ఎన్నికల వేళ జనసేనాని పవన్ కల్యాణ్ రూటు మార్చుతున్నారు. ఆయనే ఒక స్టార్ క్యాంపైనర్ అయినప్పటికీ అన్ని చోట్ల, అన్ని పనులు చూసుకోలేని పరిస్థితుల్లో పార్టీ ప్రచారం కోసం స్టార్ క్యాంపైనర్లను ప్రకటించారు. వారిలో కొందరు పార్టీలో ఉంటే, మరికొందరు పార్టీ సానుభూతిపరులు. ఈ సారి వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో స్టార్ క్యాంపైనర్లకు అజెండా కూడా స్పష్టంగానే ఉందని చెప్పాలి. జనాన్ని ఆకట్టుకోవడంలో కూడా స్టార్ క్యాంపైనర్లు సక్సెస్ సాధిస్తారని జనసేన వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపైనర్లుగా ఉంటారంటూ కొందరి పేర్లను పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.పవన్ సోదరుడు నాగబాబు, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సీరియల్ నటుడు సాగర్,హాస్య నటుడు పృధ్వీ,జబర్దస్త్ బ్యాచ్ హైపర్ ఆది, గెటప్ శ్రీనులను జనసేన పార్టీ ప్రచారానికి వినియోగించుకోబోతోంది. ఇందులో కొంతమందికి పూర్తి స్థాయి రాజకీయ అవగాహన ఉన్నప్పటికీ మరికొందరు పార్ట్ టైమ్ రాజకీయవేత్తలు. పార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడమే కాకుండా, అధికార వైసీపీపై వాళ్లు శృతిమించకుండా విమర్శలు చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో గౌరవానికి ప్రాథాన్యం ఇచ్చే వ్యక్తినని చెప్పుకునే పవన్ కల్యాణ్ మరి తన స్టార్ క్యాంపైనర్లను ఎప్పటికప్పుడు కట్టడి చేయాల్సి రావచ్చు. కొణిదెల నాగబాబు మొదటి నుంచి జనసేనలోనే ఉన్నారు. ఈ సారి ఆయన అనకాపల్లి టికెట్ ఆశించారు. పొత్తులో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు టికెట్ ఇవ్వాల్సి రావడంతో పవన్ స్వయంగా నాగబాబుకు సర్దిచెప్పారు. రాజకీయాలపై పూర్తి అవగాహన, సామాజిక అంశాలపై సత్వర స్పందనకు వెనుకాడని నాగబాబు నిజంగానే మంచి స్టార్ క్యాంపైనర్ అవుతారు.జనసైనికుల్లో కూడా ఆయనంటే గౌరవం ఉన్నందున చెప్పే నాలుగు మాటలు ఆలకించేందుకు వెనుకాడరు. పైగా ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ, బీజేపీలకు కూడా ఆయన ప్రచారం చేయాల్సిన తరుణంలో ఆచి తూచి వ్యవహరిస్తారని ప్రత్యేకంగా వివరంచాల్సిన పనిలేదు.
నాగబాబు సంగతి సరే ఇతర స్టార్ క్యాంపైనర్ల సంగతి ఏమిటనేదే ప్రశ్న. ఎంపిక చేసిన వారిలో కొంతమంది నిలకడలేని నాయకులు ఉన్నారు.మాట కంటే వెటకారం ఎక్కువ ఉన్నవాళ్లూ, విషయం కంటే ఎక్కవగా విమర్శలకు ప్రాధాన్యమిచ్చే వాళ్లు కూడా అందులో కనిపిస్తున్నారు…
అంబటి రాయుడు స్టార్ క్యాంపైనర్ ఎలా అయ్యారనేది కూడా పెద్ద ప్రశ్నే. కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు, ‘సిద్ధం’ అంటూ ట్వీటేశారు. ‘ఏంటీ, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా.?’ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రికెట్‌కి గుడ్ బై చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు, తొలుత వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఆశించినట్లుగా ప్రచారం కూడా జరిగింది.వైసీపీ గుంటూరు అభ్యర్థి అంబటి రాయుడు.. అంటూ వైసీపీ నేతలే మీడియాకి లీకులు ఇచ్చారు. ఏమయ్యిందో అంబటి, వైసీపీని వీడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారు. ఇంతలోనే, జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడికి అవకాశం దక్కింది.అంబటి రాయుడికి నిలకడ లేదు,రాజకీయ అవగాహన ఎంత ఉందో తెలీదు. కానీ క్రౌడ్ పుల్లర్ అవుతారన్నది మాత్రం నిజం. ఎప్పటికప్పుడు ఆయనకు అజెండాను చెబుతూ నడిపిస్తే మంచి క్యాంపైనరే అవుతారని నిర్ధారణకు రావచ్చు .ఇక పృథ్వి ఒకప్పుడు వైసీపీలో ఉండేవారు. టీటీడీ భక్తి ఛానెల్ అధిపతిగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పదవి పోయింది. దానితో ఆయన జగన్ పై దుమ్మెత్తిపోసి జనసేనలో చేరారు. ఇప్పుడు జనసేన కోసం పాటలు, స్కిట్లు సిద్ధం చేస్తున్నారు. కామెడీ ఫేస్ గా ముద్రపడిపోయిన ఆ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ప్రచారంలో జనసేనను ఎలా హైలైట్ చేస్తారో చూడాలి. కాకపోతే జనసేనాని ఎప్పటికప్పుడు ఆయన్ను కట్టడి చేయాల్సిన అనివార్యత మాత్రం ఉంటుంది. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మంచి మాటకారి. ప్రాసతో పదాలను వాడటంలోనూ దిట్ట. ఆయనతో వచ్చిన సమస్య ఒకటే. ఆయన పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. దానితో కంట్రోల్ తప్పి రెచ్చిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తగ్గు అని పక్కనునోళ్లు ఎప్పటికప్పుడు ఆయనకు గుర్తు చేస్తూ ఉండాలి. గెటప్ శ్రీనుది కూడా అదే సీను.
జనసేనకు స్టార్ క్యాంపైనర్లు అవసరమా అంటే ఖచితంగా సమాధానం చెప్పలేము. ఎందుకంటే పవన్ కల్యాణే స్వయంగా ఆ పార్టీకి స్టార్ క్యాంపైనర్.ఆయన అన్ని చోట్ల తను తిరగలేడు కాబట్టి కొందరు స్టార్ క్యాంపైనర్లను నిలబెట్టారు. వాళ్లు కూడా ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏమవుతుందో….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…