ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ రాజకీయం

By KTV Telugu On 11 December, 2022
image

విజయవాడలో స్థలం ఎంపిక పూర్తి
ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు

ఆంధ్రావాళ్లను బూచీగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ ఇప్పుడు అదే అంధ్రాలో రాజకీయ కార్యకలాపాలు మొదలెట్టబోతున్నారు. టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్‌. అందుకోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటకలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు నిర్మాణంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఏపీలోని విజయవాడలో ఇప్పుటికే స్థలం ఎంపిక పూర్తయింది. ఈమేరకు అక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చే వారం ఇద్దరుముగ్గురు మంత్రులు విజయవాడకు వెళ్తున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు హాజరయ్యారు.

వచ్చే ఏడాది కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలుగువారి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. దానికంటే ముందు అక్కడ బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు మహారాష్ట్రలో కూడా బీఆర్‌ఎస్‌ విస్తరణ కార్యాలయం ఏర్పాటుపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఇకపోతే ఢిల్లీలో ఆల్‌రెడీ బీఆర్‌ఎస్‌ కార్యకలాపాల కోసం ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ ఆఫీసును ఈ నెల 14న కేసీఆర్‌ ప్రారంభిస్తారు. పార్టీ కార్యాలయాల ఏర్పాటుతో పాటు కేసీఆర్‌ జాతీయ స్థాయి నాయకులతో సంప్రదింపుల కోసం దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. అంతేకాదు బీఆర్‌ఎస్‌కు మద్దతు కోసం వివిధ రాష్ట్రాలకు పరిశీలకులను పంపించాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. మిగతా రాష్ట్రాల మాటేమోకానీ ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.