జనసేనాని కొట్టిన మాస్టర్ స్ట్రోక్

By KTV Telugu On 23 September, 2023
image

KTV TELUGU :-

పొత్తు ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మార్చేసింది. పెద్ద పార్టీ అయినప్పటికీ టీడీపీ అనివార్యతలను గుర్తుచేసింది. పవన్ కల్యాణ్ బలవంతుడా, చంద్రబాబు శక్తిమంతుడా అన్న అనుమానాలను రేకెత్తించింది. ఇంత తొందరగా పొత్తు ప్రకటన వస్తుందని అధికార వైసీపీ కూడా ఊహించలేకున్నప్పటికీ పవర్ స్టార్ మాత్రం జనాన్ని ఆశ్చర్యం, అయోమయంలోకి నెట్టేశారు.దీన్ని వ్యూహాత్మక ముందడుగుగానే పరిగణించాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు..

ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కేవాడు నిజమైన తెవివిగల వాడంటారు. అవకాశం వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే వాడు నిజమైన రాజకీయ నాయకుడంటారు.పవన్ కల్యాణ్ కు ఏమీ తెలియదూ.. దత్తపుత్రుడిగా బతికేస్తున్నాడని అనుకునే వారందరికీ పవన్ దిమ్మతిరిగే షాకిచ్చారు. సరిగ్గా టీడీపీ డిఫెన్స్ లో ఉన్నప్పుడు పవన్ రాజమండ్రి జైలు వేదికగా పొత్తును ప్రకటించడం నిజంగా ఎవరూ ఊహించని చర్యగానే చెప్పుకోవాలి. ఆ క్రమంలో ఇప్పుడు జనసైన్యం పైచేయిలోకి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…

రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును ఆలింగనం చేసుకుని ఓదార్చిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.బాలయ్య ఒక పక్క, లోకేశ్ ఒక పక్క నిల్చుని ఉండగా ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీకి సానుకూల వాతావరణం ఏర్పడటానికి పవన్ కల్యాణ్ ప్రకటన పనికొస్తుందని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. పొత్తు వల్ల టీడీపీకీ లాభం అని కూడా అందరూ గ్రహించారు. పార్టీ కేడర్, టీడీపీ అనుకూల మీడియా ఎగిరి గంతేసిన మాట వాస్తవం. జనసేన, టీడీపీని ఆకాశానికెత్తేస్తూ అనుకూల మీడియా కథనాలు వండి వార్చుతోంది. వారి వేడుకలు జరుపుకోవడంలో తప్పులేదని అందరూ గుర్తించారు..

జనసేన పక్కాగా టీడీపీ వైపుకు వస్తుందా అన్న అనుమానాలు కూడా ఈ ఒక్క ప్రకటనతో తొలగిపోయాయి. బీజేపీ సైతం సర్దుకుపోయి వారితో కలిసిపోతుందని త్వరలోనే క్లారిటీ రావచ్చు. తాజా పరిణామాలు టీడీపీకి అనుకూలమని కూడా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అధికార వైసీపీకి, టీడీపీకి మధ్య పది శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. గత ఎన్నికల లెక్కలు చూస్తే జనసేనకు ఆరు శాతం ఓట్లుండగా, ఇప్పుడది పది శాతం వరకు పెరిగిందని తాజా సర్వేలు కూడా ప్రకటించాయి. దానితో టీడీపీ, జనసేన కలిస్తే జగన్ ను దించడం సులభమని చంద్రబాబు గ్రహించి చాలా రోజులైంది. తాను స్వయంగా పొత్తుపై ముందుకు కదిలితే అవతలి వారి డిమాండ్లు వేరుగా ఉంటాయనే ఆయన ఇంతకాలం బెట్టు చేశారు. ఇప్పుడు జనసేనాని స్వయంగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

టీడీపీ వారంతా ఇప్పుడు పోటీ పడి పొత్తును ఆహ్వానిస్తున్నారు. పవన్ కల్యాణ్ మద్యారకరంగా, తెలివిగా నిర్ణయం తీసుకున్నారని కితాబిస్తున్నారు. లోలోన మాత్రం కొంత మందికి అసలు విషయం తెలిసొచ్చి.. ఆ ప్రకటనలో ఇంత గేమ్ ప్లాన్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.తాను స్వయంగా పొత్తు ప్రకటన ద్వారా పవన్ పైచేయిగా నిలిచారు. పొత్తు కుదిరితే జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తారని ఇంతకాలం చెబుతూ వచ్చారు. ఇప్పుడు సీన్ మారింది. జనసేనాని పొత్తు ప్రకటన వెనుక ఉన్న అసలు విషయాన్ని సైనికులు చర్చించుకుంటుంటే.. టీడీపీకి ఇప్పుడు కొత్త భయాలు మొదలయ్యాయి. కనీసం 50 సీట్లకు తక్కువ కాకుండా జనసేన అడగబోతోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయంలో తగ్గేదేలేదని కూడా తేల్చిపడేస్తున్నాయి. టీడీపీ కేడర్ నిద్రాణంగా పడుందని, క్షేత్రస్థాయిలో జనసైనికులే పనిచేస్తున్నారని వారి వల్లే పొత్తుకు విజయం చేకూరుతుందని ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక్క ప్రకటన ద్వారా జనసేనాని హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ ట్రా అడుగుతున్నారన్న మాట..

జగన్ టీడీపీని ఒక రకంగా వదిలిపెట్టరని జనసేనకు కూడా అర్థమైంది. కేసుల మీద కేసులతో టీడీపీ కేడర్ ఒత్తిడిలోకి వెళ్లిపోతుందని కూడా అర్థమైంది. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటేనే ఏదైనా సాధ్యమని కూడా పవన్ గ్రహించారు. ఎందుకంటే పోటీ చేసిన ప్రతీ చోట గెలవడం కుదరదు. పైగా వైసీపీ అర్థబలంతో పోటీ పడటం కూడా అంత ఈజీ కాదు. అందుకే అత్యథిక స్థానాలు అడిగితే కొంతైనా ప్రయోజనం ఉంటుందని పవన్ గ్రహించి ఆ దిశగా పావులు కదిపారు. ఇప్పుడిక టైబుల్ దగ్గర కూర్చుని చర్చించే ముందు నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియ జనసైన్యం ఇప్పటికే మొదలెట్టింది. కాకపోతే ఈ గేమ్ ప్లాన్ వెనుక బీజేపీ ఉన్నదా లేదా అన్నది మాత్రం చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి