బాబు అరెస్ట్ పై నోరు విప్పిన జగన్

By KTV Telugu On 11 October, 2023
image

KTV TELUGU :-

చంద్రబాబు నాయుడిపై తనకు ఎలాంటి కక్షా లేదని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. ఏ తప్పూ చేయకపోయినా చంద్రబాబు నాయుణ్ని రాజకీయ కక్షసాధింపుకోసమే  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని  తెలుగుదేశం పార్టీతో పాటు దాని మిత్ర పక్షం అయిన జనసేన కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  బాబు అరెస్ట్ తో తనకు సంబంధమే లేదని జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇపుడు ఏ కేసులో అయితే చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేశారో ఆ కేసు దర్యాప్తు ఆరంభం అయ్యే  సమయంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతిని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు

ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నా ఇప్పట్నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేస్తున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి . పార్టీ తరపున వివిధ స్థానిక సంస్థలు, చట్టసభలకు  ఎన్నికైన  వారితో  జగన్ మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో ఆరంభించనున్న  వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం  గురించి వివరించిన జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం చేసిన మంచిని జనంలోకి బాగా తీసుకెళ్లాలని వారికి సూచించారు. అదే విధంగా  ప్రధాన  ప్రతిపక్షాలు చేస్తోన్న  అసత్య ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించాలని  పేర్కొన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణలు వారి పొత్తుల ఎత్తుగడలను ప్రస్తావిస్తూ  చంద్రబాబు నాయుణ్ని ఎవరూ కూడా కక్ష తో అరెస్ట్ చేయలేదు అన్నారు. చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసే సమయానికి తాను దేశంలో కూడా లేనని లండన్ లో ఉన్నానని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా ఉండగానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఓ భారీ అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జి.ఎస్.టి. అధికారులే  కనిపెట్టారని జగన్ గుర్తు చేశారు. ఆ తర్వాత దానిపై లోతుగా  దర్యాప్తు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేటేనని అన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా  చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు తరలించిన రూట్ మొత్తాన్ని   ఆధారాలతో పట్టుకుంది కూడా ఈడీ అధికారులే అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చివరకు వందల కోట్ల రూపాయల ఆదాయం గురించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐటీ అధికారులే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన వైనాన్ని  జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు.

ఆధారాలతో దొరికిపోయినా  చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేయకూడదని.. ఆధారాలు ఉన్నా న్యాయ స్థానం ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించనే కూడదని టిడిపి నేతలు పట్టుబడుతున్నారని  జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడికి అన్ని విషయాల్లోనూ పార్టనర్ అయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు  అవినీతిలోనూ పార్టనర్ కాబట్టే ఆయనకు మద్దతు గా నిలబడ్డారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చట్టం ముందు అంతా సమానమే అన్నారాయన. తప్పు చేసిన వారుఎంతటి పెద్ద హోదాలో ఉన్నా  శిక్ష తప్పదన్నారు.

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో  రాష్ట్రంలోని ప్రతీ ఇల్లూ..ప్రతీ గ్రామం..ప్రతీ నియోజక వర్గంలో  అన్ని రంగాల్లోనూ చెప్పుకోదగ్గ మంచి మార్పులు వచ్చాయన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయ రంగం ఇపుడు  హాయిగా ఉందన్నారు. ఇంత మార్పు వచ్చింది కాబట్టే వై నాట్ 175 అని తాను అంటున్నానని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టిడిపి హయాంలో జరగని మేలు మన ప్రభుత్వంలో జరిగింది. మన పాలనలో మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. వారే మనల్ని ఆశీర్వదిస్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విపక్షాలు ఎన్ని కలిసినా తనకు బెంగే లేదన్నారు జగన్. టిడిపి జనసేనలను సున్నాలతో పోల్చిన జగన్ మోహన్ రెడ్డి రెండు సున్నాలు కలిస్తే  వచ్చేది కూడా సున్నాయే కదా అన్నారు. వీళ్లకి మరో రెండు సున్నాలు కలిసినా మనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని  నాలుగు సున్నాలు కూడా సున్నాయే అవుతుందని ఆయన చమత్కరించారు. మొత్తానికి ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రగిలించారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి