రాష్ట్ర విభజన తర్వాత జనం అధికారమిస్తే ఐదేళ్లు తిరిగేసరికి సైకిల్‌పార్టీకి ఘోర ఓటమి. 23మందే గెలిచారు. అందులో కొందరు ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. మళ్లీ ఏడాదిలో ఎన్నికలు. టీడీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన పోరాటం ఇది. అందుకే తండ్రి ఏదో ఒక కార్యక్రమంతో జనంలోకి వెళ్తుంటే భావి నేతగా నిరూపించుకునే ప్రయత్నాల్లో కొడుకు కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త సంవత్సరంలో పాదయాత్రకు రూట్‌ప్లాన్ రెడీచేసుకున్నారు.
2023 జనవరి 27న ప్రారంభం కాబోతోంది నారా లోకేష్ పాదయాత్ర. 400 రోజులు..4000 కిలోమీటర్ల టార్గెట్‌తో మొదలవుతున్న ఈ యాత్రకు యువగళం పేరు పెట్టుకున్నారు. ప్రత్యేక జెండాని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల రాజకీయం నడుస్తోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ట్రెండ్‌నే అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి. వైఎస్ తర్వాత ఆయన కొడుకు ప్రజా సంకల్పయాత్రతో అధికారంలోకొచ్చారు. ఆయన చెల్లెలు తెలంగాణలో అదే పనిలో ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు దశలవారీగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు జనంలోకెళ్తే ఇప్పుడు ఆయన వారసుడు యువగళాన్ని ఆవిష్కరిస్తానంటున్నారు.
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే లోకేష్ పాదయాత్రలో ప్రధాన అంశాలని చెబుతున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురందాకా సాగబోతోంది లోకేష్ పాదయాత్ర. కాకపోతే లోకేష్ పెట్టుకున్న పేరు ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో మ్యూజికల్ ప్రోగ్రామ్‌లా ధ్వనిస్తోంది. ఇదేం సంగీత కచేరి కాదుగా. సీరియస్ ప్రోగ్రామ్. ఇప్పటికే ఇదేం ఖర్మ రాష్ట్రానికి టైటిల్‌పైనే సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు నారా లోకేష్ యువగళం అంటున్నారు. దీన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చకు అప్పుడే తెరలేచింది. చంద్రబాబు వస్తున్నా మీకోసం అయినా జగన్ ప్రజా సంకల్ప యాత్రయినా రెంటిలో ఓ సందేశం స్పష్టంగా కనిపించింది. ప్రజలకోసమన్న క్లారిటీ ఉంది. కానీ యువగళం అంతగా కనెక్ట్ కావడం లేదు. అంటే యువతను తప్ప ముసలీ ముతకా, మహిళలను పలకరించరా? వారి సమస్యలను ఆలకించరా? టైటిల్‌లోనే ఇంత కన్‌ఫ్యూజ్ ఉంటే యాత్ర మొదలయ్యాక ఎన్ని ఆపసోపాలు పడతారో ఎన్ని సర్కస్ ఫీట్లు చేస్తారో?!