టార్చి లైటు వేసి వెదుకుతున్న జేడీ.. – JD LAKSHMI NARAYANA

By KTV Telugu On 18 March, 2024
image

KTV TELUGU :-

రాజకీయ నాయకుడు ఆశాజీవి అంటారు. ఎన్ని సార్లు ఓడిపోయినా నెక్ట్స్ టైమ్ గెలుస్తామన్న పట్టుదలతో జనంలోకి వెళతారు. ఓటమే విజయానికి పునాది అంటారు. సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీ నారాయణ కూడా అదే ఆలోచనతో  ఉన్నారు. కొత్త  పార్టీ పెట్టి మరీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న జేడీ లక్ష్మీ నారాయణ…తాను పోటీ చేయబోయే  నియోజకవర్గాన్ని కూడా ప్రకటించేశారు.

సీబీఐ అధికారిగా జేడీ లక్ష్మీ నారాయణ పేరు మారుమోగిపోయిన మాట వాస్తవం. నిజాయతీ గల అధికారి అని, నేరస్తుల పాలిట సింహస్వప్నమైన అధికారి అని ఆయనకు పేరు ఉంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పటి నుంచి ప్రజా సేవకు అంకితమై,  ఓ ఎన్జీవోను సైతం నడుపుతున్న లక్ష్మీ నారాయణ ఆ క్రమంలో రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అవినీతికి, అక్రమాలకు తావులేని రాజకీయాలను నడపాలనుకునే  జేడీ .. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ లోక్ సభా నియోజకవర్గంలో పోటీ చేసి మూడో స్తానానికి పరిమితమయ్యారు. లక్ష్మీనారాయణకు 2.88లక్షల ఓట్లు పోలవ్వగా.. మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరికి కేవలం 2.73శాతం ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం.అంటే కేంద్రమంత్రిగా చేసిన ఆమె కంటే లక్ష్మీ నారయణే నయమని చెప్పుకోవడం ఒక వంతయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చెడు విచక్షణా జ్ఞానం ఉండదని అంత మంచి అధికారిని కూడా ఓడించారని చెప్పుకున్న వాళ్లూ ఉన్నారు. కట్ చేసి చూస్తే జేడీ సొంత పార్టీ పెట్టుకుని ఈ సారి చరిత్ర సృష్టించే  ప్రయత్నంలో ఉన్నారు……

లక్ష్మీ నారాయణ ఈ సారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు  రాజుల మధ్య ఓ సామాన్యుడి పోరాటం జరుగుతుందని  ఆయన ప్రకటించారు. గెలిచి తీరుతానని అంటున్నారు..

జై భారత్ నేషనల్ పార్టీ అంటూ లక్ష్మీ నారాయణ ఇటీవల ఒక పార్టీ పెట్టారు. విశాఖ ఎంవీవీ కాలనీ సెక్టార్ 10లో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని కూడా తెరిచినా ఆయన అక్కడ నుంచి అసెంబ్లీ ఎన్నికల కదనరంగంలోకి దిగుతానని ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. ఇంత  త్వరగా కామన్ సిగ్నల్ కేటాయించడం నిజంగా హర్షణీయమైన పరిణామమే. ఇప్పుడు ఆయన టార్చ్ లైటు పెట్టి ఓట్లు వెదుక్కోవాలన్నది నిజం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన్ను గెలిపించని విశాఖ జనం ఈ సారి మనసు మార్చుకుంటారన్న నమ్మకం లేదు.  పైగా ఏపీ జనం ఇప్పుడు ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు  ఆ కూటమిలో భాగంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తుంది. అక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారని అంటున్నారు. ఈయన బీజేపీ నుంచి 2014లో గెలవగా.. 2019 ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. విష్ణు కుమార్ రాజు పట్ల విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ఆసక్తి లేకపోయినా.. టీడీపీ కోసమైనా ఆయన్ను గెలిపిస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి..దానితో ఇప్పుడు లక్ష్మీ  నారాయణ అల్సో కంటెస్టెడ్ జాబితాలోకి వెళ్లిపోతారన్న అనుమానాలు కలుగుతున్నాయి….

లక్ష్మీ నారాయణ పోటీ చేస్తున్న రెండో ఎన్నిక ఇది. కాకపోతే తన జీవితంలో ఆయన అత్యంత కీలక ఎన్నికలు  ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఓడిపోతే ఖేల్ ఖతం ఆయినట్లే చెప్పుకోవాలి. మరి ఆ పరిస్థితి రాకుండా , విశాఖ ఉత్తరలో గెలిచే విధంగా లక్ష్మీ నారాయణ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో  చూడాలి. పైగా టైమ్ కూడా తక్కువగా ఉందని చెప్పక తప్పదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి