పదేళ్లయ్యినా పార్టీ నిర్మాణం ఎందుకు లేదు?

By KTV Telugu On 19 April, 2024
image

KTV TELUGU :-

జనసేన పార్టీని ఎందుకోసం పెట్టారో పవన్ కే క్లారిటీ లేదు. కానీ ఎవరి కోసం పెట్టారో ఆయనకు స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడి కోసమే ఆయన పార్టీ పెట్టారు. అందుకే చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారు. నిలబడమంటే నిలబడతారు. చంద్రబాబు చెప్పలేదు కాబట్టి పార్టీ పెట్టి పదేళ్లు అయినా పార్టీకి సంస్థాగత నిర్మాణం కూడా లేకుండా పోయింది. ఏ నియోజక వర్గానికి వెళ్లినా పట్టుమని పది మంది కార్యకర్తలు లేని దుస్థితి. అయితే పవన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును తానే నిర్దేశిస్తానని పూనకంతో ఊగిపోతూ చెబుతారు. దేశం గురించి కూడా మాట్లాడేస్తారు. ముందుగా పార్టీకి ఓ నిర్మాణం..దశ దిశ   ఆలోచన చేసుకుని ఆ తర్వాత పవన్ లెక్చర్లు దంచితే బాగుంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల సమయంలో  పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారు.ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

మొదటి ఎన్నికల్లో  టిడిపి-బిజెపిలకు ఓటెయ్యండని అడగడానికి పరిమితం అయ్యారు.అయిదేళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బిఎస్పీలతో పొత్తు పెట్టుకుని  బరిలో దిగారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 175 నియోజక వర్గాలున్న రాష్ట్రంలో జనసేన ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుంది. రాజోలు నియోజక వర్గం నుంచి రాపాక శ్రీనివాస్ జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

ఆ తర్వా అయిదేళ్లు గడిచిపోయాయి. 2024 ఎన్నికల్లో టిడిపి-బిజెపిలతో కలిసి జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగుతోంది జనసేన. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. చిత్రం ఏంటంటే పార్టీ పెట్టి పదేళ్లు  దాటినా  జనసేనకు ఇంత వరకు సంస్థాగత నిర్మాణమే లేదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ చెప్పుకోడానికి వందమంది కార్యకర్తలు లేరు. ప్రజలు జనసేన పట్ల సానుకూలంగా ఉన్నా  వారిని పోలింగ్ బూత్ కు తీసుకు వచ్చి ఓట్లు వేయించుకునే ఎలక్షనీరింగ్ కూడా లేకపోయిందని పవన్ కల్యాణే ఈ మధ్య చెప్పుకున్నారు.

పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ తాను సిఎంని అవుతానని చెప్పలేదు. అవ్వాలని ఉందన్న లక్ష్యాన్ని ప్రకటించలేదు. దీనిపైనే ఆయనపై విమర్శలూ వస్తున్నాయి.

ప్రతీ రాజకీయ పార్టీకి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. పవన్ కల్యాణ్ కి అటువంటి లక్ష్యం లేదని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడికి అండగా ఉండడమే ఆయన అజెండా అని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. అయితే పవన్ కు అజెండా ఉంది.  ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని  ఈ ఎన్నికల్లో అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమే తన అజెండా అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే పార్ఠీ పెట్టి పదేళ్లు అయినా  ఇంత వరకు పార్టీలో సంస్థాగత నిర్మాణమే చేయలేదని రాజకీయ పరిశీలకులు తప్పు బడుతున్నారు.ఈ లోపాన్ని ఇటీవల జెండా సభలో పవన్ కూడా ఒప్పుకున్నారు.

ఎన్టీయార్ రాజకీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లోనే సత్తా చాటారు. 13ఏళ్ల తర్వాత 2011లో ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2016,2021 ఎన్నికల్లోనూ ఘన విజయాలు సాధించి హ్యాట్రిక్ సిఎం అయ్యారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లోనే రెండో అది పెద్ద పార్టీగా అవతరించి  ముఖ్యమంత్రి కూడా అయ్యారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ సహకరించకపోవడంతో సిఎం పదవికి రాజీనామా చేశారు.ఆ తర్వాత 2015 ఎన్నికల్లో సత్తా చాటి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2020 ఎన్నికల్లోనూ రెండో సారి సిఎం అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2011లోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పెట్టారు. 2012లో ఉప ఎన్నికల్లో సత్తా చాటి  ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో  స్వల్ప ఓట్లశాతం తేడాతో  అధికారాన్ని అందుకోలేకపోయినా బలమైన ప్రతిపక్ష నేతగా అవతరించారు.2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీని  చావు దెబ్బ తీసి 151 స్థానాలు గెలుచుకుని సిఎం అయ్యారు. ఇపుడు 2024 ఎన్నికల్లోనూ గెలిచి రెండో సారి సిఎం అవుతానని ధీమాగా ఉన్నారు.

పవన్  కల్యాణ్  పెట్టిన జనసేన పార్టీ మాత్రం ఇప్పటికీ దిక్కూ దివాణం లేకుండా  ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉంది. దానికి ఎవరో బయటి వారు కారణం కాదు. పార్టీ అధ్యక్షుడు ఆయనే. దాని వైఫల్యాలకు ఆయనే బాధ్యుడు అంటున్నారు రాజకీయ పండితులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి