వీర్రాజు వీరంగంపై క‌న్నా క‌న్నెర్ర అందుకేనా?

By KTV Telugu On 4 January, 2023
image

ఏపీలో బీజేపీకి ఒక్క‌రంటే ఒక్క ఎమ్మెల్యే లేరు. కానీ ఆ పార్టీ లీడ‌ర్ల బిల్డ‌ప్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. క‌న్నా స్థానంలో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడ‌య్యాక సోమువీర్రాజు చెల‌రేగిపోతున్నారు. నెల్లూరు పెద్దారెడ్డి త‌ర‌హాలో పోలీసుల్ని కూడా నేనెవ‌రో తెలుసా అని నిల‌దీస్తున్నారు. బ‌లోపేతం కావాలంటే ఈమాత్రం దూకుడు ఉండాల‌ని కొంద‌రంటుంటే ఇంకొంద‌రికి మాత్రం సోమువీర్రాజు వ్య‌వ‌హారం అస్స‌లు న‌చ్చ‌డం లేదు. సోమువీర్రాజు సొంత జిల్లాలో క‌న్నా వ‌ర్గాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో క‌న్నా హ‌యాంలో బీజేపీలో ప‌ద‌వులు పొందిన‌వారిపై సోము ఓ క‌న్నేసి ఉంచారు. దీంతో ఏపీ బీజేపీలో కొన్నాళ్లుగా అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు సాగుతున్నాయి. ఇప్పుడు క‌న్నా వ్యాఖ్య‌ల‌తో ఆ గొడ‌వ రోడ్డుమీద ప‌డ్డ‌ట్ల‌యింది.

బీజేపీ జిల్లా అధ్యక్షులను చెప్పా పెట్టుకుండా మార్చేశారు సోమువీర్రాజు. అందులో ఆయ‌న సొంత జిల్లా తూర్పుగోదావ‌రి కూడా ఉంది. పార్టీ కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చ‌టాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ త‌ప్పుప‌ట్టారు. సోము తొల‌గించిన‌వాళ్లంతా ఒక‌ప్పుడు తాను నియ‌మించిన వాళ్లే కావ‌టంతో క‌న్నా క‌న్నెర్ర చేశారు. గతంలో బీజేపీలోకి ఎంతోమందిని తీసుకువచ్చానని ఇప్పుడు వారంతా పార్టీని ఎందుకు వీడుతున్నారో సోమువీర్రాజే స‌మాధానం చెప్పాలంటున్నారు క‌న్నా. అక్క‌డితోనే ఆగ‌లేదాయ‌న‌. ఏపీలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని, తెలంగాణ‌లో బండి సంజయ్‌ని బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ‌న‌సేనానికి అండ‌గా ఉంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

కేసీఆర్ జాతీయ‌పార్టీ బీఆర్ఎస్‌లో ఏపీ కాపు నేత‌లు కొంద‌రు చేరిన స‌మ‌యంలో క‌న్నా వ్యాఖ్య‌లు ఆస‌క్తిరేపుతున్నాయి. ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తిస్తాన‌న‌డం ద్వారా క‌న్నా మ‌న‌సులో ఏముందో బ‌య‌ట‌ప‌డింది. ఏపీలో ఇప్పుడున్న పొలిటిక‌ల్ ట్రెండ్‌లో బీజేపీ కంటే జ‌న‌సేన‌లోనే మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో క‌న్నా ఉన్న‌ట్లుంది. ఇదే స్పీడ్‌లో ఆయ‌న కాషాయ‌జెండా వ‌దిలేసి జ‌న‌సేన‌లో చేరొచ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్ర‌బాబు-ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీటింగ్ త‌ర్వాత రాష్ట్రంలో పార్టీని స‌మ‌న్వ‌యం చేసుకోలేక‌పోతున్నార‌ని సోమువీర్రాజుకు హైక‌మాండ్ క్లాసుపీకింది. ప‌వ‌న్‌ని బుజ్జ‌గించేందుకు వైజాగ్ ప‌ర్య‌ట‌న‌లో స్వ‌యానా ప్ర‌ధాని మోడీనే ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఇప్పుడు క‌న్నా వ్యాఖ్య‌ల‌తో సోమువీర్రాజు సీటు క‌దులుతుంద‌న్న ప్ర‌చారం మొద‌లైంది. అదే స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యంలో ఏపీ బీజేపీలో రెండు అభిప్రాయాలున్న విష‌యం కూడా తేట‌తెల్లం అయిపోయింది. సోమువీర్రాజుతో పాటు ఎంపీ జీవీఎల్‌పై క‌న్నా విమ‌ర్శ‌ల‌కు హైక‌మాండ్ ఎలా రియాక్ట‌వుతుందో చూడాలి.