కేసీఆర్‌ ఓటమి – జగన్‌కు భయం

By KTV Telugu On 15 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడంతో ఏపీలో సీఎం జగన్ కు భయం ప్రారంభమయింది. వెంటనే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో  ఫుట్ బాల్ ఆడేస్తున్నారు. వంద మందిని మార్చేస్తామని ప్రచారం ప్రారంభించారు.  ఈ పరిణామం వైసీపీలో గందరగోళానికి దారి తీస్తోంది.   ఆ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా  స్థిమితంగా లేరు. తమ కు టిక్కెట్ ఉందో లేదోననని కంగారు పడుతున్నారు. ఓ రకంగా ఈ పరిస్థితి వైసీపీలో పరిస్థితిని దిగజారుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనకుంటున్న నేతలకు ఒక్కసారిగా కుదుపు. ఉన్నట్టుండి ఇంత మందిని మార్చేస్తారా అని వాళ్లు అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మొత్తం 100 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నాని హైకమాండ్ సంకేతాలు పంపుతోంది. మీడియాకు పేర్లు కూడా లీక్ చేస్తోంది.

తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో జగన్ రెడ్డిలో తెలియని వణుకు ప్రారంభమయిది.  తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి.  అందుకే జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చాలని డిసైడయ్యారు.  అనుకున్నదే తడవులుగా  ఐ ప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంచార్జుల మార్పుపై దృష్టి సారించారు.  పదకొండు నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పు  ప్రారంభమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఇంచార్జుల్ని మార్చాలనుకున్న చోట శరవేగంగా మార్చేసి.. పనితీరున అంచనా వేయాలనుకుంటున్నారు. రెండు-మూడు జిల్లాలకే 11మందిని మార్చేస్తే.. మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైంది.  ఇచ్చాపురం మొదలుకుని కుప్పం వరకూ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.  కొంతమంది సైలంట్ గా ఉంటే.. మరి కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు.

వైస్సార్సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి కోసం ఐపాక్ టీమ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే కదా.. ఈ సంస్థ గ్రౌండ్ లెవల్‌లో చేసిన సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగాలేదన్న రిపోర్టు వచ్చింది. కనీసం 100స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలింది. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని అంటున్నారు.   ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. మార్పులకు కారణం ఏంటో పార్టీ నేతలే నేరుగా చెబుతున్నందున దీనిపై పెద్దగా చర్చ కూడా ఏం లేదు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తున్నామని చెబుతున్నారు కాబట్టి.. పాత అభ్యర్థులతో వెళితే ఈ సీట్లలో ఓడిపోతారని అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అదే అభిప్రాయానికి వస్తున్నారు.

అభ్యర్థుల మార్పుపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతున్నప్పటికీ..  తెలంగాణ ఎన్నికల ఫలితాలు దీనిని మరింత ముందుకు నెట్టాయి తెలంగాణలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ స్థానాల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్ విశ్లేషిస్తోంది. ఆ పార్టీ ఆ విషయాన్ని ముందే గుర్తించినప్పటికీ.. అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో మారిస్తే.. తమపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ముందే ఒప్పుకున్నట్లు అవుతుందని.. లేకపోతే.. వాళ్లు వేరే పార్టీలోకి వెళితే ఇబ్బంది ఎదురవుతుందని కేసీఆర్ మొండిగా ముందుకెళ్లారు. కేసీఆర్‌ది ఓ రకమైన మెండితనమైతే జగన్ ది మరోరకం. ఆల్రెడీ 175 అని టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్ ఈ విషయంలో వెనక్కు తగ్గేలా లేరు. ఏది ఏమైనా సరే ఏలాంటి ఫలితం వచ్చినా సరే ముందుకే అన్నట్లుగా ఉన్నారు.  కానీ గుడ్డిగా రాయి విసిరితే ఎప్పుడో ఓ సారి తగులుతుంది కానీ ఎక్కువ సార్లు రివర్స్ అవుతుందని ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు.అసలు ఏపీలో వైసీపీ రాజ్యం వేరుగా ఉంది. అక్కడ ఎమ్మెల్యేలకూ పెద్దగా ప్రాధాన్యయం లేదు. మరి అలాంటప్పుడు వ్యతిరేకత ఉండేది సీఎంపైన.. ఎమ్మెల్యేలపైనా ?

సీఎం జగన్ సగం మంది మంత్రులకూ టిక్కెట్లు లేవని సంకేతాలు పంపుతున్నారు.   జాబితాలో ఫైర్ బ్రాండ్ నేతలు కూడా ఉన్నారు.  అయితే అసలు  పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత ఉంటే సీఎం జగన్ పై ఉండకుండా ఉంటుందా అని చాలా మందిలో వస్తున్న సందేహం.  వాస్తవానికి ఏపీలో  సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న సరికొత్త పాలనా వ్యవస్థలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులు.

వైసీపీలో పేరుకే ఎమ్మెల్యేలు.  కనీసం వాలంటీర్ కు ఉన్న విలువ లేదు. కుదిరితే దందాలు చేసుకోవడం.. లేకపోతే సైలెంట్ గాఉండటం మినహా వారు చేసిందేమీ లేదు.  చూసినా మొత్తం జగనే. సర్వం   అన్నట్లుగా పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ.. ఇతర అంశాల్లో కానీ ఎమ్మెల్యేల ప్రమేయం లేదు. తమకన్నా వాలంటీర్లు నయమని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఓ వైపు నిధులు ఇవ్వకుండా.. మొత్తం అధికారాలు జగన్మోహన్ రెడ్డి వద్ద దఖలు పర్చుకుని చిన్న చిన్న పనులు కూడా వాలంటీర్లతో చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు.

ఈ నాలుగున్నరేళ్లలో   నియోజకవర్గానికి రూ. కోటి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి లేదు. కానీ బిల్లుల వస్తాయని  పార్టీ నేతలతో చేయించిన పనులు బిల్లులు మాత్రం కోట్లకు కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.  తమ ప్రభుత్వంపై అసంతృప్తి లేదని.. ఎమ్మెల్యేలపైనే ఉందని.. ఎమ్మెల్యేలందర్నీ మార్చేస్తే.. మళ్లీ వైసీపీకే పట్టం కడతారన్న వ్యూహంతో జగన్ ఉండటం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో మంత్రులు కూడా నిమిత్రమాత్రమే.  వారికి శాఖల కేటాయింపు మాత్రమే ఉంటుంది. వారికి కనీసం సచివాలయానికి వచ్చి వారి శాఖపై సమీక్ష చేసే స్వేచ్చ కూడా ఉండదు. మంత్రులు అయినా వారు వారి నియోజకవర్గాల్లోనే ఉంటారు.  ప్రెస్ మీట్లు పెట్టాలంటే జిల్లా కేంద్రాల్లో పెడతారు. ఏపీలో ఐదుగురు ఉపముఖ్యమమంత్రులు ఉన్నారు. కనీసం వారి శాఖల గురించి కూడా వారికి స్పష్టత ఉండదు. మొత్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిత్త మాత్రంగా పరిపాలన ఉంది. కానీ ఇప్పుడు వారినే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణంగా చూపించడం మాత్రం జగన్ మార్క్ రాజకీయం అనుకోవచ్చు.

మరో వైపు  మార్పులు వైస్సార్సీపీలో కాస్త అలజడిని సృష్టిస్తున్నాయి. మంగళగిరి టికెట్ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చెప్పేశారు. సీటు వస్తుందని ఆశించిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు బయట పార్టీవైపు చూస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే సుధాకరబాబునూ పక్కన పెట్టేశారు. చాలా మంది మంత్రులను పక్కన పెడుతున్నా.. వాళ్లంతా జగన్ కు సన్నిహితులు కావడంతో ఏం అనలేని పరిస్థితి.  వై నాట్ 175 అన్న వైసీపీ.. ఉన్న కాండిడేట్లను ఇలా మార్చుకోవడంపై  ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఓటమి  భయంతోనే ఇలాంటి మార్పులన్న సంకేతాలు సహజంగానే ప్రజల్లోకి వెళ్తాయని ఆ  పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ తాను చేసే రాజకీయమని గట్టిగా నమ్ముతారు.తెలంగాణ ఫలితాలు ఏపీలో ప్రభావం చూపిస్తాయని అనుకున్నారు. కానీ నేరుగా సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయని ఎవరూ అనుకోలేదు.  కానీ ఎక్కువగా ఆయనే భయపడుతున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి