ఎన్నికల్లో ఓటమి చెందిన కొద్ది రోజులకే వైసీపీ దిక్కులేని పార్టీగా మారే ప్రమాదం ఏర్పడింది. జగన్ పేరు చెబితేనే పార్టీ నేతలు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది పూర్తిగా మొహం చాటేస్తే, మరికొంతమంది అర్థం కాని, అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు. దానితో కేడర్ ఇప్పుడు అయోయమానికి లోనవుతోంది… ఏం చేయాలో వారికి దిక్కుతోచక నానా తంటాలు పడుతున్నారు. నేతలంతా కలుగులో దాక్కునేందుకు ఇష్టపడటంతో దిశానిర్దేశం చేసే వారు లేక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న…….
పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ నిర్మించుకున్న విలాసవంతమైన సౌధాలను టీడీపీ ప్రభుత్వం కూల్చేస్తోంది. అక్రమ కట్టడాలను వదిలేది లేదని ప్రభుత్వ పెద్దలు తేల్చేసి చెబుతున్నారు. కూలుతున్నదీ కట్టడమా లేక వైసీపీ నేతల అహంకారమా అన్న ప్రశ్నతలెత్తుతోంది. గతంలో చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకుంటున్నారని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా మాజీ సీఎం జగన్ రెడ్డి పులివెందుల వెళ్లిపోయిన తీరు కూడా వైసీపీలో అసహనానికి కారణమవుతోంది. పులివెందుల సన్నివేశాలు కూడా వైసీపీ శ్రేణులను పునరాలోచనలో పడేశాయి. నలుగురు మాజీ ఎమ్మెల్యేలు తప్పితే మిగతా లీడర్లు ఎవరూ జగన్ ను ఆహ్వానించేందుకు కూడా రాలేదంటే దూరంగా ఉండేందుకే నేతలు ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇదీ పార్టీలోనే జగన్ ఒంటరి అయ్యాడని చెప్పేందుకు సూచనగా భావించారు. ఒకప్పుడు హై హై నాయకా అన్న వాళ్లే ఇప్పుడు నయ్ నయ్ నాయకా అని చెప్పుకునే దుస్థితి వచ్చేసింది. ఈ ఐదేళ్లు మమ్మల్ని వదిలెయ్యిబాబు బతికుంటే బసుసాకు తినేసి… 2029లో కనిపిస్తామన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు.
వైసీపీ పాలనలో చక్రం తిప్పిన కొందరు నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టికెట్లు లాక్కుని, కావాల్సిన వాళ్లకు టికెట్లు ఇప్పించుకుని నానా గందరగోళానికి కారణమైన వాళ్లు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఒకటిరెండు సార్లు జనంలో కనిపించిన కొందరైతే ఏదేదో మాట్లాడేసి పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారు. మాట్లాడటానికి సమయం కాదని తెలిసి కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు….
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఐదేళ్ల పాటు తెగ ఎంజాయ్ చేశారు. ఎక్కువ సార్లు మీడియా ముందుకు వచ్చినది కూడా ఆయనే. జగన్ చర్యలను ఎక్కువగా డిఫెండ్ చేసిన నాయకుడు కూడా ఆయనే కావచ్చు. ఇప్పుడాయన ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ప్రభుత్వం మారిన తర్వాత ఒకటిరెండు ప్రెస్ మీట్స్ పెట్టిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఇక పిల్లలకు టికెట్లు ఇప్పించుకున్న నేతలు కొంతమంది ఇప్పుడు హైదరాబాద్లో రిలాక్స్ అవుతున్నారు. అలాంటి వారిలో పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వారున్నారు. మంత్రులుగా చేసిన వారిలో చాలా మంది ఎస్కేప్ అయిపోయారు. అరెస్టుల పర్వం మొదలవుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పల్రాజు లాంటి వారు మాత్రమే కాస్త మాట్లాడుతున్నారు. వారి కూడా ఆచి తూచి మాత్రమే డైలాగులు వదులుతున్నారు. మరో పక్క కొందరు నేతలు మాట్లాడుతున్న మాటలు పార్టీకి డేమేజ్ చేస్తున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే బురద జల్లుతున్నారు. కొందరు వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై అమర్యాదగా మాట్లాడం ప్రజలు సహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని వివరించారు. పార్టీలోని పెద్దలకు ముందుగానే చెప్పినా వారు వినలేదని తెలిపారు. తమ పార్టీ ఓటమిపై నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విచారించగా కొన్ని విషయాలు తెలిశాయని మహేష్ రెడ్డి తెలిపారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేష్ ఇలా మాట్లాడటం ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనంగా నిలుస్తోంది….
టికెట్ దక్కని వాళ్లు అదృష్టవంతులు, ఓడిన వారు దురదృష్టవంతులు అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారైంది. జగన్ వెంట కనిపిస్తేనే కక్షసాధింపు మొదలవుతుందన్న భయం కొంత మంది నేతల్లో కనిపిస్తోంది. కొంతకాలం దూరంగా ఉందాం… తర్వాత చూసుకుందాం అన్నట్లుగా వాళ్లు ప్రవర్తిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…