జగన్ ఓటమిని ఒప్పుకున్నారా ?

By KTV Telugu On 10 May, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో గెలుపు అనేది కౌంటింగ్ తర్వాత తెలుస్తుంది. కానీ గెలుస్తున్నాం అన్న భావన ముందు కల్పించాలి.  అది చాలా ముఖ్యం.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార తేదీని ప్రకటించారు. ఇది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అని చాలా మంది చర్చించుకున్నారు.  బీఆర్ఎస్ రక్షణాత్మక రాజకీయాలు చేసింది. ఇప్పుడు ఏపీలో అదే కనిపిస్తోంది.  కూటమి గెలుస్తోందని కాన్ఫిడెన్స్ గా దూకుడుగా ఉండగా…  ఎన్నికలు సరిగ్గా జరగవంటూ జగన్ చేస్తున్న ప్రకటనలు ఆయన నమ్మకం కోల్పోయారన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కారణం అవుతున్నాయి.

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో  డీలా పడిపోయింది.  కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని .. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పథకాలు రావని ఏదో జరిగిపోతుందని ప్రజల్ని భయపెట్టేందుకు ప్రయత్నించింది. అంతకు మూడు నెలల ముందు కేసీఆర్ ఓడిపోతారన్న ఊహే ఎవరికీ ఉండేది కాదు.   కానీ రాను రాను ఆ నమ్మకం తగ్గిపోయి.. చివరికి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరుగుతుందో చెప్పి ఓట్లు అడగాల్సి  వచ్చింది.  ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో జరిగినట్లుగానే జరుగుతోంది.  తన వెంట్రుక కూడా పీకలేరని బహిరంగసభల్లో సవాల్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి  వైనాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ రాను రాను ఆ ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపించడం లేదు.  ప్రచారం లో టీడీపీ మేనిఫెస్టోను హైలెట్ చేస్తున్నారు. అమలు చేయలేరని నమ్మవద్దని కోరుతున్నారు. చంద్రబాబు వస్తే ప్రజల పరిస్థితి పొయ్యిలో పడినట్లవుతందని అంటున్నారు. చివరికి ఎన్నికలు సరిగ్గా  జరుగుతాయన్న నమ్కకం లేదని.. తన వద్ద డబ్బు లేదని.. చంద్రబాబు ఎక్కువ డబ్బులు  పంచుతారని కూడా చెప్పాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఇలాంటివన్నీ ఓటమికి కారణాలను ముందే చెప్పుకోవడం అంటారు.

జగన్ మోహన్ రెడ్డి శైలి ఓడిపోయే ముందు   టీఆర్ఎస్ శైలినే కాదు.. 2019లో ఓడిపోయే ముందు చంద్రబాబు శైలిని కూడాగుర్తు చేస్తోంది. 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఉద్ధృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన ప్రచారంలో ఎక్కడా కాన్ఫిడెన్స్ అనేదే లేదు.  తన సహజశైలికి భిన్నంగా సభా వేదికల మీద నుంచి వంగివంగి దణ్ణాలు పెట్టారు. తాను శాశ్వతం కాదని.. రాష్ట్రం శాశ్వతమని  చెప్పారు. కానీ ఆయన ఓటమి భయంతోనే అలా చేశారని ఎక్కువ మంది అనుకున్నారు. ఓడిపోతారని తెలిసే వంగి వంగి దండాలు పెడుతున్నారని అనుకున్నారు. చివరికి అదే  నిజమయింది.  ఇప్పుడు జగన్ ఎన్నికల ప్రచారం అప్పట్లో చంద్రబాబునే తలపిస్తోంది. జగన్ వంగి వంగి దండాలు పెట్టడమే తక్కువ కానీ మిమ్మల్నే నమ్ముకున్నానని పదే పదే బేలగా అడగడం మాత్రం కామన్ అయిపోయింది. తనను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ చంద్రబాబు  ప్రభావంతో పని చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.  ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ అధ్యక్షుడు అంటున్నారు.

అదే సమయంలో జగన్ ప్రచారంలో పదును లోపించింది. కూటమితో పోలిస్తే వైఎస్ఆర్‌సీపీ రాజకీయ ప్రచారం తేలిపోయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బస్సు యాత్ర  నిర్వహించారు పార్లమెంట్ నియోజకవర్గానికో సభ పెట్టాలనుకున్నారు కానీ సగం చోట్ల పెట్టలేకపోయారు. బస్సు యాత్ర ముగియనే వంద  ప్రచార సభల్లో జగన్ పాల్గొంటారని ప్రకటించారు. కానీ బస్సు యాత్ర ముగిసే సరికి నామినేషన్ల గడువు కూడా పూర్తయింది. ఆ తర్వాత కూడా జగన్ ప్రచారం అంత జోరుగా సాగలేదు.రెండు రోజులకోసారి  విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫలితంగా ఇప్పటి వరకూ కనీసం ఇరవై  నియోజకవర్గాల్లోనూ సభలు పెట్టలేకపోయారు.  ఓ ముఖ్యమంత్రి పార్టీ విజయం కోసం ఇంత పేలవంగా ప్రచారం చేయడం ఇప్పటి వరకూ ఎప్పుడూ లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కేసీఆర్ తెలంగాణలో 117 నియోజకవర్గాలే ఉన్న 100 చోట్ల సభలు పెట్టారు. కేటీఆర్, హరీష్, కవిత స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. వైసీపీకి అలా ప్రచారం చేసే వాళ్లు కూడా లేరు. గత ఎన్నికల సమయంలో మోహన్ బాబు, అలీ, ఫృధ్వీ , వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల సహా అనేక మంది ప్రచారం చేశారు. ఇప్పుడు వారెవరూ కనిపించడం లేదు. అలాగే తన ప్రచారసభల్లో మేనిఫెస్టో గురించి కూడా చెప్పలేకపోతున్నారు.

వైసీపీ అనుకున్న దాన్నికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది.. వలంటీర్లు, అధికార యంత్రాంగంతో చక్రం తిప్పవచ్చని అనుకున్న అధికారపక్షానికి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయంటున్నారు. డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీలను బదిలీ చేసిన క్రమంలో  ఛీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి  ఇంకా చాలా నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం జరగలేదు. దాంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగనే స్వయంగా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో  పార్టీ క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తుంది.  ఇవన్నీ ఓడిపోవడానికి సిద్ధమన్నట్లుగానే ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనాకు వచ్చేస్తున్నాయి.

రాజకీయం అంటే ఇప్పుడు మైండ్ గేమ్ కూడా. ఆ మైండ్ గేమ్ లో వెనుకబడితే అసలు గేమ్ లో ఆత్మ విశ్వాసం లోపిస్తుంది. అదే జరిగితే ఎన్నికల యుద్ధంలో గెలవడం కష్టం. ఈ విషయంలో గతంలో పైచేయి సాధించిన జగన్ ఇప్పుడు వెనుకబడిపోతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి