పవన్ అంటే త్యాగానికి మారుపేరా. తను అనుకున్నది సాధించడానికి ఎంతటి త్యాగానికైనా దిగుతాడా. అంచనా వేసుకున్న దాని కంటే చాలా తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడా. జగన్ ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో పరిమిత స్థాయి పోటీకి కూడా ఒప్పుకున్నాడా. తాజా పరిణామాలను పవన్ కల్యాణ్ కు శిక్షగా కొందరు విశ్లేషిస్తున్నా ఆయన పట్టించుకోదలచుకోలేదా…
రాజకీయాలంటే అధికారమే ప్రైమరీ గోల్. పవన్ కల్యాణ్ కు మాత్రం ఇప్పుడది సెకండరీ గోల్ గా కనిపిస్తోంది. జగన్ ను ఇంటికి పంపించడమే ప్రైమరీ గోల్ గా లెక్కగడుతున్నారు. ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేయడం, జగన్ ను గద్దె దించే దిశగా తాము పోటీ చేయబోయే సీట్లను పూర్తిగా తగ్గించుకోవడం పవన్ చూపిస్తున్న ఉదారతగా చెప్పుకోవాలి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పవన్ తన గోల్ నుంచి మాత్రం పక్కకు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. తొలి నుంచి బీజేపీతో పొత్తుకు పవన్ పట్టుబడుతూనే ఉన్నారు. టీడీపీ,జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని వాదిస్తూనే ఉన్నారు. గత వారం చంద్రబాబు, పవన్ కలిసి మీడియాతో మాట్లాడినప్పుడు జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత ప్రకటించారు. బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారో వారితో చర్చల తర్వాతే తేలుతుందన్నారు. అప్పుడు కూడా పవన్ పోటీ చేసే స్థానాలపై కాస్త అనిశ్చితే కనిపించింది..
పవన్ కు ట్విన్ గోల్స్ ఉన్నాయి. జగన్ ను ఓడించడం మొదటిది. బీజేపీతో పొత్తు కొనసాగించడం రెండోది.ఆ దిశగా చంద్రబాబు ఎన్ని గేమ్స్ ఆడినా పవన్ భరిస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. తాజాగా మరికొన్ని సీట్లు తగ్గించుకోవాల్సిన అనివార్యతను కూడా ఆయన అనందంగా స్వీకరించారు. గత ఎన్నికల ఓట్ల శాతంతో సంబంధం లేకుండా ఆయన ఒప్పుకున్నారు.
బీజేపీకి ఐదు లోక్ సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు బీజేపీ ఢిల్లీ నేతలతో చర్చలు నిర్వహించినప్పుడు మాత్రం ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలిగాయి. వాటిని పటాపంటలు చేస్తూ జనసేనకు తగ్గించి, బీజేపీకి సీట్లు పెంచిన వ్యవహారం బయట పడింది.తాజా ఫార్ములా ప్రకారం అసెంబ్లీలోని 175 స్థానాలకు గాను టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి.. ఇక, పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏపీలో 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయనుండగా, బీజేపీ ఆరు స్థానాలు, జనసేన రెండు చోట్ల బరిలోకి దిగనున్నాయి. అంటే గత ఒప్పందంలో జనసేన మూడు లోక్ సభ సీట్లకు పోటీ చేయనుండగా, ఇప్పుడది రెండుకు తగ్గింది. జనసేన పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాల్లో మరో మూడు తగ్గించుకుంది. టీడీపీ తగ్గించుకున్నదీ ఒక్క సీటే కావడం విశేషం. ఇప్పుడు బీజేపీ ఏకంగా ఆరు లోక్ సభా స్థానాల్లో పోటీ చేస్తోంది. గత ఎన్నికలను చూస్తే జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి కనీసం ఒక శాతం ఓట్లు రాలేదు. ఐనా సరే ఇప్పుడు జనసేన రెండు లోక్ సభా స్థానాల్లో పోటీ చేస్తుంటే, బీజేపీ ఆరు చోట్ల బరిలోకి దిగుతోంది. ఇదీ పవన్ త్యాగానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు…
పవన్ కల్యాణ్ కు మోదీ అన్నా…మోదీ సిద్ధాంతాలన్నా వల్లమాలిన అభిమానం. దేశాభివృద్ధి మోదీ నేతృత్వంలోనే సాధ్యమని పవన్ విశ్వసిస్తారు.మోదీ నాయకత్వంలో తమ పార్టీ ప్రయోజనాలకు ఢోకా ఉండదని ఆయన విశ్వసిస్తారు.ఎన్నికల తర్వాత అన్ని సానుకూలంగా మారతాయన్న నమ్మకం కూడా పవన్ కు ఉంది. అందుకే సీట్ల త్యాగానికి సిద్ధమయ్యారని అనుకోవాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…