కన్నా లక్ష్మినారాయణ. కాంగ్రెస్ టూ బీజేపీ. ఇప్పుడు కమలంపార్టీకి కూడా రాజీనామా చేసి జై జనసేన అంటున్నారు. ఏపీలో దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్నా విశ్వసనీయత లేని నాయకుడిగా మిగిలిపోయారు కన్నా లక్ష్మినారాయణ. కాంగ్రెస్ ఎంతో చేసినా కష్టకాలంలో ఆ పార్టీని వీడిన నాయకుల్లో ఆయన కూడా కలిసిపోయారు. బీజేపీ నమ్మి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టినా తన హయాంలో ఆ పార్టీకి ఆయన ఒరగబెట్టిందేమీ లేదు. పైగా తన పోస్టు సోమువీర్రాజుకు ఇచ్చినప్పటినుంచీ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వస్తున్నారు. మెడలో కాషాయకండువా ఉండగానే సొంత పార్టీ నేతలపై విమర్శలుచేశారు.
కన్నా లక్ష్మినారాయణ ఏదోరోజు జంప్ జిలానీనేనని బీజేపీ ముందే ఊహించింది. అయితే కన్నా వ్యాఖ్యలను ఖండించడమో, వివరణ కోరడమో చేయలేదు. ఏం చేసినా దాన్ని సాకుగా చూపించి పోతూపోతూ నాలుగు రాళ్లేసి వెళ్లే రకమని బీజేపీ నాయకత్వానికి తెలుసు. అందుకే ఆయన్ని పట్టించుకోవద్దంటూ పార్టీ రాష్ట్ర నేతలకు పైనుంచి సంకేతాలున్నాయి. కన్నా లక్ష్మినారాయణ ఆడిపోసుకున్నా సోమువీర్రాజు నో కామెంట్ అన్నట్లుంది అందుకే. తననెవరూ సీరియస్‌గా తీసుకోకపోవటంతో కమలంపార్టీలో ఉండటం వేస్టని కన్నాకి అర్ధమైపోయింది. అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేసేశారు.
రాష్ట్ర నాయకత్వం తీరు సరిగా లేనందుకే బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మినారాయణ. ఇదో సాకేనని అందరికీ తెలుసు. పార్టీ బాగుండాలని కోరుకుంటే ఆయన లోటుపాట్లను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేవారే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలవలేనని కన్నాకి తెలుసు. అందుకే కొన్నాళ్లు దాన్ని కేరాఫ్‌గా వాడుకుని టైం చూసి బయటికొచ్చేశారు. మొన్నటిదాకా అటూఇటూ ఊగిసలాడినా జనసేన స్టాండ్‌మీద క్లారిటీ వస్తోంది. బీజేపీకి దూరమై టీడీపీకి దగ్గరవుతోంది పవన్‌కళ్యాణ్ పార్టీ. కన్నాకి కూడా కావాల్సింది ఇదే. టీడీపీతో పొత్తంటే జనసేనకు బీజేపీ దూరం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్న అంచనాతోనే సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారు సీనియర్ లీడర్. ఏది ఎక్కినా తొక్కే ఓపిక లేదన్నది ఓపెన్ సీక్రెట్. కాపు కార్డునే నమ్ముకున్న కన్నాకి పార్టీల మార్పు అచ్చొస్తుందో లేదో భవిష్యత్తే నిర్ణయించాలి.