అరెస్టు భయంతో వణుకు..

By KTV Telugu On 30 June, 2024
image

KTV TELUGU :-

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంతో  వణికిపోతున్నట్లుగా  సమాచారం. తన అరెస్టు అనివార్యమని ఆయనకు అనిపిస్తోంది. గతంలో తాను చేసిన పనులకు ఈ సారి మూల్యం చెల్లించుకోకతప్పదని జగన్ గుర్తించారు. అందుకే ఇప్పుడాయన ఏదో విధంగా కొంత వెసులుబాటు పొందే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఎంత త్వరగా  ప్రతిపక్ష నేత హోదా వస్తే అంత మంచిందని టెన్షన్ పడుతున్నారు. ఏపీ ప్రస్తుత ప్రభుత్వ వైఖరి చూస్తే చంద్రబాబు ముందే  ఫిక్సయ్యారన్న అనుమానాలు జగన్ కు కలుగుతున్నాయి….

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పిక్చర్ క్లియర్ అయిపోయింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయడంతో తన భవిష్యత్తు ఏమిటో జగన్ కు తెలిసిపోయింది. గతంలో చంద్రబాబును తాను అరెస్టు చేసిన తీరు ఆయన కళ్లలో మెదులుతోంది.  చంద్రబాబును లాక్కెళ్లిన పోలీసులే తనను పట్టుకెళ్తారని ఆయన అర్థం చేసుకున్నారు. గతంలో చెల్లి షర్మిలా రెడ్డి తిరుగుబాటు చేసిన సందర్భంలోనే తల్లి విజయలక్ష్మి దగ్గర జగన్ వాపోయినట్లు వార్తలు వచ్చాయి. ఒక సారి తాను ఓడిపోతే  జైలుకు వెళ్లడం ఖాయమని  అప్పుడు బయటకు రావడం కూడా కుదరదని జగన్ ఆందోళన చెందారు. అయితే షర్మిల మాత్రం  పట్టు వీడకుండా పోరాడారు. తాను గెలవకపోయినా జగన్ ను ఓడించారు. నాటి భయమే నేడు జగన్ ను వెంటాడుతోంది. చంద్రబాబు తలచుకుంటే ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే  కొంతవరకైనా వెసులుబాటు  పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు…

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ పట్టుబడుతున్నారు. అది అసాధ్యమని, టీడీపీ ప్రభుత్వం అటువంటి  పని చేయదని   తెలిసి కూడా ఆయన  తన డిమాండును కొనసాగిస్తున్నారు. గతంలో చంద్రబాబును ఏడిపించిన సంగతి మరిచిపోయినట్లుగా జగన్ నటిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్ మహి మీద ఆడారు. లేని కేసును సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారు. ఎంతమంది వద్దని వారించినా వినలేదు. పట్టుబట్టి మరీ అరెస్టు చేశారు. అప్పట్లో చంద్రబాబుకు  23 మంది ఎమ్మెల్యేలుండేవారు. తాను తలచుకుంటే అందరూ వైసీపీ వైపుకు  వచ్చేస్తారని, పోనీలే అని వదిలేస్తున్నానని  అప్పట్లో జగన్ ఎగతాళి చేశారు. అప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష నేత  హోదా కూడా దక్కదని ఆయన సవాలు చేశారు. వాటన్నింటినీ గుర్తుపెట్టుకున్న  ఏపీ ప్రజలు..ఎన్నికల్లో వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రతిపక్ష నేత హోదా రావాలంటే కనీసం 18 స్థానాలు అవసరమైన నేపథ్యంలో ఇప్పుడు జగన్ కు దిక్కుతోచడం లేదు. అధిక సంఖ్యాక పార్టీగా తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు ఆయన లేఖ రాశారు.  అందుకు ప్రత్యేకమైన  కారణాలే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు  కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. మంత్రికి ఉండే  విశేషాధికారాలన్నీ ఆయనకు సంక్రమిస్తాయి. కొన్ని చట్టపరమైన రక్షణలు కూడా పొందే అవకాశం ఉంటుంది.ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. చెప్పకుండా అరెస్టు చేస్తే చట్టపరమైన సమస్యలు వచ్చి  పడతాయి.  ఆ హోదా లేని పక్షంలో చెప్పాపెట్టకుండా అరెస్టు చేసే  వీలుంటుంది. అందుకే జగన్ టెన్షన్  పడుతున్నారు. తన అరెస్టును ఎవరూ ఆపలేరన్న భయం ఆయన్ను వెంటాడుతోంది.

అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం వ్యవహరిస్తే ఓడిపోయిన తర్వాత ఏమవుతుందో జగన్ కు ఇప్పుడిప్పుడే  అర్థమవుతోంది. పైగా వైసీపీ వాళ్లు చేసిన కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది. కొత్త కట్టడాలు కూల్చివేయకుండా వైసీపీ వాళ్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే జగన్ ఇప్పుడు దేవుడి మీద భారం  వేసి కూర్చున్నట్లుగా ఉంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి