అనుభవాల నుంచి పవన్ గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. ఈసారి పక్కాగా ప్లాన్ వేసి మరీ ప్రచారానికి దిగుతున్నారు. జనంలో నేను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శక్తిమంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు.
పూర్వానుభవాలను అర్థం చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసే వాడే సరైన నాయకుడని , సమర్థంగా రాజకీయాలు చేయగలడని చెబుతారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర తప్పిదాలు చేసిన పవన్ కల్యాణ్ ఈసారి వాటిని పునరావృతం చేయదలచుకోలేదు. 2014లో పోటీ చేయని జనసేన, 2019లో ఏకంగా 130 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. పవన్ కల్యాణ్ స్వయంగా గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన ఓటమికి ఒక చోట ఏకాగ్రత లేకపోవడమే కారణమని చెబుతారు. రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఆయన సొంత నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేకపోయారు. పైగా బహుముఖ పోటీలో ఆయన పార్టీ ప్రయోజనం పొందలేకపోయింది. ఓటమిని మూటగట్టుకుంది. దానితో ఇప్పుడు మొదటి నుంచి పొత్తుకు సై అంటూ వచ్చిన పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు…. టీడీపీ,బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్ సభా నియోజకవర్గాలు వచ్చాయి. ఈసారి పోటీ చేసే నియోజకవర్గాలు తగ్గడం మన మంచికేనని పవన్ అందరికీ చెబుతున్నారు. తనకు తాను ఒక వ్యూహాన్ని కూడా రెడీ చేసుకున్నారు…
భీమవరం ఓటమిని గుర్తుపెట్టుకోవద్దు, గాజువాకను కాసేపు మరిచిపోదామని అంటున్న పవన్ కల్యాణ్ ..ఇప్పుడు ఫుల్ టైమ్ పిఠాపురంపైనే కాన్సట్రేట్ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ… నేను హైదరాబాద్ వాడిని కాదు.. మీ వాడినని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరపున బరిలో ఉన్న అందరికీ ఆయన అదే సందేశాన్నిస్తున్నారు.
పిఠాపురం తన స్వస్థలమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్నారు. ఒకసారి వచ్చి వెళ్లిపోవడానికి ఇక్కడికి రాలేదని… తాను ఎక్కడికీ వెళ్లనని ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని చెబుతున్నారు. యు.కొత్తపల్లి మండలంలో పార్టీ వీరమహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. కాసేపట్లో పవన్ ప్రసంగం మొదలవుతుందనగా నియోజకవర్గ ఎన్నికల అధికారులు వచ్చి సమావేశానికి అనుమతులు లేవని అభ్యంతరం తెలిపారు. దీంతో పవన్ ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. యు.కొత్తపల్లి మండలం మీదుగా పిఠాపురం పట్టణం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ 30 కిలోమీటర్ల మేర నిర్వహించిన రోడ్‌షోకు ఆరున్నర గంటలు పట్టింది. దారిపొడవునా రైతులు, కూలీలు, మత్స్యకారులు, వృద్ధులు, మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. మండుటెండలో పర్యటిస్తున్న పవన్‌కు కొందరు రైతులు కొబ్బరి బొండాలు అందించారు. నాగులాపల్లిలో నవదంపతులు వచ్చి పవన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పొన్నాడ గ్రామంలో పవన్ నులక మంచంపై కూర్చుని గ్రామస్తులతో ముచ్చటించారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. పిఠాపురం సమీపంలో ఆటోలో ప్రయాణించారు. రైతుకూలీలను పలకరించారు. మూలపేట గ్రామంలో మహిళలతో కలిసి సరదాగా కాసేపు స్టెప్పులేశారు. పిఠాపురం పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్టు సెంటినరీ చర్చిలో పవన్ ప్రార్థనలు చేశారు. పొన్నాడలోని బషీర్‌బీబీ ఔలియా దర్గాను దర్శించుకున్నారు. బషీర్‌బీబీకి చాదర్ సమర్పించారు. ఇదంతా తాను ఎన్నికల కోసం చేయడం లేదని, ప్రజల్లోనే ఉంటానని చెప్పేందుకు చేస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందులోనూ తన పార్టీ అభ్యర్థులకు ఒక సందేశం ఉంది. పక్క నియోజకవర్గాల వైపు చూడకుండా 90 శాతం సమయం సొంత సెగ్మెంట్లపై దృష్టిపెట్టాలని పవన్ వారికి చెప్పకనే చెబుతున్నారు. ఆయన కూడా ఈ సారి అదే గేమ్ ప్లాన్ ను అమలు చేస్తూ ఎక్కువ సమయం పిఠాపురంలో గడపబోతున్నారు….
పవన్ కల్యాణ్ నౌ ఆర్ నెవ్వర్ అన్న ధోరణిలో పోతున్నారు. ఈ సారి ఓడిపోతే పార్టీ పరిస్థితి పాతాళానికి వెళ్లిపోతుందని ఆయనకు తెలుసు.అటువంటి సీన్ ఎదురుకాకుండా పరిమితంగా పోటీ చేస్తున్నందున అన్ని చోట్ల విజయం సాధించేందుకు తాజా వ్యూహం పనికివస్తుందని ఆయన ఎదురుచూస్తున్నారు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…