ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితలు ఆసక్తికరంగా మారాయి. గెలుపోటములపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అంతిమంగా ఎక్కువ మంది తేలుస్తున్న విషయం ఏమిటంటే.. జగన్ కు రాయలసీమ అత్యంత కీలకం. గత ఎన్నికల్లో సాధించిన తరహా ఫలితాలను సాధిస్తేనే ఆశలు ఉంటాయి. లేకపోతే కష్టమే. మరి రాయలసీమలో పరిస్థితి అలాగే ఉందా ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్ సాధించడానికి 88 స్థానాల్లో విజయం సాధించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ గత ఎన్నికల్లో 49 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అదే సమయంలో వైసీపీకి ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.
రాయలసీమలో మొదటి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీకి బలం ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేసుకున్నప్పటికీ రాయలసీమలో తక్కువ సీట్లే వచ్చాయి. ఉమ్మడి ఏపీలోనూ అదే పరిస్థితి. 2004లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ రాయలసీమ జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను 38 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2009లో 32 సీట్లను గెల్చుకుంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. 2014లో వైసీపీ 30 సీట్లను గెల్చుకుంది. టిడిపి 22 సీట్లు గెలుచున్నా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అందుకే వైసీపీ ఈ సారి రాయలసీమలో ఎలాంటి బల ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు వైసీపీ అదే బలాన్ని నిరూపించుకుంటుందా అన్నది పెను సవాల్ గా మారింది. ఎందుకంటే సొంత సోదరి షర్మిల టీ పీసీసీ చీఫ్ గా బాద్యతలు చేపట్టి వీలైనంత బలమైన అభ్యర్థులను నిలబెట్టారు. మరో వైపు ఐదేళ్ల పాలనలో రాయలసీమ అభివృద్ధిపై, సాగునీటి ప్రాజెక్టులపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉందని చెబుతున్నారు. రాజధానిని ఎక్కడో విశాఖకు తరలిస్తామని చెప్పడం కూడా మైనస్ గమారింది. అదే సమయంలో “ల్యాండ్ టైటిల్ అంశాన్ని” విపక్షాలు జనంలోకి బలంగా తీసుకువెళ్లాయి. ఇవే కాకుండా మిగతా అంశాలు కూటమికి మేలు చేస్తాయని కూటమి నాయకులు విశ్వసిస్తున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నా.. ఎన్నిసీట్లు కోల్పోతే.. అధికారానికి వైసీపీ అంత దూరంగా జరిగినట్లవుతుంది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం వల్ల రాయలసీమలో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా.. ఉత్తరాంద్ర నుంచి నెల్లూరు వరకూ గట్టి సవాళ్లు వైసీపీకి ఎదురయ్యాయి. చాలా వరకూ నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనే ఉంది. అందుకే ఫలితాల విషయంలో అంత నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. కడపలోనూ ఈ సారి గట్టి పోటీ ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో వైసీపీ అధికారం నిలబెట్టుకుంటామని బెరుగ్గానే చెబుతున్నారు. రాయలసీమలో అత్యధిక సీట్లు సాధించడం వైసీపీకి కీలకం. ఎన్ని సీట్లు మైనస్ అయితే.. ఆ పార్టీ అంతగా అధికారానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కోణంలోనే తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఎంత బలపడితే అంత ఈజీగా అధికారంలోకి వస్తుంది.
రెడ్డి సామాజికవర్గం రాయలసీమలో ఒకే చోట ఉండటం వైసీపీకి ప్లస్ అవుతోంది. అయితే మిగిలిన చోట్ల అలాంటి ఓటు బ్యాంక్ లేకపోవడం సమస్యగా మారుతోంది. ప్రజలు ఎలా ఆలోచించారో జూన్ నాలుగో తేదీన క్లారిటీ వస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…