పవన్ ఎదుగుతున్నాడా.. జారిపోతున్నాడా

By KTV Telugu On 13 January, 2023
image

వివేకానంద వికాసవేదిక. సిక్కలులో యువశక్తి సభకు జనసేన పెట్టుకున్న పేరిది. కానీ వ్యక్తిత్వ వికాసమూలేదు యువతకు స్ఫూర్తిదాయిక సందేశమూలేదు. టార్గెట్‌ వైసీపీ. వైసీపీ నేతలు ప్యాకేజ్‌ పవన్‌ అంటుంటే తన్నెవరూ కొనలేరంటూ పాతికకోట్ల ట్యాక్స్ కడుతున్న విషయాన్ని పవన్‌ చెప్పుకున్నారు. మంత్రులనైతే కాయ్‌ రాజా కాయ్‌, ఆటిన్‌ రాజా, డైమండ్‌ రాణి అంటూ కామెంట్‌ చేశారు. ఇక ఐటీ మినిస్టర్‌ గుడివాడనైతే నీచ్‌ కమీన్‌ కుత్తే అనేశారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందేకంటే జంటగా వెళ్లి యుద్ధంలో గెలుస్తామన్నది ఆ మీటింగ్‌లో జనసేనాని జనానికి చెప్పిన మాట.

ఒంటరిపోరాటంలో మీరు గెలిపిస్తే ఎవరితో కలవాల్సిన అవసరం ఎందుకొస్తుందని పవన్‌కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఓటు చీలిపోకూడదనే తాను పొత్తులకోసం పాకులాడుతున్నానన్న చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే పోటీచేసిన రెండుచోట్లా జనం ఓడించటంతో పవన్‌కళ్యాణ్ కి ధైర్యం సరిపోవడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ-జనసేన మధ్య చీలిపోయి మళ్లీ వైసీపీ లాభపడుతుందన్న భయం ఉంది. అందుకే ఆయన మళ్లీ చంద్రబాబువైపు చూస్తున్నారు. దీనిపైనే ప్రజలను ఒప్పించాలనుకుంటున్నారు.

పొత్తు ఉంటుందన్న సంకేతమిస్తూనే గౌరవప్రదంగా లేకపోతే విడిగా పోటీచేస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఏం చేయాలన్నదానిపై జనసేన అధ్యక్షుడికి ఇంకా క్లారిటీ లేనట్లే. అడిగినన్ని సీట్లిస్తే కలిసి పోటీచేస్తారు. లేకపోతే విడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటారన్నమాట. వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్‌ వస్తుందని అంచనావేస్తున్నారు పవన్‌కళ్యాణ్. ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసి రెండుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి వస్తే అప్పుడే బేరసారాలకు ఆడొచ్చన్న ఆలోచన కూడా ఆయనకు ఉంది.
పవన్‌కళ్యాణ్ లెక్కలెలా ఉన్నా ఆయన వ్యాఖ్యలకు అంతకంటే వాడిగా వేడిగా రియాక్షన్‌ వచ్చింది. వైసీపీ మంత్రులు, నేతలు జనసేనానిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌ అని జనసేన పేరుని చంద్రసేనగా మార్చుకోవాలని సలహాలిస్తున్నారు. సంక్రాంతి ప్యాకేజ్‌తోనే యువశక్తి సభలో పవన్‌ ఆలా మాట్లాడారని దెప్పిపొడుస్తున్నారు. నువ్వు లాగులు వేసుకోకముందునుంచే మాకు రాజకీయ అనుభవం ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

విజయం సాధిస్తామో వీరమరణం పొందుతామో యుద్ధరంగంలోకి దిగాకే తెలుస్తుంది. చివరి రక్తపుబొట్టుదాకా పోరాడేవాడే శత్రువు వెన్నులో వణుకు పుట్టించగలుగుతాడు. ఓటమి తప్పదన్న భయంతో కదనరంగంలో కాలుమోపితే ఇక విజయం సాధించేదెక్కడ. తన పిరికితనంతో పవన్‌ మరోసారి అధికారపార్టీ చేతికి తానే అస్త్రాలు అందించినట్లయింది.