ఏపీ పోలిటిక్స్ లో మెగా పవర్ పంచ్

By KTV Telugu On 19 December, 2022
image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సారి అన్ని వైపుల నుంచి నరుక్కుని వచ్చేందుకు జనసేనా నాయకుడు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఇమేజ్ తో పాటు జనసేనను బలంగా చూపేందుకు కొత్త రూట్లు వెదుకుతున్నారు. అందులో భాగంగా అన్నయ్య చిరంజీవి వైపు నుంచి ఎలాంటి సాయమైనా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి నుంచి డైరెక్టుగా సాయం కాకపోయినా 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మాజీలను తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. పవన్ సాధించి తీరుతాడని ఇటీవల చిరంజీవి స్టేట్ మెంట్ ఒక పాజిటివ్ పరిణామమని భావిస్తున్నారు.

2008లో ప్రజారాజ్యానికి 18 శాతం ఓట్లు వచ్చాయి. పార్టీని క్లోజ్ చేసిన తర్వాత కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొందరు తెలుగుదేశం పార్టీలోనూ మరికొందరు టీడీపీలోనూ సెటిలైపోయారు. అయితే ప్రజారాజ్యంలో పనిచేసిన వారిలో ఎక్కువ మందికి తాము రాజకీయంగా ఎదగలేకపోయామన్న ఆవేదన ఉంది. అలాంటి వారికి గాలం వేయాలని పవన్ వ్యూహరచన చేస్తూ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాటి ప్రజారాజ్యం నేతలే టార్గెట్ గా జనసేన పావులు కదుపుతోంది. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు చిరంజీవితో పాటు హస్తం పార్టీలో చేరిన నేతలకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. 2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ ఉండి ప్రయోజనం ఏముంది. మాతో వచ్చేయ్యండని జనసేన వారికి ఆఫరివ్వబోతంది. తిరుపతి ప్రాంతంలో బలిజ సామాజిక వర్గం, గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సహా బీసీల్లో బలమైన నాయకులను ఎంపిక చేసి వారిని జనసేనలోకి ఆహ్వానించడం లేదా లోపాయకారిగా తమకు మద్దతు ప్రకటించాలని కోరడం ఇప్పుడు పవన్ అజెండాలో భాగమైంది. ఇంతవరకు రాజ్యాధికానికి నోటుకోని కులాలకు ఈ సారి అధికారానికి రావాలని పవన్ పదే పదే ప్రచారం చేయడం కూడా నాడు పీఆర్పీకి మద్దతిచ్చిన కులాలను ఏకం చేయడం కోసమేనని తెలుస్తోంది.

తిరుపతిలో ఇటీవల పీఆర్పీ మాజీ నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మళ్లీ క్రియాశీలం కావాలన్న కోరిక వారిలో కనిపించింది. ఎక్కువ మంది బలిజ సామాజిక వర్గం నేతలు అందులో పాల్గొనగా తాము ఐకమత్యంగా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాను స్వీప్ చేసే వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వారంతా చిరంజీవి దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ ఆలోచన కూడా అదేనంటున్నారు. ఒక్క సారి చిరంజీవి పిలుపునిస్తే వారంతా రాత్రికిరాత్రి తమవైపుకు వస్తారని విశ్వాసం ఆయనలో ఉంది. 2009లో చిరంజీవి తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన సంగతి ఇప్పుడు జనసైనికులు గుర్తు చేస్తున్నారు. మరో పక్క ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన యాదవ సామాజిక వర్గం నేతలు కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సారి ఉభయ గోదావరి జిల్లాలను బాగా ఫోకస్ చేయాలని పవన్ భావిస్తున్నారు. అక్కడ తమ కాపు సామాజిక వర్గంతో పాటు రాజకీయ అసంతృప్తిపరులు చాలా మంది ఉన్నారు. వైసీపీలో ఉన్న కొందరు ద్వితీయ శ్రేణి కాపు నేతలకు కూడా అధికార పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. వారిని లాగితే జనసేనకు అంగబలం, అర్థబలం రెండూ సమకూరుతాయని పవన్ విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జనసేనలో ఉన్న కొందరు నేతలకు ఆ పని అప్పగించాలని భావిస్తున్నారు. అయితే ఆ దిశగా చిరంజీవి మాటసాయం చేస్తే బావుంటుందని పవన్ నమ్ముతున్నారు. చిరంజీవిని ఒప్పించే పని నాగబాబు చూసుకుంటారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.