రోజాకి కౌంటరిస్తారు. ఆలీని కూడా ఆడుకుంటారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగబాబు తమ్ముడి పార్టీలో చక్రం తిప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. అన్న పార్టీ హిట్ కొడుతుందనుకుంటే ఫట్‌మంది. అందుకే నాగబాబు తమ్ముడికైనా మోకులేసి నిలబెట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లుంది. జనసేన తరపున కౌంటర్లు ఇవ్వడంలో ఆయనే ముందుంటున్నారు. ఆయన ఉత్సాహం ఎంతదూరం వెళ్తోందంటే తమ్ముడి కాల్షీట్స్ కూడా చూసుకోకుండానే వచ్చేస్తున్నారని చెప్పేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ పర్యటనలకోసం భారీగా వారాహి సిద్ధమైంది. పవన్ అందులో ఎప్పుడు ఎక్కుతారో ఎటు బయలుదేరి ఎక్కడా ఆగుతారో ఇంకా క్లారిటీ లేదు. ఈలోపే పవన్ పాదయాత్రని అడ్డుకోడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాగబాబు ఆడిపోసుకుంటున్నారు.
అసలు ముందు పవన్‌కళ్యాణ్ ఫలానా రోజునుంచి యాత్రని షెడ్యూల్ రిలీజ్ చేయాలి కదా. ఓపక్క నారా లోకేష్ పాదయాత్రంటూ బయలుదేరుతున్నారు. ఈ సమయంలో తమ అధినేత బస్సెక్కి టూర్లు చేస్తే బావుంటుందా అన్న డౌటు జనసైనికుల్లో ఉంది. ఏం చేద్దామనుకుంటున్నారో ఎలా చేద్దామనుకుంటున్నారో ఎప్పటినుంచి చేద్దామనుకుంటున్నారో తమ్ములుంగారితో మాట్లాడుకోకుండానే నాగబాబు ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే పవన్ చేతిలో సిన్మాలున్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఆ కాల్షీట్స్ని బట్టి టూర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అధినేత సోదరుడిగా కార్యకర్తలకు స్పష్టత ఇవ్వాల్సిన నాగబాబు కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
జనసేనకు ఇప్పటిదాకా మీడియా మంచి ప్రాధాన్యమే ఇస్తోంది. పవన్‌కళ్యాణ్ లైవ్‌కి మంచి స్పేసే దొరుకుతోంది. మున్ముందు పార్టీ బస్సుయాత్రలు, బహిరంగసభల్లాంటివి ఎన్నో చేస్తుంది. ఇలాంటి సమయంలో మీడియాతో స్నేహపూర్వకంగా మెలగడం మేలుచేస్తుంది. నాగబాబు ఆ లాజిక్ కూడా మిస్సవుతున్నట్లుంది. అనంతపురం జిల్లాల్లో వీర మహిళలతో సమావేశం సందర్భంగా ఆయన వ్యాఖ్యలను ఓ టీవీ చానల్ వక్రీకరించిందట. నేను ఏం చెప్పాను మీరు ఏం చెబుతున్నారు అంటూ సోషల్‌మీడియా పోస్టుతో ఆ చానల్ని నాగబాబు నిలదీశారు. ఫేక్, ఒరిజనల్ అంటూ వీడియోలు కూడా పోస్ట్ చేశారు.
తానన్నది అది కాదని చెప్పుంటే మరోసారి బైట్ ఇచ్చేవాళ్లేమో. లేదంటే ఆయన ముచ్చటపడితే ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకునేవాళ్లు. దానికే ఇంత అసహనమా. జనసేన-టీడీపీ మధ్య పొత్తు వందశాతం పక్కానో కాదో తెలీదు. పొత్తు కుదిరితే సీట్ల బేరం ఎక్కడితో మొదలై ఏ అంకె దగ్గర ఆగుతుందో తెలీదు. ఈలోపే నాగబాబుకు రాజ్యసభంటూ ప్రచారం జరిగిపోతోంది. జనసేన కోటాలో నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలని పవన్‌కళ్యాణ్ ప్రతిపాదించారట. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారట. పొత్తుతో జనసేన పోటీచేసే సీట్లు పరిమితంగానే ఉంటాయికాబట్టి నాగబాబు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదంటున్నారు. అందుకే అన్నకోసం ముందే పెద్దలసభ బెర్త్‌ని పవన్‌కళ్యాణ్ రిజర్వు చేసి పెట్టారని చెప్పుకుంటున్నారు. ఎంతవరకు నిజమోగానీ జనసేనలో మాత్రం నాగబాబు పేరు రోజూ ఏదోరూపంలో వినిపిస్తూనే ఉంది.