ఏపీలో వలస రాజకీయాలు షరూ అయ్యాయి. ఎన్నికలకు ఏడాది సమయమున్నప్పటకీ జంపింగ్ జపాంగ్‌లు ముందే సేఫ్ ప్లేస్ చూసుకొని జంప్ అయిపోతున్నారు. ఎన్నికలకు ముందు ఎందుకొచ్చిన తలనొప్పి అని ఇప్పుడే టికెట్‌పై క్లారిటీ తీసుకొని గోడ దూకేస్తున్నారు. అలా వివిధ పార్టీల నుంచి టీడీపీ, వైసీపీలోకి వలసల నేతలు వస్తున్నారు. కానీ ఎవరూ జనసేన వైపు మాత్రం చూడడం లేదు. జనసేన గట్టిగా ఫోకస్ పెడితే చాలా మంది నేతలు కండువాలు కప్పుకోవడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. కానీ పవన్ మాత్రం సినిమాలపైనే ప్రస్తుతానికి ఫోకస్ పెడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో టీడీపీయే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది సైకిల్ వైపు మొగ్గుచూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీ నుంచి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారు. జనసేనలోకి వెళ్లాల్సిన ఆయన మనసును మార్చుకుని టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన మహాసేన రాజేష్ కూడా టీడీపీలో చేరిపోయాడు తప్ప జనసేన వైపు చూడలేదు. అదీ జనసేనకు పట్టున్న తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజేశ్ టీడీపీలో చేరిపోయాడు. వైసీపీలో తిరుగుబాటు రాజకీయాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపే చూస్తున్నారు. ఇలా టీడీపీ ఫుల్ లోడింగ్ అవుతోంది. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉన్నా జనసేనాని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనలు కలసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీడీపీలో కొన్ని టికెట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. జనసేనలో చేరే నేతలకు పొత్తులో భాగంగా టిక్కెట్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు మూడవ ఎలక్షన్స్. అయినా ఇప్పటివరకు 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులే లేని దుస్థితి. పట్టుమని 25 నియోజకవర్గాల్లో కూడా బలమైన నేతలు లేరు. జనసేనలో స్పేస్ చాలా ఉంది. అయినా కూడా చాలా మంది నేతలు జనసేన వైపు చూడకుండా చంద్రబాబు చేత ఎందుకు కండువాలు కప్పించుకుంటున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిలకడలేని రాజకీయ నేతలను ప్రజలు విశ్వసించరనే ఆలోచనలో నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేన కంటే పసుపు పార్టీ అయితేనే బెటర్ అని భావిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది.
టీడీపీ నుంచి టిక్కెట్ హామీ లభిస్తే ఆర్థికంగా కూడా ఆదుకుంటారు. అదే జనసేన అయితే కేవలం పవన్ చరిష్మాను మాత్రమే చూసి ఓటు అడగాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల్లో అది కుదరదు. ప్రత్యర్థి కన్నా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వారికే విజయం వరిస్తుందని నమ్మే రోజులివి. అందుకే పవన్ పార్టీ ఆర్థికంగా పెద్దగా ఆదుకోరని భావించిన నేతలు జనసేన వైపు చూడటం లేదంటున్నారు. అందుకే ఎన్నికలు సమీపించినా జనసేనలోకి చేరికలు లేవంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో భాగంగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందే అభ్యర్థులను ఫిక్స్ చేసుకున్నారా. పవన్ చేరికలపై పెద్దగా దృష్టిపెట్టకపోవడానికి అది కూడా ఓ కారణమై ఉండొచ్చని కొందరు నేతలు చెబుతున్న మాట.