ఏపీ బీజేపీలో కన్నా వ్యావహారం కాక రేపుతోంది. అధ్యక్షుడు వీర్రాజుతో వేగలేకపోతున్న లక్ష్మీనారాయణ తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా పార్టీ నేతలతో సమావేశమవుతున్న ఆయన కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజులుగా లక్ష్మీనారాయణ జనసేనాని పవన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. జనసేన నేత నాదెండ్ల ఇటీవల కాలంలో కన్నా ఇంటికి వెళ్లి మంతనాలు జరపడంతో ఆయన పవన్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బీజేపీ నుంచి జనసేనలోకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈనెల 23న సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వీర్రాజు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో 22శాతం ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీకి పడ్డాయి. అయితే ఈసారి జనసేనకు మద్దతుగా నిలవాలనే ఆలోచనతో ఆ సామాజికవర్గానికి చెందిన మెజార్టీ పీపుల్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన కన్నా ఇటీవల కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబునాయుడు ఈ రిజర్వేషన్లను పూర్తిచేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు కల్పించారన్నారు. ఇవి అమలయ్యే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆ తర్వాత ఏం జరిగిందో జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గెలిచినా కాపుల ఓట్లతోనే సాధ్యపడుతోందన్నారు. 1989 నుంచి రాష్ట్రంలో వారే నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు.
ఇటీవల కాలంలో బీజేపీ కూడా కాపు మంత్రం జపిస్తోంది. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ కాపు వేదికలపై మెరుస్తూ ఆ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు కాపులు సన్మానం కూడా చేశారు. అయితే కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారంటూ సొంత పార్టీ ఎంపీ జీవీఎల్పైనే కన్నా విమర్శలు గుప్పించారు. వైసీపీ వల్లే కాపులకు రిజర్వేషన్లు దక్కలేదంటున్నారు. ఒకప్పుడు చంద్రాబును తీవ్రంగా విమర్శించిన కన్నా ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే రిజర్వేషన్లు కల్పించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆయన టీడీపీకి ప్రభావితం అయ్యారని తెలుస్తోంది. కన్నా జనసేనలో చేరతారనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కాషాయపార్టీకి గుడ్ బై చెప్పేసారు. మరి ఆయన అడుగులు ఎటువైపు అనేది చూడాలి.