ఏపీలో కూటమి పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని అంశాల్లో సూపర్ సక్సెస్ అని జనం చెప్పుకుంటుండగా.. కొన్ని విషయాల్లో ఏదో తేడా కొడుతోందన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణం క్షేత్ర స్థాయి సమస్యల కంటే ఉన్నత వర్గాల్లో ఉదాసీనతేనని సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు చంద్రబాబు చేసుకుంటున్న సమీక్షల్లో కొందరు నేతలు, మంత్రులపై వస్తున్న ఆరోపణలు ఇబ్బందిగా పరిణమించాయి.
కూటమి పక్షానికి చెందిన జనసేన నేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా జనరంజక పాలన అందిస్తుంటే.. కొందరు మంత్రులు మాత్రం అంటీ ముట్టనట్లుగా ఉంటున్నట్లు చంద్రబాబుకు రిపోర్టులు అందాయి. మంత్రులందరిలో తన తనయుడు నారా లోకేష్ సమర్థంగా పనిచేస్తున్నారని..ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సమీక్షలు, ఆదేశాలు, పనులు చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి వెళ్లింది.పైగా వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు లోకేష్ పోరాడిన తీరు కూడా పార్టీలో ఆయనకు వీరాభిమానులు పెరిగిపోవడానికి కారణమైంది. ఎన్ని కేసులు పెట్టినా ఆయన వెనుకాడలేదు. యువగళం పాదయాత్ర సందర్భంగానూ, ఆ తర్వాత ఆయన రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని, అధికారానికి రాగానే వాటిని పరిష్కరించేందుకు ఆయన పనిచేస్తూనే ఉన్నారు తన శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తూనే స్థూలంగా అన్ని వ్యవస్థలను అర్థం చేసుకుంటున్నారు.పాలనతో పాటు జాతీయ రాజకీయాల విషయంలోనూ చంద్రబాబు బిజీగా ఉండటంతో చాలా మంది పార్టీ నేతలు తమ అవసరాల కోసం, సలహాల కోసం చినబాబును సంప్రదిస్తున్నారు.
ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలోనే మళ్లీ పనిచేస్తూ..జనానికి చేరువవుతూ.. లోకేష్ భారీ మెజార్టీతో గెలవడం అందరి ప్రశంసలు అందుకుంది. వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చినది కూడా మంగళగిరి నియోజకవర్గమేనని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీలో అంతర్లీనంగా ఒక చర్చ జరుగుతోంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు. ఆ అంశం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందని, అయితే ఆయన ఇప్పుడే తొందరపడ దలచుకోలేదని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన టైమ్ ఫ్రేమ్ మాత్రం చంద్రబాబు మదిలో మెదులుతున్నట్లు, ఒకరిద్దరి వద్ద సూచనప్రాయంగా చెప్పినట్లుగా తెలుస్తోంది…
21 స్తానాలు వచ్చిన జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు వందకు పైగా చోట్ల భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఎలాగని అధికార కూటమికి నాయకత్వం వహించే పార్టీలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారని అలాంటప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటే తప్పేమిటని కొందరు అంటున్నారు. పైగా తమిళనాడు వ్యవహారాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కరుణానిధి హయాంలో ఆయన తనయుడు ఎం.కే.స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించే క్రమంలో డిప్యూటీ సీఎం ఇచ్చారని, ఇప్పుడు స్టాలిన్ తన తనయుడు ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారని వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా… చంద్రబాబు తర్వాత చినబాబే వారసుడు అవుతారని..అందుకే ఇప్పుడు ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాల్సిన ఆవశ్యకత ఉందని టీడీపీ కేడర్ ఎదురు చూస్తోంది.. దీని వల్ల కూటమిలో నెంబరు టూ ఎవరో కూడా చెప్పినట్లవుతోందన్నది వారి వాదన..
కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పదవులు రాని చాలా మంది అసంతృప్తిలో కూడా ఉన్నారు. వారిలో కొందరినైనా సంతృప్తి పరచాల్సిన అనివార్యత ఉందని చంద్రబాబు గుర్తించారు. ఈ క్రమంలో సమర్థంగా పనిచేయని ఇద్దరు ముగ్గురు మంత్రులను తొలగించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్లు సమాచారం.వారి స్థానంలో కొత్త వారికి మంత్రి పదవులు దక్కుతాయి. మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో భారీ మార్పులు ఖాయమంటున్నారు. అప్పుడే లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…