ఆంధ్రప్రదేశ్ లో వింత హత్యా రాజకీయాలు

By KTV Telugu On 12 February, 2023
image

మరణాలు ఎప్పుడూ విషాదాలనే మిగులుస్తాయి. ఎవరి మరణాలైనా సరే.రాజకీయ నేతల మరణాలు మాత్రం ఎడతెగని దిగజారుడు రాజకీయాలకు దారి తీస్తాయి. మన దేశంలో రాజకీయ నేతల హత్యలు మరణాలు రెండూ కూడా వివాదాలనూ రాజకీయాలనూ రాజేశాయి. వాటికి ఎక్స్పైరీ డేట్లు కూడా ఉండవు. ఎప్పుడో జరిగిన హత్యలు మరణాలు కూడా మళ్లీ మళ్లీ రాజకీయాల్లో తెరపైకి రావచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ఇపుడు ఒక అంశంపై రాజకీయం చేస్తోంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి స్వయానా చిన్నాన్న వై.ఎప్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిపైనా ఎంపీ అవినాష్ రెడ్డిపైనా ఆరోపణలు చేస్తోంది తెలుగుదేశం. తాజాగా వివేకానంద రెడ్డి హత్యా ఘటనపై ఏకంగా ఓ పుస్తకాన్ని ప్రచురించి జనంపైకి వదిలింది టిడిపి. అందులో వై.ఎస్.కుటుంబానికి చెందిన మహిళల ఫోటోలు కూడా ప్రచురించారు. హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డే అన్నది పుస్తకంలో హైలెట్ చేశారు. ఈ పుస్తకంపై పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ భగ్గు మంటోంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో టిడిపి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. అవినాష్ రెడ్డే హత్య చేశాడని ఆరోపిస్తోన్న టిడిపి నేతలు అపుడు అవినాష్ రెడ్డి పేరును ఎఫ్.ఐ.ఆర్.లో ఎందుకు పెట్టలేదో చెప్పాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. హత్య జరిగినపుడు చంద్రబాబే సిఎంగా ఉంటే హంతకులను ఎందుకు పట్టుకోలేదో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. వివేకానంద రెడ్డి భార్య కూతురుతో పాటు అల్లుడిని ఎందుకు విచారించలేదో కూడా జవాబు చెప్పాలంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు.

నిజంగానే వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు కావస్తోంది. అపుడు చంద్రబాబు ప్రభుత్వం అసలు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపించింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్యోదంతాన్ని రాజకీయంగా వాడుకోడానికి ఏ మాత్రం వెనుకాడలేదు టిడిపి. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సొంత బాబాయ్ నే గొడ్డలితో నరికి చంపేశారు అంటూ జగన్ మోహన్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తులో ఉంటే చంద్రబాబు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కోర్టు కెక్కడంతో వివేకా హత్య గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని న్యాయస్థానం చంద్రబాబును ఆదేశించింది. అయితే అప్పటికే సగం ప్రచారం అయిపోయింది. చంద్రబాబు ఆరోపణలు జనంలోకి వెళ్లిపోయాయి. చంద్రబాబు విమర్శలను జనం నమ్మలేదు కాబట్టే ఆ ఎన్నికల్లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 151 స్థానాలు కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేశారు ఏపీ ప్రజలు. ప్రత్యేకించి వివేకా హత్యజరిగిన రాయలసీమ ప్రాంతంలో 52 స్థానాలుంటే టిడిపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే విదిల్చారు ప్రజలు మిగతా స్థానాలన్నింటా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఘన విజయాలు సొంతం చేసుకుంది. దీని అర్దం ఏంటి చంద్రబాబు ఆరోపణలను జనం తిరస్కరించారని.

హత్య జరిగిన వెంటనే ఫ్రెష్ గా జరిగిన ఎన్నికల్లోనే చంద్రబాబు చేసిన ఆరోపణలను జనం నమ్మలేదు. ఆ ఆరోపణలతో జగన్ ను దెబ్బతీయాలన్న చంద్రబాబు వ్యూహం వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆ హత్య కేసు దర్యాప్తు సిబిఐ చేతుల్లోకి వెళ్లింది. ఇపుడు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. నిజానిజాలు వెలుగులోకి రాకుండానే చంద్రబాబు మళ్లీ వివేకానంద హత్య ఘటనను అడ్డుపెట్టుకుని మరో సారి హత్యారాజకీయాలకు తెగబడిపోతున్నారు. దీనివల్ల చంద్రబాబుకు కానీ టిడిపికి కానీ దమ్మిడీ ప్రయోజనం ఉండదంటున్నారు రాజకీయ పండితులు. టిడిపి వివేకా హత్యకేసుపై పుస్తకం ప్రచురించడంతో ఆగ్రహించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీయార్ మరణానికి దారి తీసిన పరిస్థితులపైనా పుస్తకం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు ఎన్టీయార్ మరణానికి చంద్రబాబే కారణమని వారు ఆరోపిస్తున్నారు.
ఎన్టీయార్ మరణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని అప్పట్లో ఆయన తనయుడు హరికృష్ణ డిమాండ్ చేసిన వైనాన్ని గుర్తు చేసిన మంత్రులు ఇప్పటికైనా దానిపై సిబిఐ దర్యాప్తుకు సిద్ధం కావాలని అంటున్నారు.

