అదానీ ముడుపుల వ్యవహారం తెలుగు రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. మాజీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం ఆరోపణల క్షిపణులను పేల్చుతోంది. అదానీ నుంచి 17 వందల 50 కోట్ల రూపాయలు ముడుపులు పొందినట్లు జగన్ రెడ్డిపై అమెరికా దర్యాప్తు సంస్థలే నిగ్గు తేల్చాయి. ఈ క్రమంలో జగన్ రెడ్డి ఆయన పార్టీ ఫుల్ డిఫెన్స్ లో పడిపోతే…వేడిలో వేడిగా కొట్టిపడెయ్యాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్ష స్థానం కోసం డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న జగన్ రెడ్డిని పూర్తిగా ఇరకాటంలో పెట్టాలంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని కూటమి నేతలు భావిస్తున్నారు….
ఏపీ అసెంబ్లీ ప్రస్తుత సమావేశాలు ముగుస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలతోనూ, మీడియాతోనూ మాట్లాడినప్పుడు జగన్ రెడ్డికి అందిన ముడుపుల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ముడుపుల మసకతో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తి లేదన్నారు. వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంలో గత జగన్ ప్రభుత్వానికి 1,750 కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వ సంస్థలు చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో జగన్ను ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ‘‘అన్ని కోణాల నుంచీ పరిశీలిస్తున్నాం. ఏం చేయగలమన్నదానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం. ఇక్కడ మన పరిధి ఎంతవరకూ ఉంది.. చట్టపరంగా ఏం చేయగలమో.. నిపుణుల అభిప్రాయం తెలుసుకున్నాక నిర్ణయానికి వస్తాం’ అని చంద్రబాబు బదులిచ్చారు. అదే సమయంలో తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు.. ఆయన ఆచితూచి స్పందించారు. ‘పెట్టుబడులు పెట్టేవారి విశ్వాసం దెబ్బ తినకుండా.. అదే సమయంలో ప్రజల కోణంలో కూడా ఆలోచించి నిర్ణయానికి వస్తాం. అన్ని వైపుల నుంచీ ఆలోచిస్తాం’ అని తెలిపారు.
జగన్ రెడ్డి వ్యవహారాన్ని చంద్రబాబు సీరియస్ గానే తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి జగన్ పై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎలాంటి స్కాము జరగకపోయినా చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని అందుకే ఈ సారి జగన్ ను వదిలిపెట్టకూడదని చంద్రబాబుపై టీడీపీ నేతలు వత్తిడి చేస్తున్నారు. మెతక వైఖరి పాటించే చంద్రబాబు వెనక్కి తగ్గినా తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. చంద్రబాబు చర్యలు తీసుకునే వరకు ఆయనపై వత్తిడి చేస్తామని పార్టీ వర్గాలు అంటున్నాయి. పైగా జనసేన నేతలు వైసీపీపై తీవ్ర కసితో ఉన్నారు. ఐదేళ్ల పాటు జనసైనికులను వైసీపీ నేతలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కక్షసాధింపుకు దిగక తప్పదని ఆ పార్టీ వర్గాలు కుండబద్దలు కొడుతున్నాయి…
మాజీ సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఆ పని ఎలాగూ టీడీపీ చేతుల్లోనే ఉంది. పైగా జగన్ రెడ్డికి ప్రజల్లో సింపథీ కూడా లేదని టీడీపీ అంచనా వేసుకుంటుంది. జగన్ రెడ్డిపై ఇప్పుడున్న కేసులతో పాటు 17 వందల 50 కోట్ల ముడుపుల కేసును నమోదు చేస్తే.. ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టే వీలుంటుందని టీడీపీ వర్గాలు నమ్ముతున్నాయి. పైగా జగన్ కు ఎలాగూ అవినీతి అనకొండగా పేరున్నందున ఆయనపై చర్యలు తీసుకున్నా జనం పెద్దగా బాధపడే అవకాశాలు లేవని టీడీపీ నేతలు అంటున్నారు. కొంత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు గొడవ చేసినా…దాన్ని పోలీసు చర్యలతో మేనేజ్ చేసే వీలుంటుందని విశ్వసిస్తున్నారు. అందుకే ఈ సారి జగన్ రెడ్డి విషయంలో దూకుడునే ప్రదర్శించాలని చంద్రబాబు, లోకేష్ కు నూరిపోస్తున్నారు. అంతే జగన్ పై చర్యలకు ఎక్కువ సమయం లేదని మనం అనుకోవాల్సి ఉంటుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…