ఎన్టీయార్ స్థాపించిన పార్టీ నేతలే ఎన్టీయార్ ను అవమానించిన విచిత్ర ఘటన ఎన్టీయార్ పుట్టిన జిల్లాలోనే చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీయార్ అయితే టిడిపి నేతలు అవమానించింది ఆ సీనియర్ మనవడు సినీ స్టార్ జూనియర్ ఎన్టీయార్ ని. అది కూడా టిడిపి ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు కావడం కొసమెరుపు. అసలు ఎన్టీయార్ సొంత జిల్లాలో ఏం జరిగింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడి పెద్ద బావ దివంగత నందమూరి హరికృష్ణ ఆయన తనయుడు సినీ నటుడు చంద్రబాబు నాయుడి మేనల్లుడు జూనియర్ ఎన్టీయార్ ల కటౌట్లు ప్లెక్సీలను కొందరు విజయవాడ నుండి మచిలీపట్నం వరకు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఆ కటౌట్లను చూసి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు రోడ్ షో లో కొందరు జూనియర్ ఎన్టీయార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తూ ఎన్టీయర్ సిఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడికి మరింత చిర్రెత్తుకొచ్చింది. ఈ ప్లెక్సీలూ కటౌట్లు ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి అన్నట్లు టిడిపి నేతలకేసి గుర్రుగా చూశారు. దాంతో కొల్లు రవీంద్ర తో పాటు టిడిపి నేతలు కార్యకర్తలు జూనియర్ ఎన్టీయార్ ఫోటో పట్టుకున్న వ్యక్తి నుండి ఫోటో లాక్కుని పక్కన పడేశారు. టిడిపి సభల్లో జూనియర్ ఫోటోలతో సందడి చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. నిజానికి హరికృష్ణ జూనియర్ ఎన్టీయార్ లు టిడిపికి రాజకీయ ప్రత్యర్ధులు కారు. టిడిపి శత్రుపక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు కూడా కారు. నందమూరి హరికృష్ణ అయితే ఏకంగా చంద్రబాబు నాయుడికి స్వయానా బావ. ఎన్టీయార్ కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన నందమూరి కుటుంబ సభ్యుల్లో హరికృష్ణ కూడా ఉన్నారు. అప్పట్లో ఎన్టీయార్ సతీమణిని బూచిగా చూపించి ఆమె రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారని చెప్పి ఎన్టీయార్ ను అధికారం నుండి తప్పించారు చంద్రబాబు. అందులో తనకు సహకరించినందుకు హరికృష్ణకు ఆరు నెలల పాటు మంత్రి పదవిని ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టేశారు. కాలం గడిచే కొద్దీ హరికృష్ణను పూర్తిగా పక్కన పెట్టడమే కాదు ఆయన వర్గీయులైన కొడాలి నాని వల్లభనేని వంశీలకు కూడా ప్రాధాన్యత నివ్వలేదు.
ఇక హరికృష్ణ తనయుడు జూనీయర్ ఎన్టీయార్ ను 2009 ఎన్నికల్లో టిడిపి ప్రచారానికి ఫుల్లుగా వాడేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారం చివర్లో రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీయార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో తేలారు. ఆసుపత్రి బెడ్ పై ఉండీ కూడా మామయ్య చంద్రబాబు నాయుణ్ని ముఖ్యమంత్రిని చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు జూనియర్. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాలేదు. కొంతకాలం తర్వాత పార్టీ మహానాడు వచ్చింది. అందులో తన కుమారుడు లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి ముహూర్తం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీయార్ ను మహానాడు వేదిక పరిసరాల్లోకి కూడా రానీయకూడదనుకున్నారు. జూనియర్ ను పిలవలేదు. మహానాడులో తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను అందరికీ పరిచయం చేసి నేతలకు లోకేష్ నెక్స్ట్ బాస్ అని చెప్పకనే చెప్పారు. హరికృష్ణను ఒకందుకు వాడుకుని కూరలో కరివేపాకులా తీసి పారేసిన చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు జూనియర్ ఎన్టీయార్ ను మరో విధంగా వాడుకుని కరివేపాకులానే తీసిపారేశారు. తనను పక్కన పెట్టినందుకు కన్నా తన తండ్రి హరికృష్ణకు పార్టీలో జరిగిన అవమానం చంద్రబాబు నాయుడి వైఖరి గమనించిన జూనియర్ ఎన్టీయార్ అప్పట్నుంచీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018 తెలంగాణా ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి హరికృష్ణ తనయ సుహాసినికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు.