అదే విధంగా టిడిపి సీనియర్ నేత మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు మరణంపైనా పుస్తకం ప్రచురించాలని కోరుతున్నారు. కోడెల ఎందుకు చనిపోయారో, ఎలా చనిపోయారో, దాని వెనక ఎవరున్నారో ఆ నిజాలన్నీ ప్రజలకు తెలియాల్సిందేనని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా ఇటీవల మరణించిన ఎన్టీయార్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైనా దాని వెనుక ఉన్నవారి ప్రమేయాలపైనా కూడా పుస్తకం ప్రచురించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఎన్టీయార్ మరణం సంభవించి పాతికేళ్లకుపైనే దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇపుడు దర్యాప్తు అవసరమా లేదా అన్నది రాజకీయ నేతలే ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాకపోతే ఎన్టీఆయర్ మరణం సహజ సిద్ధమైనది కాదని మానసికంగా వేధించి ఆయన చనిపోయేలా చేశారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కాకపోతే అవి ఆలా ఉండిపోయాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1988లో విజయవాడలో కాపు నాయకుడు వంగవీటి రంగా దారుణ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ హత్యకు అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి నాటి ప్రభుత్వంలో షాడో సిఎంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడే రంగాను హత్య చేయించారన్న విమర్శలు ఉన్నాయి. నాడు కాంగ్రెస్ లో ఉన్న చేగొండి హరిరామ జోగయ్యే ఈ మేరకు తన ఆత్మకథలో ఈ ఆరోపణ చేశారు. రంగా హత్య కూడా చాలా కాలం రాజకీయ రగడ సృష్టించింది. ఆ తర్వాత టిడిపి నేత మాజీ మంత్రి పరిటాల రవి దారుణ హత్య జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టిడిపి నేతలు ఈ హత్య వెనుక జగన్ మోహన్ రెడ్డి ఉన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేశారు.

అయితే నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి పరిటాల హత్యోదంతంపై సిబిఐ దర్యాప్తుకు సిద్ధమన్నారు. తన కొడుకు దోషిగా తేలితే మరణ శిక్షకు కూడా తాను వెనుకాడనని స్పష్టం చేశారు. అయితే పరిటాల అసలు హంతకులు ఆ తర్వాత పోలీసులకు దొరకడంతో అనుమానాలు పటా పంచలయ్యాయి. 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆరు నెలలకే టిడిపి నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కోడెల కుమారుడిపైనా ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లోని అసెంబ్లీ భవనం నుండి ఏపీ అసెంబ్లీ వాటాగా రావల్సిన ఫర్నిచర్ ను ఏపీకి తరలించే క్రమంలో తన ఇంటికి తరలించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో ఆ అక్రమం వెలుగు చూడ్డంతో తన పరువు పోయిందన్న మానసిక క్షోభతోనే ఆత్మహత్య చేసుకుని ఉండచ్చని భావించారు.

ఇక టిడిపి నేత హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఓ సినీ నిర్మాతపై తుపాకీ పేలిన ఘటన అప్పట్లో సంచనలం సృష్టించింది. అదే రాత్రి బాలకృష్ణ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తి కూడా హత్యకు గురయ్యారు. ఆ ఘటనల్లో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని ఆసుపత్రి నుండి సర్టిఫికెట్ తెచ్చుకుని కోర్టుకు సమర్పించారు. రాజకీయం చేయాలనుకుంటే బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఘటనలను కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా వాడుకుని ఉండచ్చంటారు రాజకీయ పరిశీలకులు. కాకపోతే అప్పుడు బాలయ్య ను చూసీ చూడనట్లు వదిలేయడంతో ఆయన బతికి బట్ట కట్టారు. మన పొరుగునే ఉన్న తమిళనాడులో అన్నాడిఎంకే అధినేత్రి నాటి ముఖ్యమంత్రి జయలలిత అనుమానస్పద స్థితిలో మరణించారు. ఆమె మరణం వెనుక మిస్టరీపై ఇప్పటికీ తమిళనాట దుమారం రేగుతోంది. ఆమె నెచ్చెలి శశికళ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు అప్పట్లో. అయితే అవి ఇప్పటి వరకు ధృవీకరించలేదు. కాకపోతే రాజకీయాలు చేసుకోడానికి ఇప్పటికీ జయలలిత మృతి ఘటన ఓ అస్త్రమే అంటున్నారు రాజకీయ పండితులు. ఇలా మరణాలపై రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని మేథావులు అంటున్నారు.