అరిగిపోయిన అస్త్రాలతో జగన్ ని కొట్టగలరా?

By KTV Telugu On 27 January, 2023
image

“ప్రజలు ఓ అంశాన్ని తిరస్కరించారంటే ఇక ఆ అంశాన్ని పక్కన పెట్టేయాలి. అంతే కానీ పదే పదే అదే అంశంతో ప్రజల దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుంది. ప్రజలను ఆకట్టుకోడానికి రాజకీయ పార్టీలు ఏవేవో ప్లాన్స్ తో వస్తాయి. ఓ ప్లాన్ ను ప్రజలు ఇష్టపడనప్పుడు ఇక ఆ ప్లాన్ ను అక్కడితో మర్చిపోవాలే తప్ప మళ్లీ మళ్లీ అదే ప్లాన్ తో జనాన్ని విసిగిస్తే దమ్మిడీ ప్రయోజనం ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ లు ఇలా జనం ఓ సారి తిరస్కరించిన స్ట్రాటజీనే మళ్లీ మళ్లీ ప్లే చేస్తున్నారు.

2019 ఎన్నికలకు మూడు నెలల ముందు అందరూ ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న  సమయంలో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కీలక నేత  పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ అయిన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆ హత్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే. హత్య జరిగిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ హత్యతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మానసికంగా బాగా దెబ్బతింటుందని అనుకున్నారు. ఈ హత్య కచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయించిందేనని అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. దానికి ఓకారణాన్ని కూడా ఆయన చెప్పారు.

1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిగ్గా ఇలానే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు  ఎన్నికల సమయంలో ఆయన తండ్రి రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆ హంతకులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆశ్రయం ఇచ్చి కాపాడారని అప్పట్లో  కాంగ్రెస్ ఆరోపించింది . ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. మనో స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే చంద్రబాబు రాజారెడ్డి హత్యకు పురమాయించి ఉంటారని  వై.ఎస్.ఆర్. వర్గీయులు భావించారు. అటువంటి  కుట్రలు చంద్రబాబుకు అలవాటు కాబట్టే 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో యాక్టివ్ గా తిరుగుతోన్న వివేకానంద రెడ్డిని టార్గెట్ చేశారన్నది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపణ. అయితే నిజా నిజాలేమిటన్నది దర్యాప్తు సంస్థలు తేల్చాలి.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు నిత్యం వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ సొంత బాబాయ్ నే గొడ్డలితో నరికేశారంటూ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా చంద్రబాబు  తీవ్ర విమర్శలు చేయడంపై  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి అంశాన్ని ప్రస్తావిచడానికి వీల్లేదని న్యాయస్థానం తీర్పు నిచ్చింది. అయితే అప్పటికే అనేక సభల్లో చంద్రబాబు నాయుడు ఆ ప్రచారాన్ని సాగించేశారు. ఆయనతో పాటు జనసేనాని సైతం  బాబాయ్ నే చంపేశారు అంటూ జగన్ పై విరుచుకు పడుతూ ఎన్నికల ప్రచారం చేశారు. దాంతో పాటు 2018లో  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతోన్న సమయంలో విశాఖ నుండి హైదరాబాద్ వచ్చేందుకు  ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డిపై ఓ దుండగుడు కోడి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డాడు.

ఆ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టకముందే అప్పటి డిజిపి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డే తన అభిమాని చేత దాడి చేయించుకున్నారని వ్యాఖ్యానించి వివాదం రాజేశారు. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఎయిర్ పోర్టులోని ఓ హోటల్ లో పనిచేస్తున్నట్లు తేలింది. ఆ హోటల్ నారా లోకేష్ కు అత్యంత ఆప్తుడైన టిడిపి నేత హర్షవర్ధన్ దిగా గుర్తించారు. అయితే జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేయమని అతనికి పురమాయించింది ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ అంశంపై అప్పట్లో టిడిపి జనసేనలు ఒకే టోన్ తో  కోడి కత్తి కేసు అంటూ రాజకీయ విమర్శలు చేశాయి. ఈ రెండు అంశాలతోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను చావు దెబ్బ తీయాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనం చంద్రబాబు, పవన్ లు చెప్పింది విన్నారు. ఒక వేళ జగన్ మోహన్ రెడ్డి తన బాబాయ్ ని హత్య చేయిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ ను అరెస్ట్ చేయించవచ్చు కదా అని  ప్రజలు  ప్రశ్నించుకున్నారు. నిజంగానే జగన్ మోహన్ రెడ్డి దోషి అయితే  చంద్రబాబు నాయుడు ఆ అవకాశాన్ని వదులుకునే రకం కాదని కూడా వారు భావించారు.

