చాలా కాలం తర్వాత మళ్లీ ఏపీ రాజకీయాల్లో లగడపాటి పేరు వినిపిస్తోంది. 2024లో ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కొనసాగుతున్న కేశినేని నాని టీడీపీలో అసమ్మతి నేతగా మారారు. చంద్రబాబు, పార్టీ నేతలపై అప్పుడప్పుడు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. దీంతో నాని తీరుపై అధినాయకత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే ఎంపీకి వ్యతిరేకంగా ఆయన సోదరుడిని పార్టీ పెద్దలు దగ్గరకు తీస్తున్నారు. అది రుచించని కేశినేని ఈ మధ్యకాలంలో ఇంకా తన స్పీడ్ పెంచారు. బహిరంగంగానే పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి లగడపాటిని దించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోందట. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు లగడపాటి విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో లగడపాటి చేసిన హడావిడిని ఎవరూ మరిచిపోలేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన పెప్పర్ స్ప్రే ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమంలో పాల్గొన్న లగడపాటి రాష్ట్రవిభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన ఆయన ఇప్పటివరకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారనే ప్రచారం జోరందుకుంది. విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేస్తే విజయావకాశాలుంటాయని సీక్రెట్‌గా నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలడంతో లగడపాటి పోటీకి మొగ్గుచూపుతున్నారని తెలిసింది. కేశినేని నాని చంద్రబాబు పట్ల అనుసరించిన వైఖరి ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరు టీడీపీలోనే చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపుగా టీడీపీ నుంచి లగడపాటి పోటీచేయడం ఖాయమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఇక రాజకీయ సర్వేలు నిర్వహించడంలో సిద్ధహస్తులైన లగడపాటి పార్టీల బలాలు నేతల గెలుపోటముల లెక్క తేలుస్తుంటారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమిపాలవుతారు? అనే విషయంలో ఆయన చేయించే సర్వేలు 100కు 100 శాతం కచ్చితంగా నిజం అయ్యేవి. దీంతో ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు వచ్చింది. రాజకీయాలకు దూరం జరిగినప్పటికీ 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని లగడపాటి చెప్పిన విషయం నిజమైంది. అయితే, 2018 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తాయని ఆయన చెప్పిన అంచనా తప్పైంది. అదే లగడపాటికి సర్వేల పరంగా తొలి పరాజయం. తర్వాత 2019 ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అది కూడా విఫలమైంది. వైసీపీ గెలవడంతో ఇక సర్వేలే చేయనని చెప్పారు.