కాపుల చుట్టే ఏపీ రాజకీయం.. జగన్‌ రియాక్షనేంటి?

By KTV Telugu On 28 December, 2022
image

బెల్లం చుట్టూ ఈగల్లా ఏపీలో రాజకీయమంతా కాపులచుట్టే ముసురుకుంటోంది. వంగవీటి రంగా విగ్రహానికి దండలేయడానికి టీడీపీ నేతలు కూడా పోటీపడ్డారు. బీజేపీ నేతలు కూడా వచ్చి కాపులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాపుల ఓట్లు గంపగుత్తగా మా ఒళ్లోనే పడతాయని ఏ పార్టీ అనుకోవడానికి లేదు. నేను కేవలం కాపులకే నాయకుడిని కాదని ఒకప్పుడు అన్న పవన్‌కళ్యాణ్‌ కూడా ఇప్పుడు తన సామాజికవర్గాన్ని దువ్వేపన్లో ఉన్నారు. వారి మద్దతుతో సీఎం అభ్యర్థిగా తనకు మద్దతు పెరుగుతుందనుకుంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం కీలకం కాబోతోందన్నదైతే కాదనలేని వాస్తవం.

కాపు నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు. తమ పార్టీ లైన్‌ ప్రకారం వారు మాట్లాడుతుంటారు. పవన్‌కళ్యాణ్‌ని విమర్శించాల్సి వస్తే వైసీపీనుంచి ఏ అంబటి రాంబాబో, పేర్నినానినో, కన్నబాబో, మరో కాపునేతో ముందుంటారు. ఇప్పుడు కాపు సామాజికవర్గం నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్‌ రాజ్యాధికారం. పల్లకీ మోసే బోయీల్లా ఎన్నాళ్లుంటాం మనమే అందులో కూర్చోవాలన్న కొత్త డిమాండ్‌ తెరపైకొచ్చింది. కాపు నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతివ్వాలనే ప్రతిపాదన ఊపందుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపుల మద్దతు కూడా కలిసిరావడం వల్లే అంత భారీ మెజారిటీ సాధ్యమైందన్న వాదన కూడా ఉంది.

కాపుల ప్రాధాన్యం తెలిసిరాబట్టే అన్ని పార్టీలు ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తోంది. బీసీలకు పెద్దపీట వేస్తూనే కాపులకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. కాపులను బీసీలలో చేర్చాలన్న డిమాండ్‌పై ఆ సామాజికవర్గం ఎప్పటినుంచో పట్టుదలతో ఉంది. బీసీలను కాపుల్లో చేర్చడానికి పెద్ద కసరత్తే చేయాల్సి ఉన్నా ఈమధ్య కేంద్రం చేసిన ప్రకటనతో మనసుంటే మార్గం ఉందనే విషయం అర్ధమైంది. ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ కింద రాష్ట్రాలు ఎవరికైనా ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.

ఈబీసీలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు ఇస్తూ చంద్రబాబు సర్కార్ గతంలో చట్టంచేసింది. దీంతో ఆ చట్టాన్ని అమలుచేయాలని కాపులు కోరుతున్నారు. ఇదే విషయంలో సుదీర్ఘకాలం పోరాడిన ముద్రగడ పద్మనాభం కూడా ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలంటూ సీఎం జగన్‌కి లేఖరాశారు. ఉద్యమానికి దిగుతామన్న హెచ్చరికలేం చేయలేదు. ఆ పనిచేస్తే మీకే మంచి పేరొస్తుందని కాపుల ప్రతినిధిగా ముద్రగడ సూచించారు. కాపుల చుట్టూ ఏపీ రాజకీయం చక్కర్లు కొడుతున్న సమయంలో వైసీపీకి ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు. ముద్రగడ మాటను మన్నించి చట్టపరిధిలో కాపుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేస్తే మిగిలినపార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆ వర్గం ఫ్యాన్‌ పార్టీకే జైకొడుతుంది. బహుశా వైసీపీ అధినేత ఆలోచన కూడా అదేనేమో!