ఏపీ కాంగ్రెస్ దుకాణం బంద్

By KTV Telugu On 8 April, 2023
image

కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక పదవులు వచ్చే అవకాశాలు కనుచూపు మేరల్లో కూడా లేవని నిర్ధారించుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ ను ఎందుకు వీడారో బిజెపిలో ఎందుకు చేరారో కూడా ఆయన వివరించారు. రోగం ఉన్నా వైద్యం చేయించుకోడానికి కానీ మందులు వేసుకోడానికి కానీ కాంగ్రెస్ పార్టీ నిరాకరించడం వల్లనే  రోజురోజుకీ దాని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని పొయెటిగ్గా పేర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఏడు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుటుంబానికి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హస్తిన వేదికగా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ అద్భుతమని కొనియాడిన కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక రోజున కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. రాజు మహా మేథావి కాకపోతే ఏ విషయాన్నీ సొంతంగా ఆలోచించలేడు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి సెటైర్ వేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఏ పని ఎవరికి అప్పగించాలన్న కామన్ సెన్స్ కాంగ్రెస్ హై కమాండ్ కు లేకపోయిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను కొందరికి అప్పగించిన సోనియా ఏపీకి చెందిన నాయకులెవరితోనూ చర్చించకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీ నాయకత్వం కొందరకి ఓ అసైన్ మెంట్ ఇచ్చింది. రాష్ట్ర విభజన చేయడమే ఆ అసైన్ మెంట్. అయితే ఎవరికైతే అసైన్ మెంట్ అప్పగించారు ఆ కమిటీలో ఏ ఒక్కరూ కూడా తమని సంప్రదించడం కానీ సూచనలు కోరడం కానీ చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చివరిదాకా చెబుతూ వచ్చారు. ఆయన దాన్ని నమ్మి చెప్పారా లేక సోనియా గాంధీ ఆదేశాల మేరకు అలా ఏపీ ప్రజలను భ్రమల్లో ఉంచారా అన్నది ఇప్పటికీ మిస్టరీనే అంటారు రాజీకయ పండితులు. చిత్తూరు జిల్లా వాయిల్పాడు నియోజకవర్గం నుండి 1989, 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి  2009లో  పీలేరు నియోజకవర్గం నుండి గెలిచి వై.ఎస్.ఆర్. కేబినెట్ లో చీఫ్ విప్ గా వ్యవహరించారు. వై.ఎస్.ఆర్. కు విధేయంగా ఉండే వారని పేరు.

కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడే. ఆయన దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు.  ఆయన కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో వై.ఎస్.ఆర్. అకాల మరణం అనంతరం ముందుగా రోశయ్యను సిఎంని చేసిన కాంగ్రెస్ హై కమాండ్  కొంత కాలానికే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంని చేసింది. నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన వెంటనే  ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే గిరీకీ రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాలతో చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు తిరస్కరించడంతో తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన బిజెపిలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఎందుకో కానీ అలా జరగలేదు.

చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చేరిక ద్వారా ముందుగా ఆ జిల్లాలో పాగా వేసినట్లు అవుతుందని బిజెపి నేతలు భావించారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు మాజీ కాంగ్రెస్ నేతలు కూడా బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కేబినెట్ లోని సహచర మంత్రుల్లో ఏ పార్టీలోకీ జంప్ చేయకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయి ఇపుడు ఏ పదవులూ లేక తెరమరుగు అవుతోన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా బిజెపిలో చేర్చుకోవాలన్నది కమలనాథుల మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ కాంగ్రెస్ నేతలతో పాటుటిడిపిలోనే చాలా మందితో మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం టిడిపిలో ఉన్న కొందరు సీనియర్ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాకపోవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి నేతలను కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేర్పిస్తారని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు కూడా టిడిపిలో కొనసాగలేక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరలేక ఎటు చేరాలో తెలీక అయోమయంలో ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి ఓ జాబితా తయారు చేసి వారిని బిజెపిలో చేర్పించడం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలుగా చెబుతున్నారు. అందుకు ప్రతిగా కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవితో పాటు రాజ్యసభ స్థానాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఈ మధ్యనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  నాయకత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన నెల్లూరు  వైసీపీ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి  కూడా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆయన టిడిపిలో చేరతారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరితే ఆయనతో పాటు ఆనం కూడా బిజెపి వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరగానే బి.ఆర్.ఎస్. పార్టీ నేతలు బిజెపిపై భగ్గు మన్నారు. తెలంగాణా వ్యతిరేకిగా ముద్ర పడ్డ వారినే బిజెపి తమ పార్టీలో చేర్చుకుంటుందని వారు విమర్శించారు. తెలంగాణా ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తి లేదని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అన్నారని బి.ఆర్.ఎస్. నేత బాల్క సుమన్ గుర్తు చేస్తున్నారు. అటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకున్న బిజెపిని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని వారు పిలుపు నిస్తున్నారు. అయితే దీనిపై బిజెపి కూడా దీటుగానే బదులిచ్చింది. తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక  తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించిన తెలంగాణా ద్రోహులనే పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది కేసీయారే అని బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా వాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన నాటి టిడిపి నేతలు తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ లను కేసీయార్ ఎందుకు చేరతీసి పదవులు ఇచ్చారో చెప్పాలని బిజెపి నిలదీస్తోంది.