ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే కుట్ర.
చంద్రబాబు టార్గెట్‌గా కొడాలి విమర్శలు.
ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, పవన్‌పైనా పంచులు.
మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు టార్గెట్‌గా మరోసారి రెచ్చిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ బాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా, పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా వారంతా కుట్ర చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని కొడాలి ఆరోపించారు. బలవంతంగా లోకేష్‌ను తీసుకొచ్చి పార్టీ, ప్రజలపై రుద్దాలని చూస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. గతంలోనూ పలుమార్లు కొడాలి ఈ స్థాయిలో ఆరోపణలు చేసినప్పటికీ ఎన్టీఆర్ డీఎన్‌ఏతో లింక్ పెడుతూ సరికొత్తగా బాబుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎన్టీఆర్ పిల్లలను అనాథలను చేశారని వారిని చెట్టుకొకరు, పుట్టకొకరుగా గాలికి వదిలేశారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కొడాలి.
అంతేకాదు, రాష్ట్రాన్ని ఆక్రమించేందుకు ఓ కులం పన్నాగం పన్నుతోందంటూ పరోక్షంగా కమ్మ సామాజికవర్గంపైనా విమర్శలు గుప్పించారు. మరోవైపు తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై జరుగుతున్న చర్చపైనా స్పందించారు. జోగి రమేష్‌ను మంత్రిని చేయడంపై ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలపై కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేర్నినానిని తనను పక్కనబెట్టి ఒక్క జోగి రమేష్‌తోనే సీఎం జగన్ జిల్లా అంతా నడిపిస్తున్నారని కొడాలి అన్నారు. ఎంత దమ్ము ధైర్యం లేకపోతే అలా చేస్తారని జగన్‌ను ఆకాశానికెత్తారు. చంద్రబాబు అలా చేయగలరా అంటూ సెటైర్లు వేశారు. మంత్రి పదవి పోయినందుకు తమకు ఎలాంటి బాధ లేదన్న కొడాలి జోగి తన జేబులో మనిషి అని జోకులు వేశాడు. ఎన్టీ రామారావు, వైఎస్ఆర్ కలిస్తే ఉండేంత దమ్ము కేవలం సీఎం జగన్ కు మాత్రమే ఉందన్నారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని లేకపోతే కొందరు 420లు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేస్తారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గత కొన్నేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు జూ.ఎన్టీఆర్. చంద్రబాబుతో గ్యాప్ వచ్చాక పూర్తిగా సినిమాలపైనే దృష్టిసారించారు. అయితే అప్పుడప్పుడు జూ.ఎన్టీఆర్ టార్గెట్‌ను లాగే ప్రయత్నం చేస్తున్నారు తమ్ముళ్లు. బాబు కుటుంబంపై వైసీపీ నేతల ఆరోపణల సమయంలోనూ, అమరావతి పాదయాత్ర సమీపంలోనూ అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన సందర్భంలోనూ ఎన్టీఆర్ స్పందనపై టీడీపీ నేతలు పెదవి విరిచారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్‌కు విధేయులుగా చెప్పుకునే వారంతా తారక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీకి అసలు వారసుడు జూ. ఎన్టీఆర్ మాత్రమేనని వాదన తీసుకొస్తున్నారు. అందుకు తగ్గట్లే చంద్రబాబు పర్యటనల్లో అక్కడక్కడా జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఎన్టీఆర్‌పై అభిమానం చాటుకునే కొడాలి, వల్లభనేని లాంటి నేతలు కూడా అప్పుడప్పుడూ టీడీపీ, ఆ పార్టీ అధినేత, లోకేష్ ని లక్ష్యంగా చేస్తున్న విమర్శలు హీట్ పెంచుతున్నాయి.