గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది అని సినీ కవి సరదాగా రాసిన పాట నిజమేనేమో అనిపిస్తోంది. ఏపీ బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ మనసులో ఏం గుబులు రాజుకుంటోందో తెలీదు కానీ ఆయన మాత్రం కాస్త అసహనంగా చికాగ్గానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇతర రాజకీయ పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలకీ సుద్దులు చెబుతున్నారు.
ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మా చెడ్డ కోపంగా ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఎవరూ ఎలాంటి ఒత్తిడీ చేయద్దని ఆయన అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నది పవన్ కే వదిలేస్తే మంచిదని ఆయన సూచిస్తున్నారు. దీని అర్ధం ఏంటో అర్ధం కాక ఏపీ కమలనాథులు జుట్టు పీక్కుంటున్నారు. జనసేనపై ఒత్తిడి తీసుకురావద్దని కన్నా అనడమేంటి అసలు జనసేనపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారు. బిజెపి నాయకత్వం పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. పవన్ తోనే తమ పొత్తు అని ఏపీ బిజెపి కూడా అంటోంది. అటు పవన్ కూడా తాను బిజెపితోనే పొత్తులో ఉన్నా అంటున్నారు. మరి పవన్ పై ఎవరు ఒత్తిడి తెచ్చినట్లు.
చంద్రబాబు నాయుడు అయితే జనసేనతో పొత్తు కోసం తహ తహ లాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉంది. పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటే చాలు ఎన్నికల్లో తేలిగ్గా గెలిచి అధికారంలోకి రావచ్చునని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అసలు పవన్ లో ఆ జనాకర్షక శక్తి ఉంది కాబట్టే కదా బిజెపి అయినా ఆయనతో పొత్తు పెట్టుకుని ప్రధాని స్థాయి నేత పవన్ తో వన్ టూ వన్ భేటీలు నిర్వహిస్తున్నారు. అటు చంద్రబాబుతోనూ పవన్ పొత్తు పెట్టుకోవాలనే అనుకుంటున్నారు. పవన్ తన మనసులోని మాటను ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఏది అవసరమో అది చేస్తానని పవన్ అంటూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యతరేక ఓట్లు చీలకుండా చేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరన్నది పవన్ ఆలోచన. అదే పవన్ లక్ష్యం కూడా. దాని గురించే ఆయన టిడిపి-బిజెపిల మధ్య వారధి కట్టాలని చూస్తున్నారు. అయితే అది ముందుకు సాగడం లేదు.
ఇక అసలు విషయం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరాలని అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే దీనికి అనుకూలంగా ఆయన సంకేతాలు పంపారు. తన అనుచరులతో కలిసి భేటీ అయిన కన్నా లక్ష్మీనారాయణ 2024 ఎన్నికలు తమ రాజకీయ భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరితేనే మంచిదని భావించారట. దానికి ఆయన అనుచరులు కూడా ఒప్పుకున్నారట. అయితే కన్నాను జనసేనలో చేర్చుకోవద్దని పవన్ కళ్యాణ్ కు కొందరు అజ్ఞాత వ్యక్తులు చెబుతున్నారని కన్నా అనుమానిస్తున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తులు టిడిపి లేదా బిజపి నేతలు కావచ్చునని ఆయన భావిస్తున్నారు. పిన్ పాయింటెడ్ గా ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని ఆయన అంటున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ పై ఎవరూ ఎలాంటి ఒత్తిడీ తేవద్దని కన్నా వ్యాఖ్యానించి ఉంటారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
కన్నాను తీసుకోవడం జనసేనలో నెంబర్ టూ అయిన నాదెండ్ల మనోహర్ కు ఇష్టం ఉందా లేదా అన్నది కూడా అనుమానమే అంటున్నారు పరిశీలకులు.
నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు ఏం చెబితే అది చేయడానికే అక్కడ ఉన్నారని వారంటున్నారు. కన్నా చేరిక చంద్రబాబుకు ఇష్టమైతేనే కన్నాకు జనసేనలో తలుపులు తెరుచుకుంటాయి లేదంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా దొరక్క పోవచ్చునంటున్నారు టిడిపి-జనసేన వ్యవహారాలపై అవగాహన ఉన్న వాళ్లు. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగిన కన్నా లక్ష్మీనారాయణ 2019లో వైసీపీలో చేరదామని డిసైడ్ అయి బట్టలు సద్దుకుంటోన్న తరుణంలో ఢిల్లీ నుండి కమలనాథులు ఫోన్ చేసి అటొద్దు ఇటొచ్చేయ్ అని పిలిచి బిజెపి ప్రెసిడెంట్ పదవినే ఇచ్చేశారు. ఈ మధ్యనే ఆ పదవి నుండి విముక్తి పొందిన కన్నాకు కాలక్షేపం కావడం లేదు. 2024 ఎన్నికల్లోనూ గెలవకపోతే నియోజకవర్గ ప్రజలు కూడా మర్చిపోతారేమోనన్న ఆందోళన కూడా ఆయనలో ఉందంటున్నారు. మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల మనిషిగా పరిపాలకుడిగా కన్నాకు పేరు ఉంది. ఎక్కడా చెడ్డ పేరు లేదు. కాకపోతే 2019 లో కాలం కలిసి రాలేదంతే. వచ్చే ఎన్నికల్లో అయినా కన్నాకు ఓ మంచి విజయం ఓ మంచి పదవి లభించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.