రాజకీయాల్లో ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే కొంప కొలాప్సే. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలాంటి అడుగులేస్తారో తెలీదు. కనిపిస్తే కాళ్లు పట్టుకునేవాడు కూడా ఏదోరోజు కాలర్ పట్టుకోవచ్చు. పార్టీకి వీర విధేయుడనో ఎప్పుడూ హద్దుమీరడని అనుకోడానికే లేదు. ఆనం రామనారాయణరెడ్డి ధిక్కారస్వరం వినిపించిన జిల్లాలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే గొంతు మారుతోంది. ఆనం కుటుంబం సంగతి తెలిసినా ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించింది. సీటిచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కల్పించింది. కానీ కొన్నాళ్లకే ఆనం ఎపిసోడ్ అడ్డం తిరిగింది. ఇప్పుడు వెంకటగిరిలో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.
నెల్లూరు జిల్లాకే చెందిన రూరల్ ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పుడు డౌట్ కొడ్తోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వీర విధేయుడు. కానీ అది ఒకప్పుడనట్లుంది కోటంరెడ్డి ప్రస్తుత తీరు. ఒకప్పుడు ఆనం కుటుంబాన్ని వ్యతిరేకించి నిలబడ్డ నాయకుడు కోటంరెడ్డి. కానీ ఇప్పుడు ఆయన నోటినుంచి కూడా మాట తేడావస్తోంది. రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచిన శ్రీధర్‌రెడ్డి పార్టీలో ఉంటూనే పరోక్షంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకటీ రెండుసార్లు కాదు ఈమధ్య తరచూ కోటంరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వానికే అనుమానాలొస్తున్నాయి.
కోటంరెడ్డి విధేయతమీద పార్టీకి ఇప్పటికీ నమ్మకం ఉన్నా మాటతేడా ఎందుకొస్తోందన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఈమధ్య మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కూడా తన అసంతృప్తిని బయటపెట్టుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయన ఏ క్షణాన్నైనా పార్టీని వీడొచ్చనే అనుమానాలు ఉన్నాయి. వైసీపీ నాయకత్వం కూడా మైలవరంలో జోగి రమేష్‌ని ప్రోత్సహిస్తోంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విషయంలో అలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ లేకపోయినా ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారన్నదానిపై దృష్టిపెట్టింది.
ఒకప్పుడు కోటంరెడ్డి నోరే వైసీపీకి ప్లస్. కానీ ఇప్పుడా నోటితోనే నాయకత్వాన్ని అసహనానికి గురిచేస్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి కోటంరెడ్డికి ఎప్పటినుంచో ఉంది. ఆయనకు బావ వరసైన కాకాణి గోవర్దన్‌రెడ్డికి పార్టీ పెద్దపీట వేసింది. కాకాణి మంత్రి అయినప్పటినుంచీ కోటంరెడ్డి అసహనంతోనే ఉన్నారు. ఓసారి కోటంరెడ్డితో స్వయానా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. బుజ్జగించారని చెప్పలేం కానీ పార్టీని నష్టపరిచేలా మాట్లాడొద్దని క్లాస్ అయితే కచ్చితంగా తీసుకుని ఉంటారు.
అధినేతతో మాట్లాడాక కూడా కోటంరెడ్డి తగ్గడంలేదు. ఇంకా గొంతు పెంచుతున్నారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనైన తన మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. చాలా ఫోన్లు ఉన్నాయని బోలెడన్ని సిమ్ కార్డులు ఉన్నాయంటూ తన ఫోన్ ట్యాపింగ్ ఎవరివల్లా కాదని కోటంరెడ్డి చెప్పటం సంచలనం సృష్టిస్తోంది. ఫోన్లు ట్యాప్ చేసే అవకాశం అధికారంలో ఉన్నవారికే ఉంటుంది. అందుకే కోటంరెడ్డి చేస్తున్న విమర్శలు నేరుగా పార్టీకే తగులుతున్నాయి
నెల్లూరులో కొందరు పెద్దలు తనను తొక్కేయాలని చూస్తున్నారని ఆ మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో ట్యాపింగ్ అంటున్నారు. దీంతో ఆయన ఆలోచనేంటో పార్టీ పెద్దలకు అంతుపట్టటం లేదు. వైసీపీతోనే ఉంటారా లేకుంటే వెళ్లిపోతారా అన్నది పార్టీనేతలకే అర్ధంకావడం లేదు. అలాగని ఆనం రామనారాయణరెడ్డి విషయంలో వ్యవహరించినట్లు కఠినంగా స్పందించలేరు. ఎందుకంటే తన దూకుడుతో ప్రత్యర్థులను కోటంరెడ్డి ఎలా ఎదుర్కున్నాడో ప్రతీ కార్యకర్తకీ తెలుసు. ఆయనమీద చర్యలు తీసుకుంటే సొంతింటికి నిప్పు పెట్టుకున్నట్లే. అందుకే కోటంరెడ్డి విషయంలో వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా ఉంది.