కేవలం రాజకీయంగా దెబ్బతీయడానికే చంద్రబాబు పవన్ లు  విష ప్రచారం చేస్తున్నారని జనం నమ్మారు. అందుకే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలనూ దెబ్బ తీశారు ప్రజలు. ప్రత్యేకించి రాయలసీమలో టిడిపికి కేవలం మూడంటే మూడే స్థానాలు ఇచ్చి ప్రజలు  జగన్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. జనసేనకు అయితే ఒక్క సీటు ఇచ్చి సరిపెట్టారు జనం. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెడు చోట్లా ఓడించి పంపించారు. చంద్రబాబు-పవన్ ఆరోపణలు జనం నమ్మలేదు అనడానికి 2019లో ఏపీ ఓటర్ల తీర్పే  తిరుగులేని నిదర్శనం అంటారు రాజకీయ పండితులు. ఆ తీర్పు తర్వాత అయినా టిడిపి, జనసేనల్లో పరివర్తన లేదు పశ్చాత్తాపం లేదు. అదే ఆరోపణలను నాలుగేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ప్రతి రోజూ రిపీట్ చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎక్కడ పర్యటించినా సొంత బాబాయ్ నే గొడ్డలితో నరికేశారంటూ ఆరోపిస్తున్నారు చంద్రబాబు . అసెంబ్లీ సమావేశాల్లోనూ బాబయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి అంటూ  నినాదాలు చేసి వివాదం రాజేశారు. ఆ కేసు సిబిఐ దర్యాప్తులో ఉందని తెలిసినా అవే ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు.

చంద్రబాబు  పార్టీ కార్యాలయం నుంచే జనసేనానికి ఆదేశాలు, సలహాలు వెళ్తాయంటూ వైసీపీ నేతలు పదే పదే చేసే ఆరోపణలకు బలం చేకూర్చేలా పవన్ కూడా అచ్చం చంద్రబాబు చేసిన ఆరోపణలనే అదే పదజాలంతో  తుచ తప్పకుండా ఆరోపిస్తున్నారు. వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత గణతంత్ర దినోత్సవం రోజున జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికి చంపి సిబిఐ దర్యాప్తుకు ఇమ్మనమని అనడమేంటి. కోడి కత్తితో గీయించుకుని ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం ఏంటి. అంటూ టిడిపి భాషలోనే మాట్లాడారు. వీళ్ల ఇద్దరి వ్యవహారం చూస్తూ ఉంటే 2024 ఎన్నికల్లోనూ బాబాయ్ గొడ్డలి, కోడి కత్తి కేసుల నినాదాలతోనే చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు.

ఒక వేళ అదే నిజం అయితే ఇంత కన్నా తెలివి తక్కువ ఎన్నికల వ్యూహం మరోటి ఉండదని వారంటున్నారు. జనం ఓసారి తిరస్కరించేసిన ఈ రెండు అస్త్రాలను మరోసారి ప్రయోగించాలనుకోవడంలోనే  విఫల వ్యూహం కనిపిస్తోందని వారంటున్నారు. ఈ రెంటినీ మించి టిడిపి, జనసేనలకు ఇక అస్త్రాలే లేవని కూడా అర్ధమవుతోందని అంటున్నారు. ఇటువంటి ట్రిక్స్ ని ప్రజలు అస్సలు ఎంటర్ టెయిన్ చేయరని వారు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ సొంత బాబాయ్ ని జగన్ గొడ్డలితో నరికించి చంపించారని పవన్ నమ్మితే తన మిత్రపక్షమైన బిజెపి అండతో  దోషులను బోనులో నిలబెట్టించ వచ్చు కదా. కోడి కత్తి, బాబాయ్ హత్య అనే ఈ రెండు అరిగిపోయిన అంశాలతోనే 2024 ఎన్నికలకు వెళ్తే జగన్ ను ఓడించడం టిడిపి జనసేనలకు సాధ్యమయ్యే పని కాదనేది విశ్లేషకుల మాట.