హరికృష్ణ అంతకు కొద్ది రోజుల ముందే మరణించడంతో సానుభూతి పవనాలతో ఆమె గెలుస్తారని చంద్రబాబు అనుకున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్ జూనియర్ ఎన్టీయార్ లు చచ్చినట్లు ప్రచారం చేస్తారని అని కూడా అనుకున్నారు. అయితే బాబు అంచనాలు తల్లకిందులు చేస్తూ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీయార్ లు ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో సుహాసిని కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేయించుకుందామని చంద్రబాబు అనుకున్నా జూనియర్ ఎన్టీయార్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తనకు అవసరమైనపుడు పార్టీ కోసం ప్రచారం చేయలేదని జూనియర్ పై కక్ష పెంచుకున్న చంద్రబాబు నాయుడు జూనియర్ నటించిన దమ్ము సినిమాని టిడిపి శ్రేణులు చూడకూడదంటూ ఫత్వా జారీ చేయించారు. టిడిపి నేతల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దమ్ము సినిమాను అనధికారికంగా బాయ్ కాట్ చేశారు టిడిపి నేతలు.
ఇక ఆ తర్వాత ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన విషయంలో జూనియర్ ఎన్టీయార్ స్పందించి అది ఏ మాత్రం మంచి సంస్కృతి కాదని ఆడవాళ్లని గౌరవించడం మన సంప్రదాయమని వ్యాఖ్యానించారు. రాజకీయాలు దిగజారిపోకూడదని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అండ్ కో ఆశించింది మాత్రం అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపై జూనియర్ విమర్శలు చేయాలని. వారి ఆకాంక్షలకు అనుగుణంగా జూనియర్ వ్యవహరించకపోయే సరికి టిడిపి నేతల చేత జూనియర్ ను తిట్టించారు చంద్రబాబు. ఈ కోపాలు చంద్రబాబు నాయుడి పాటు జూనియర్ కి బాబాయ్ అయిన నందమూరి బాలయ్యలోనూ పేరుకుపోయాయి. ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన రోజున ఆ కార్యక్రమంలో పాల్గొని గుండె పోటుతో కుప్పకూలిపోయిన తారకరత్న ఆసుపత్రిలో కొద్ది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తారకరత్న పెద కర్మలో పాల్గొనేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీయార్ కళ్యాణ్ రామ్ లను బాలయ్య అస్సలు పలకరించలేదు. జూనియర్ కేసి అయితే కన్నెత్తి కూడా చూడకుండా మొహం పక్కకు తిప్పేసుకున్నారు. ఇలా జూనియర్ ఎన్టీయార్ ను అవసరం ఉన్నప్పుడు వాడుకున్న చంద్రబాబు నాయుడు తన కుమారుడి రాజకీయ కెరీర్ కు అడ్డు వస్తారని జూనియర్ ను పక్కన పెట్టారు.
కానీ తనకు అవసరమైనపుడు జూనియర్ తనకు పదే పదే ప్రచారం చేయాలని ఆశిస్తూ వచ్చారు. ఈ వైఖరినే జూనియర్ ఎన్టీయార్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి కబ్జా చేసిన టిడిపిని తిరిగి నందమూరి కుటుంబం చేతుల్లోనే పెట్టాలంటూ హరికృష్ణ వర్గీయుడు ఎన్టీయార్ వీరాభిమాని కొడాలి నాని ఆ మధ్య డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీయారే భవిష్యత్ లో టిడిపి పగ్గాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కారణాల వల్లనే జూనియర్ పేరు వినపడితేనే చంద్రబాబు నాయుడిలో అసహనం తారాస్థాయికి చేరుకుంటోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు చాలా కీలకమైనవి. ఆయనకే కాదు టిడిపికి కూడా కీలకమైన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాలేకపోతే ఇక టిడిపి మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే ఆ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీయార్ చేత కూడా ప్రచారం చేయించుకోవాలని అనుకున్నారు. అయితే ఎంతమంది దూతలను పంపినా జూనియర్ రాజకీయాల్లోకి రావడానికి కానీ ప్రచారం చేయడానికి కానీ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. అందుకే జూనియర్ అంటే మరీ మండుకొస్తోంది చంద్రబాబుకి.
ఇవన్నీ మనసులో ఉన్న తరుణంలోనే రోడ్ షోలో హరికృష్ణ జూనియర్ ఎన్టీయార్ ల బొమ్మలు చూసే సరికి చంద్రబాబు నాయుడు తట్టుకోలేక పార్టీ నేతలను ఏకి పారేశారు. పైకి జూనియర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇప్పటికీ చంద్రబాబు నాయుడిలో ఆశ చావ లేదంటారు. బాబాయ్ బాలయ్య తోనూ దర్శకుడు రాజమౌళి తోనూ జూనియర్ పై ఒత్తిడి పెంచి అయినా ప్రచారంలో పాల్గొనేలా చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఆ ఎత్తుగడలకు జూనియర్ లొంగుతారా సెంటిమెంట్ కు తలవంచుతారా లేక తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది కాలమే చెప్పాలి.