కొత్త నీరు వచ్చి పాత నీటిని తన్నేస్తుంది. కొత్తగా వచ్చిన వలస నేతలు పాత నేతల ప్రయోజనాలను తన్నేస్తారు. ఇపుడు తెలుగుదేశం పార్టీలో పాత కాపులు అదే ఆందోళనతో ఉన్నారు. బిజెపికి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరడానికి రెడీ అయిన కన్నా లక్ష్మీనారాయణ అడుగులను టిడిపి లోని కాపు నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఆయన ఎంట్రీ తమకి నష్టమా లాభమా అని బేరీజులు వేసుకుంటున్నారు. రాజకీయాల్లో సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సోషల్ ఇంజనీరింగ్ పై నాయకత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంటాయి. అన్ని వర్గాలకూ పార్టీలో న్యాయం చేయలేకపోయినా చేస్తోన్నట్లు కనిపించడానికి నేతలు కష్టపడుతూ ఉంటారు.
ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో పాత కాపులకు కొత్త సమస్య ఒకటి భయపెడుతోంది. నిన్నా మొన్నటి దాకా బిజెపిలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరుతున్నారు. చంద్రబాబు నాయుడే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారని చెబుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఇపుడు టిడిపిలో ఉన్న చాలా మంది కాపు నాయకులకన్నా కూడా రాజకీయంగా సీనియరే. 1989లోనే మంత్రి పదవిని నిర్వర్తించిన అనుభవం ఉంది కన్నాకి. మంచి పాలకుడిగా రాజకీయ నేతగా వ్యూహకర్తగా కన్నాకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అటువంటి కన్నా టిడిపిలో చేరిపోతే ఆయనకు పార్టీ నాయకత్వం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక వేళ 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగలిగితే మాత్రం చంద్రబాబు మంత్రి వర్గంలో కన్నా కు నెంబర్ టూ పొజిషన్ దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబుతో సమాంతరంగా ఎదుగుతూ వచ్చిన నేతగానూ కన్నాకు మంచి ట్రాక్ రికార్డే ఉంది.
కన్నాకు అగ్రతాంబూలం దక్కితే ఆ మేరకు పార్టీలో ఉన్న పాత కాపుల్లో ఒకరికి అన్యాయం జరిగినట్లే అంటున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన మేథావులు. 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినపుడు ఆయన కేబినెట్ లో కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పతో పాటు గంటా శ్రీనివాసరావు కు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారు చంద్రబాబు. ఇపుడు కన్నా వస్తే ఈ ఇద్దరిలో ఒకరికి ప్రాధాన్యత తగ్గినా తగ్గచ్చంటున్నారు.
ప్రత్యేకించి గంటా శ్రీనివాసరావు పై పార్టీ నాయకత్వం చాలా కాలంగా గుర్రుగానే ఉందని సమాచారం. 2019 ఎన్నికల్లో టిడిపి 23 స్థానాలకు పరిమితం అయిన తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించినా కూడా దాంతో తనకు సంబంధం లేదన్నట్లు గంటా ఇంటికే పరిమితం అయ్యేవారు.
ఆ సమయంలోనే ఏపీలో పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో టచ్ లో ఉండేవారని గంటాపై అనుమానాలు ఉన్నాయి. ఏ క్షణంలోనైనా గంటా వై.ఎస్.ఆర్.సి.పి.లో చేరతారని ప్రచారమూ జరిగింది. అయితే ఆ ప్రచారానికి గంటా స్పందించనూ లేదు అలాగని ఖండించనూ లేదు. కాకపోతే పార్టీ అధినేత పిలుపు మేరకు నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ గంటా పాల్గొనలేదు. కానీ ఈ మధ్యనే అది కూడా టిడిపి-జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకున్న తర్వాతనే గంటా బయటకు వచ్చారు. తాను టిడిపిని వదిలే ప్రసక్తే లేదన్న గంటా ఇకపై రాజకీయంగానూ చాలా యాక్టివ్ గా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి వెళ్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండచ్చన్న అంచనాతోనే గంటా ఇపుడు మనసు మార్చుకుని ఉండచ్చని టిడిపిలోనే ప్రచారం జరుగుతోంది. ఇక టిడిపిలో గంటాకు ఆగర్బ శత్రువు అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు అయితే గంటా ఎవరు లక్షమందిలో ఒకరు అంటూ మీడియా సమావేశంలో గాలి తీశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంటికి పరిమితమైన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అయ్యన్న అధినేతకు వినిపించేలా అరిచి గీపెట్టారు కూడా.
అయితే ఎన్నికల వరకు ఏ ఒక్కరినీ దూరం చేసుకోకూడదన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు గంటా మనసు మార్చుకోగానే దాన్ని సానుకూలంగానే భావించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి అధికారంలోకి వస్తే అప్పుడే గంటా పని పట్టచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. కన్నాను పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా అదే కారణమై ఉండచ్చంటున్నారు. కన్నా పార్టీలోకి వస్తే కాపు సామాజిక వర్గంలో సీనియర్ నేత కాబట్టి ఆ సామాజిక వర్గం ప్రజలు తమకి చేరువ అవుతారని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. రేపు అన్నీ కలిసొచ్చి అధికారంలోకి వస్తే అపుడు కన్నాను అందలం ఎక్కించి తోక జాడించిన గంటాకు గుణపాఠం చెప్పాలని చంద్రబాబు చాలా కసిగా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబే కాదు లోకేష్ కూడా గంటాపై కోపంగానే ఉన్నారని అంటున్నారు.
నిమ్మకాయల చినరాజప్ప తో పోలిస్తే కన్నా లక్ష్మీనారాయణ సమర్ధవంతుడైన మంత్రిగా ఉండగలరు. ఎందుకంటే చట్టాలపైనా ప్రభుత్వాల పనితీరుపైనా కన్నాకు అపారమైన అనుభవం అవగాహన రెండూ ఉన్నాయి. అంచేతే మంత్రి పదవిని ఇచ్చినా కూడా ఆయన చాలా సమర్ధవంతంగా నిర్వర్తించగలరని అంటున్నారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన కాపు నేత బోండా ఉమ కూడా అప్పుడప్పుడూ తోక జాడిస్తున్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కాపునేతలందరికీ చెక్ చెప్పేందుకే కన్నాను పార్టీలోకి ఆహ్వానించారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆషామాషీగా ఉండదు. ఏదో ఒక ఆంతర్యం లేనిదే ఆయన ఎలాంటి నిర్నయం తీసుకోరని రాజకీయ పండితులు అంటున్నారు. అంచేత కన్నా ఎంట్రీ అనేది టిడిపిలో చాలా మంది గుండెల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని వారంటున్నారు. బిజెపికి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. చాలా మంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెలిగారు. అయితే రాష్ట్ర విభజన తో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడంతో కన్నా రాజకీయ ప్రస్థానం కుదుపునకు గురైంది. 2019లో వైసీపీలో చేరదామనుకున్న కన్నా చివరి నిముషంలో బిజెపిలో చేరారు. ఇపుడు కాషాయం జెండా తీసేసి పచ్చకండువా వేసుకోడానికి భుజాలు శుభ్రం చేసుకున్నారు.