచారం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. హిందూధర్మాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆలయాల్ని పరిరక్షించలేకపోతోందని బీజేపీ సహా విపక్షనేతలు ఆ మధ్య ఏపీ సర్కారుని టార్గెట్ చేసుకున్నారు. దానికితోడు కొన్ని ఘటనలు జరగటంతో జగన్ ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇలాంటి విమర్శలన్నింటికీ ఆలయాల నిర్మాణంతో చెక్ పెట్టబోతోంది వైసీపీ ప్రభుత్వం.
హిందూధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రచారం చేసేందుకు బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతోంది. తిరుమలలోని ఏడుకొండలవాడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రం. వెంకన్నకు అపరకుబేరుడన్న పేరుంది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఒక్కో ఆలయానికి 10 లక్షల చొప్పున కేటాయించింది.
మొత్తం 1,330 ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ జాబితాలో కొత్తగా మరో 1,465 ఆలయాలను చేర్చింది. అదే సమయంలో శాసనసభ్యుల అభ్యర్థనలను బట్టి రాష్ట్రంలో మరో 200 దేవాలయాలు నిర్మితమవుతాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ ఆలయాల నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 978 ఆలయాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
ఆలయాల పునరుద్ధరణతో పాటు ఆలయాల్లో ఆచార వ్యవహారాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 270 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 238 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. సీజీఎఫ్ ద్వారా పెద్ద ఎత్తున ఆలయాల అభివృద్ధికి పూనుకుంది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 1330 దేవాలయాల పనులు జరుగుతున్నాయి. మరో 1465 దేవాలయాలను అదనంగా నిర్మిస్తున్నామని వెల్లడించారు ఆ శాఖ మంత్రి సత్యనారాయణ. ప్రతీ 25 దేవాలయాల పర్యవేక్షణకు ఒక ఏఈవోని నియమిస్తారు.
ధర్మ పరిరక్షణే తమ ధ్యేయమంటోంది ఏపీ ప్రభుత్వం. ధర్మం పరిరక్షింపబడాలంటే ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆలయాలుండాలి. ఈ ఏడాది జనవరి 4వ తేదీ నాటికి 68 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. కొత్తగా నిర్మించే ప్రతీ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ధూపదీప నైవేద్యాలు చూసే అర్చకులకు 5 వేల గౌరవ వేతనం ఇవ్వబోతోంది. మతం పేరుతో ఎవరూ బురదచల్లే అవకాశం ఇవ్వకుండా ఆ ధర్మ పరిరక్షణనే తన బాధ్యతగా స్వీకరించింది వైసీపీ ప్రభుత్వం.