అధికారవర్గాలను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తన పదేళ్ల పాలనలో ప్రయోజనం పొందిన అధికారులతో ఆయన చక్రం తిప్పిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైపు నుంచి ఏ పని జరిగినా, ఏ మీటింగు నిర్వహించిన కేసీఆర్ కు తెలిసిపోతోందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయంలో ఇటీవలి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు చెబుతున్నారు. ఆ సంగతి ఏమిటో తేల్చి, అడ్డుకట్ట వేయాలని ఆయన ఆదేశించారని సెక్రటేరియట్ వర్గాల టాక్….
ప్రభుత్వ పెద్దల అనుమానాలు ఒకటొకటిగా నిజమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కీలక పదవులను నిర్వహించిన అధికారులు ఇప్పుడు ఆ పార్టీకి టచ్ లో ఉంటూ.. కేసీఆర్ కు జీ హుజూర్ అంటున్నారు. ప్రధాన శాఖల్లో పనిచేసిన వారంతా అప్పట్లో చేసినట్లుగానే కేసీఆర్ కు గులాంగిరీ చేస్తున్నారన్న అనుమానంతో రేవంత్ ప్రభుత్వం రహస్య విచారణ జరిపితే.. అది నిజమేనని తేలింది. ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోని ఆఫీసర్లు గులాబీ పార్టీతో అంటకాగుతున్నారని, ప్రభుత్వ చర్చలు, తీసుకున్న నిర్ణయాలను బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారని తేలిపోయింది.పైగా ఆయా అధికారుల లోపాయకారి చర్యలు ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిగా ఉంటున్నాయి. ఇంటి దొంగలను పట్టుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే చాలా మంది పేర్లు బయటకు వస్తాయి…
అధికారం మారి నాలుగు నెలలైనప్పటికీ కొందరి అధికారుల్లో ఇంకా స్వామి భక్తి పోలేదు. బీఆర్ఎస్ హయాంలో వివిధ రూపాల్లో ప్రయోజనం పొందడంతో వాళ్లు కేసీఆర్ కు కొమ్ముకాసేందుకే ఇష్టపడుతున్నారు. గోప్యంగా ఉంచాల్సిన రివ్యూ మీటింగుల వ్యవహారం కూడా సాయంత్రానికి బీఆర్ఎస్ కు చేరిపోతోందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది…
ఏ శాఖలో ఏ అంశంపై రివ్యూ జరిగింది? ఏ విషయాలు చర్చించారు? ఏం నిర్ణయాలు తీసుకున్నారు? అనే విషయాలను పూసగుచ్చినట్టు బయటకు చేరవేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఆ సమాచారం ఆధారంగానే బీఆర్ఎస్ లీడర్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అర్థమైంది. సూర్యపేట జిల్లాలో ఎండిన పొలాలను కేసీఆర్ పరిశీలించినప్పుడు జరిగిన వ్యవహారం కోవర్ట్ ఆపరేషన్ కు నిదర్శనంగా నిలుస్తోంది. మరో పక్క కొందరు అధికారులు కేసీఆర్ మనసెరిగి ప్రవర్తిస్తున్నారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తోంది. సాగర్లో నీళ్లున్నా ప్రభుత్వం వాటిని విడుదల చేయలేదని కేసీఆర్ విమర్శించిన తర్వాత రెండు రోజులకే పాలేరు ప్రాజెక్టు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇదే విషయాన్ని కరీంనగర్లో కేసీఆర్ ప్రస్తావిస్తూ.. తన పర్యటనలో భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని గొప్పగా చెప్పుకున్నారు. దీనితో అప్పటివరకు నీళ్లు విడుదల చేయకుండా చేతులు కట్టుకుని కూర్చున్న ఇరిగేషన్ ఆఫీసర్లు, కేసీఆర్ టూర్ తర్వాత రిలీజ్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి..? తాగునీటి అవసరాల కోసం నీళ్లను విడుదల చేయాల్సి వస్తే, కేసీఆర్ టూర్ కన్నా ముందుగా ఎందుకు రిలీజ్ చేయలేదు..? అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్య కొన్ని గ్రామాల్లో పగటి వేళల్లో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం క్రాస్ చెక్ చేస్తే ఆ ఏరియాకు చెందిన సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గుర్తించినట్టు తెలిసింది.
ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని సీఎం రేవంత్ గుర్తించారు. గత ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేసిన ఆఫీసర్ల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో వారం పది రోజుల్లో భారీ స్థాయిలో మార్పులు ఖాయమని, కోవర్టు అధికారులను ప్రాధాన్యం లేని పదవులకు పంపుతారని తెలుస్తోంది. చూడాలి మరి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…