టీడీపీలో గ్రూపు తగాదాలకు నిదర్శనమా..

By KTV Telugu On 1 November, 2024
image

KTV TELUGU :-

తెలుగుదేశం పార్టీలో మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావుకు సంబంధించి మరో వివాదం రాజుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆయన ఎందుకలా చేశారన్న చర్చ అప్పట్లో చాలా రోజులు జరిగింది. జగన్ ప్రభుత్వం వేధించిన కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొందరు ఆరోపిస్తే, కుటుంబంలో రచ్చ కారణంగా డాక్టర్ గారు తనువు చాలించారని మరికొందరు వాదించారు. ఆ సంగతి మరుగునపడిపోయినా టీడీపీలో మాత్రం కోడెల వారసులకు సముచిత స్థానం లభించలేదన్న వాదనా ఉంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ గా కోడెల ఉన్నప్పుడు ఆయన కుమారుడు శివరాం, ఆయన కుమార్తె చేసిన అరాచకాల కారణంగా పార్టీ పరువు పోయిందని ఫిర్యాదులు అందడంతో చంద్రబాబు వారిని దూరం పెట్టారు. పార్టీలో పని చేసి ప్రూవ్ చేసుకుంటే మళ్లీ అవకాశమిస్తానని శివరాంకు హామీ ఇచ్చిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. సత్తెనపల్లి టికెట్ ను మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు కేటాయించి గెలిపించుకున్నారు.ఇన్ని రోజుల తర్వాత కోడెల విగ్రహానికి సంబంధించి ఒక వివాదం తలెత్తింది.

కోడెల వర్థంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని లింగంగుంట్ల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణకు ముందే రాత్రికి రాత్రి తొలగించారు. విగ్రహం కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను కూడా పగులగొట్టారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. విగ్రహాన్ని ఎవరు తొలగించారో తెలియజేయాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెంట్ మంత్రు నాయక్ ను నిలదీశారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన సమాధానం టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరినీ ఆశ్చర్యపరిచేదిగా ఉంది. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాట అరవిందబాబు ఆదేశాల మేరకు కోడెల విగ్రహాన్ని తొలగించామని ఆయన వెల్లడించారు. వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనకు వస్తున్న సందర్భంగా కోడెల విగ్రహం అక్కడ ఉండటానికి వీల్లేదని ఎమ్మల్యే అరవిందబాబు ఆదేశించారట. విగ్రహాన్ని తొలగించకపోతే సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాల్సి ఉంటుందని బెదిరించారట. దానితో గత్యంతరం లేక సూపరింటెండెంట్ స్వయంగా ఆ విగ్రహాన్ని తొలగించారు. దీనితో టీడీపీ కేడర్ తీవ్ర ఆగ్రహం చెందినా చేసేదేమీ లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు…

టీడీపీలో నెలకొన్న గ్రూపు తగాదాలకు కోడెల విగ్రహం బలైందన్న వాదన కూడా వినిపిస్తోంది. కోడెల కుమారుడు శివరాం.. రాత్రికి రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసి.. వర్థంతి రోజున ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఆ విషయం పార్టీకి గానీ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుకు గానీ చెప్పలేదు. విగ్రహావిష్కరణతో పరపతి పెంచుకుందామని చూశారే తప్ప..దాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించాలన్న ప్రయత్నం చేయలేదు. పైగా పబ్లిక్ ప్లేస్ లో ఒక పెద్ద నాయకుడి విగ్రహం పెట్టాలంటే.. అనుమతులు అవసరం. ఒక పెద్ద నాయకుడిని పిలిచి ఆవిష్కరణకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ శివరాం ఇష్టానుసారం వ్యవహరించారు. దానితో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అరవిందబాబు ఆ విగ్రహాన్ని తొలగింపజేశారు. లైమ్ లైట్లో ఉండటానికి శివరాం అడ్డమైన ట్రిక్స్ చేస్తూ ఉంటారని అరవిందబాబు వర్గం ఆరోపిస్తోంది. ఏదేమైనా ఇద్దరు నేతల గొడవల మధ్య.. కోడెల విగ్రహానికి అవమానం జరిగిందని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి