కడప గడపలో కూటమిలో కుమ్ములాట -KADAPA-GADAPA-CHANDRA-BABU-NAIDU-PAWAN-KALYAN

By KTV Telugu On 8 March, 2024
image

KTV TELUGU :-

ఉమ్మడి కడప జిల్లాలో పట్టు సాధించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి టికెట్ల భయం పట్టుకుంది.  ఈ భయం కారణంగానే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా ఎటు తేల్చుకోలేకపోతుంది. టిడిపి, జనసేన పొత్తు మరో చిక్కుగా మారగా, టికెట్లు ప్రకటిస్తే ఎక్కడ అసంతృప్తులు భయటపడతాయోనన్న టెన్షన్ రెండు పార్టీలకు పట్టుకుంది. మరో వైపు టికెట్లు ఆశిస్తున్న ఆశావాహుల్లో టికెట్ వస్తుందా లేదా ఉత్కంఠ చికాకు పుట్టిస్తుంది.

ఉమ్మడి కడప జిల్లాలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పది అసెంబ్లీ, రెండు ఎంపి స్థానాల్లో వైసిపి గెలుపొంది సత్తా చాటుకుంది. ఒక్క స్థానంలోను గెలుపొందక ప్రతిపక్ష టిడిపి పూర్తిగా చతికిలపడిపోయింది. ఇక జనసేన ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితమయ్యింది. దీంతో గడచిన ఐదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో టిడిపి నేతలు పార్ట్ టైం రాజకీయాలకే పరిమితయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటంతో అధికార వైసిపిని ఢీకొడతామంటూ హాడావుడి చేస్తున్నారు. మరో వైపు అధికార వైసిపి ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల్లోకి దూసుకెళ్తొంది.

గడచిన ఐదేళ్ల లో తాము చేసిన అభిృద్దిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు వైసీపీ నేతలు. తాము అందించిన సంక్షేమ పథకాలే తమని మరోసారి గెలిపిస్తాయని వైసీపీ నాయకత్వం అనుకుంటోంది.  అయితే ఈ సారి సీన్ రివర్స్ కావడం ఖాయమని రాయలసీమలోనూ తామే క్లీన్ స్వీప్ చేస్తామని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.తెలుగుదేశం, జనసేన కూటమి  పొత్తులో భాగంగా మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. మూడు స్థానాలను ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమయ్యింది. దీంతో కొత్తగా అభ్యర్ధులను ప్రకటించడంలో టిడిపి, జనసేన పార్టీలకు అసంతృప్తుల భయం పట్టుకున్నట్లు స్పష్టమవుతొంది.

పది అసెంబ్లీ స్థానాలకు నాలుగు అసెంబ్లీ స్థానాలకు మొదటి విడతగా టిడిపి, జనసేన అభ్యర్ధులను ప్రకటించింది. పులివెందుల, మైదుకూరు టీడీపీ అభ్యర్థులుగా మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌లను ఖరారు చేశారు. ఏక నాయకత్వంలో టికెట్‌ ఆశిస్తుండడంతో అక్కడ ఖరారు చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కానీ కడప టికెట్ మాధవీరెడ్డికి కేటాయించడంతో ఇక్కడ టికెట్ ఆశించిన మరో ముగ్గురు నేతలు సైలెంట్ అయ్యారు. త్వరలోనే పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతొంది.

రాయచోటి టికెట్ కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసమ్మతి ఒక్క సారిగా భగ్గుమంది. రాయచోటిలో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంపై తన అసంతృప్తిని వెల్లగక్కారు. అయన అనుచరులు సైతం పెద్ద ఎత్తున రాజీనామాలు సమర్పించారు. పార్టీ జెండాలు తగలబెట్టి టిడిపి అధినేత చంద్రబాబును దుయ్యబట్టారు. ఇక టికెట్ రాకపోవడంతో రమేష్ రెడ్డి త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ ప్రభావం నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటిస్తే పరిస్ధితి ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

అలాంటి పరిస్థితే ఉన్న జమ్మలమడుగు స్థానాన్ని పెండింగ్‌ లో పెట్టారు. నారా లోకేష్ హామీతో గడచిన మూడేళ్లుగా పార్టీ కోసం కష్టపడి ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సీటుపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి కన్నుపడింది. బీజేపీ పొత్తు పొడిస్తే ఆ సీటు కోరాలనే నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. తనకున్న రాజకీయ సంబంధాలతో తాత్కా లిక బ్రేక్‌ వేయించి, అబ్బాయి భూపేష్‌కు బాబాయ్‌ ఆది మోకాలొడ్డారని ప్రచారం సాగుతొంది. ఒక వేళ బిజెపితో పొత్తు లేకపోయినా టిడిపిలో చేరి టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తొంది.

ఇక బద్వేలులోనూ అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇరిగేషన్‌శాఖలో డీఈగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి తెరపైకి వచ్చిన రోశన్న డీలా పడ్డారు. టీడీపీ ఇన్‌చార్జి రితేష్‌రెడ్డి రోశన్న అభ్యర్థిత్వం ఖరారు చేయాలని పట్టుదలతో ఉన్నా అభ్యర్థుల తాజా జాబితాలో పేరు లేకపోయింది. దీంతో టికెట్ రేసులో మరెవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక కమలాపురంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఇన్ చార్జి పుత్తా నరసింహారెడ్డికే టికెట్ అంటూ ధీమా ఉన్నా…. ఎందుకు ప్రకటించలేదు అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

రాజంపేటలోను జనసేన టికెట్ ఖాయమంటూ మాజీ టిడ్కొ అధికారి శ్రీనివాసరాజు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. తీరా ఎన్నికలు దగ్గరపడటంతో టిడిపి నేతలు టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పుడు ఎవరికి టికెట్ వచ్చినా అందరు కలిసి పనిచేస్తారన్న గ్యారెంటీ లేదు. రైల్వేకోడూరులోను టిడిపి, జనసేన ఇరు పార్టీలో టికెట్ ఆశిస్తున్నాయి. మరో వైపు ప్రొద్దుటూరులోను నలుగురు అభ్యర్ధులు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడా అదే పరిస్ధితి. పార్టీ టికెట్ ఇఛ్చిన అభ్యర్ధికి ఎంతమంది సహాకరిస్తారోనన్నది ప్రశ్నార్ధకంగా మారింది.  మొత్తం మీద ఓ వైపు అధికార వైసిపి ప్రచార పర్వంలో దూసుకుపొతుంటే మరో వైపు ప్రతిపక్ష పార్టీలకు మాత్రం టికెట్ల భయం పట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి