తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించబోయే సీట్లు ఎన్ని? ఇపుడు ఇదే రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఆసక్తికరంగా మారింది. జనసేన కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని చేగొండి హరిరామ జోగయ్య సూచించిన సంగతి తెలిసిందే. కనీసం 50 స్థానాలకు తగ్గకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ స్వయంగా జోగయ్యతో చెప్పారని జోగయ్యే వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. అయితే జనసేన నేతకే చెందిన ఒక పత్రికతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంఖ్య మాత్రం దారుణంగా ఉంది. జనసేనకు కేవలం 15 అసెంబ్లీ రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారని అంటున్నారు. దీనిపై జనసైనికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు.
ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. దానికి ముందు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూవచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే ఉండదని చెబుతూ వస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆయన అంటున్నారు.
వైసీపీని ఓడించడమే అజెండాగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ బిజెపికి మిత్ర పక్షంగా ఉండీ కూడా బిజెపితో ప్రమేయం లేకుండా టిడిపితోపొత్తు ప్రకటించారు. స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు నైతిక మద్దతు ప్రకటించిన వెంటనే టిడిపితో పొత్తు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న టిడిపిని ఆదుకోడానికి నిజమైన మిత్రుడిలా పవన్ వ్యవహరించారు. దీనికి ప్రతిగా టిడిపి నాయకత్వం ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుందని జనసైనికులు భావించారు
జనసైనికుల ఆకాంక్ష ఒక్కటే. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి. పవన్ అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ప్రజల ఆకాంక్ష కూడా అదే. ఇంత వరకు కమ్మ సామాజికవర్గం, రెడ్డ సామాజికవర్గాలకు చెందిన వారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. బ్రాహ్మణులు, వైశ్యులు కొద్ది కాలం పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నారు .కానీ జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు మాత్రం ఇంత వరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదు. 2009లో ఈ కారణంతోనే ఈ సామాజిక వర్గం తరపున చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అది వర్కవుట్ కాలేదు. ఇపుడు పవన్ కళ్యాణ్ జనసేనతో దూసుకుపోతుననారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాపులు సిఎం కాలేరన్న భావన ఆ సామాజికవర్గంలో ఉంది.
టిడిపి తన రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ సారి టిడిపి అధికారంలోకి రాలేకపోతే టిడిపి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు అంతలా ప్రయత్నాలు చేశారు. టిడిపి జనసేన పొత్తు కుదరగానే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న ప్రశ్న మొదలైంది . పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని జనసైనికులు కోరారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన అభిమానులు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పదవి తర్వాత.ముందు టిడిపి మనం కలిసి అధికారంలోకి వచ్చేలా కష్టపడండి. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది నాకు వదిలేయండి. మన ఆత్మగౌరవాన్ని ఏ మాత్రం తగ్గించని స్థాయిలో జనసేన అభ్యర్ధులను బరిలో నిలబెడతాం అన్నారు.
అయితే టిడిపి వైపు నుంచి క్లారిటీ లేదు. నారా లోకేష్ ఓ టీవీతో మాట్లాడుతూ టిడిపి-జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నారు. దాంట్లో మరో ఆలోచనకే ఆస్కారం లేదన్నారు. పవన్ కు డిప్యూటీ సిఎం పదవి ఇస్తారా అంటే అది ఎన్నికలయ్యాక చంద్రబాబు . పార్టీ సీనియర్ నేతలు నిర్ణయిస్తారని అన్నారు. ఇది జనసైనికులకు కాస్త మంట తెప్పించింది. అయితే వారు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కానీ మాజీ మంత్రి సీనియర్ కాపు నాయకుడు అయిన చేగొండి హరిరామ జోగయ్య జనసేనానిని కలిసి భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని తాను చెప్పానన్నారు. కనీసం 50కి తగ్గకుండా చూస్తామని పవన్ తనకు చెప్పారని ఆయన అన్నారు.అయితే కాకినాడ నుండి జనసేన తరపున టికెట్ ఆశిస్తోన్న ఒక నేతకు చెందిన పత్రికలో జనసేనకు 15 అసెంబ్లీ రెండు లోక్ సభ స్థానాలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందంటూ ఓ కథనం ప్రచురించారు.
జనసేనకు 15 స్థానాలే అనే సరికి జనసైనికుల్లోనే కాదు కాపు సామాజిక వర్గ మేథావుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభానని జనసైనికులు కలిశారు. తమ పార్టీలో ఎప్పుడు చేరతారో అడడానికి వాళ్లు వెళ్లారు. వారితో ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని ఆరా తీశారు
కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇస్తామన్నారా? అని అడిగారు. జనసేనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చంద్రబాబు నుండి లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుని రండి అప్పుడు నేను పార్టీలో చేరతాను అని ముద్రగడ అన్నట్లు వార్తలు వచ్చాయి.ఈ ప్రశ్నలకు జనసైనికుల వద్ద సమాధానాలు లేవు. కాకపోతే ముద్రగడ ప్రశ్నలే వారిలోలోనూ ఉన్నాయి. కాకపోతే ముద్రగడలా ధైర్యంగా పైకి అనలేకపోతున్నారంతే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
జనసేన నేత పత్రికలో 15 సీట్లే ఇస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో జనసైనకుల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ 68 నియోజక వర్గాల పేర్లతో ఒక జాబితా రూపొందించి చంద్రబాబకు పంపించారని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనకు అన్ని స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకనే ప్రసక్తే ఉండదంటున్నారు టిడిపి నేతలు.
గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బిఎస్సీలతో కలిసి జట్టు కట్టి కూటమిగా పోటీచేస్తే జనసేనకు వచ్చినవి ఆరు శాతం ఓట్లు. అంటే అందులో జనసేనవి అయిదు శాతం కూడా ఉండకపోవచ్చునంటున్నారు. అటువంటి పార్టీకి 15 సీట్ల కంటే ఎక్కువ ఎవరిస్తారని టిడిపి సీనియర్ నేత ఒకరు నిలదీస్తున్నారు.
జనసేనకు 15 సీట్లే ఇస్తారన్న విషయం పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసునని ఆ మేరకే చంద్రబాబుతో ఒప్పందం జరిగిపోయిందని వారంటున్నారు. అయితే జనసైనికుల మూడ్ గమనించిన పవన్ వారిని తాత్కాలికంగా శాంత పరిచేందుకే 68 నియోజక వర్గాల జాబితా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నట్లుందని రాజకీయ పండతులు అనుమానిస్తున్నారు. చాలా నియోజక వర్గాల్లో జనసేనకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని స్థానిక టిడిపి నేతలు హెచ్చరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నిజంగానే టిడిపి జనసేనకు 15 సీట్లే ఇస్తే జనసైనికులు టిడిపి విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితులు ఉండకపోవచ్చునని జనసేన సీనియర్ నేతలు ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. సీట్ల కేటాయింపు పై క్లారిటీ వస్తే కానీ ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారో తెలీదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…