లోకేష్ అన్నీ తానై.. వారసుడు సెటిలయ్యాడు..

By KTV Telugu On 26 June, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో తరం మారుతోంది. టీడీపీలో కొత్త రక్తం పారుతోంది. సీనియర్ల సేవలు వినియోగించుకుంటూనే పార్టీకి, ప్రభుత్వానికి కొత్త రూపు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అంతా తానై ప్రభుత్వ వ్యవస్థలను నడిపే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ నేతలు కూడా లోకేష్ నాయకత్వానికి జై కొట్టేందుకు వెనుకాడటం  లేదు. ఇంతకాలం లోకేష్ కష్టపడి, వైసీపీ దాడులను తట్టుకుని నిలబడిన తీరుతో వారంతా ఆయనకు ఫిదా అయిపోయారు. ఆయనే తమ కాబోయే ఫుల్ టైమ్  లీడర్ అని చెప్పుకునేందుకు వారు వెనుకాడటం లేదు. లోకేష్ కూడా నిత్యం జనంలో ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ ను డెవలప్ చేసుకుంటున్నారు…..

ఎన్నికల్లో  టీడీపీ గెలవకముందు నుంచే లోకేష్ ఫుల్ ఫోకస్ లో ఉన్నారు. పార్టీ నేతలకు, ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు.యువగళం పాదయాత్రతో ఊరురా తన ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, సమస్యలను అర్థం చేసుకున్నారు. టీడీపీ నుంచి జనం కోరుకుంటున్నదేమిటి.. తాము డెలవర్ చేయాల్సిందేమిటని అంచనా వేసుకునే అవకాశం ఆయనకు అప్పుడే వచ్చింది. చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పార్టీని లోకేష్ సమర్థంగా నడిపారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా  ప్రతి నిత్యం తిరుగుతూ ప్రజల ప్రాధమ్యాలు, పార్టీ అవకాశాలను బేరీజు వేశారు. జనంలో మరింత విశ్వాసం పెంచగలిగితే ఎన్నికల్లో టీడీపీకి తిరుగుండదని గుర్తించి ఆ దిశగా ఆయన  అడుగులు వేశారు.  వైసీపీ ఒక అవినీతికర పార్టీ అని ఎస్టాబ్లిష్  చేసేందుకు ఆయన అనేక టూల్స్ ని వాడారు. అందులో రెడ్ బుక్ ఒకటి. అందుకే రెడ్ బుక్ పేరు చెబితే అప్పుడు, ఇప్పుడు వైసీపీ బ్యాచ్ వణికి పోతుంది. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్లుగా, ఓడిన  చోటే గెలిచి చూపిస్తానని లోకేష్ సవాలు చేసి మరీ సాధించారు. మంగళగిరిలో గెలుపు కోసం ఆయన చెమటోడ్చిత తీరు.. వర్తమాన, భవిష్యత్ నాయకత్వానికి బాటలు వేసింది. వర్తమానం చేసిందేమిటి, భవిష్యత్తులో చేయాల్సిందేమిటో  లెక్క వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

అధికారానికి  వచ్చిన  తర్వాత లోకేష్  కొత్త ట్రెండ్ కు తెరతీశారు. ప్రభుత్వంలో ప్రక్షాళన అవసరమని గుర్తించి ఆ దిశగా నడిపిస్తున్నారన్న టాక్ మొదలైంది. వైసీపీతో అంటకాగి ప్రజా వ్యతిరేక విధానాలను అమలుచేసిన బ్యూరోక్రాట్లకు చుక్కులు చూపించే టైమ్ వచ్చినట్లుగా అనుకోవాల్సిందే. లోకేష్ చొరవను, ఉత్సాహాన్ని చూసి సీఎం చంద్రబాబు కూడా ఆయనకు ప్రాధాన్యం పెంచుతున్నారు..తదుపరి నాయకుడు ఆయనే అని చెప్పకనే చెబుతున్నారు….

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైడైపోతున్నారు. వైసీపీ  హయాంలో ఓవరాక్షన్ చేసి టీడీపీ వారిని, ప్రజలను టార్చెర్ పెట్టిన అధికారులు ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టమెంట్ అంటే జీఏడీలోకి వెళ్లిపోతున్నారు.నిజానికి చంద్రబాబు  అయితే వారినే నెత్తిన పెట్టుకునే వారన్న అభిప్రాయం ఉంది. లోకేష్ మాత్రం కనీసం ప్రజాహితం కోసమైనా వారిని ఉపేక్షించకూడదన్న ఆలోచనతో అవినీతి  అధికారులను దూరం పెట్టేస్తున్నారు. లోకేష్ ముందే తయారు చేసుకున్న రెడ్ బుక్లో ఉన్న అధికారులకంతా ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. మరో పక్క అక్రమంగా కట్టిన వైసీపీ భవనాల కూల్చివేత మొదలైంది. అప్పట్లో వైసీపీ  ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినట్లుగా కాకుండా.. కేవలం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను మాత్రమే కూల్చుతున్నారు. వైసీపీ కార్యాలయాలు పేరుతో ప్యాలెస్ లు కట్టుకుంటున్నందున ప్రస్తుత కూల్చివేతలను ప్రజలు కూడా వ్యతిరేకించడం లేదు. లోకేష్ పరిపాలనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. జనానికి బాగా చేరువగా ఉండేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో రోజువారీ  నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు వేల సంఖ్యలో జనం హాజరై తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు లోకేష్ ఆదేశాలిస్తున్నారు. మంగళగిరి నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జనం వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడం ప్రజా దర్బార్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.దీనివల్ల ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు కూడా బయటకు వస్తున్నాయి. జగన్ ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాడో కూడా జనానికి అర్థమైపోతోంది. పార్టీలో కూడా లోకేష్ నెంబర్ టూగా ఎదుగుతున్నారు. నేతలంతా ఆ  స్థాయిలో ఆయనకు గౌరవమిస్తున్నారు. ఆయన పార్లమెంటు సభ్యుడు కాకపోయినా.. శనివారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ  పార్టీ సమావేశానికి లోకేష్ ను  ఆహ్వానించారు. అక్కడ జరిగే చర్చలను అర్థం చేసుకునే అవకాశాన్ని ఆయన పొందారు. ఇది ఒక ప్రక్రియ మాత్రమే కాకుండా, లోకేష్ అభిమాన యువతకు కూడా ఒక టానిక్ లా పనిచేస్తుంది..

లోకేష్ కు వేగం ఉంది. అది అనవసర దూకుడు మాత్రం కాదు.ప్రజహితం కోసం పనిచేసే క్రమంలో ఎంత దూకుడుగా ప్రవర్తించాలో ఆయనకు ఒక అంచనా ఉంది. కాకపోతే ఒక విషయం మాత్రం ఆయన అర్థం చేసుకోవాలి. చుట్టూ చేరిన వారి చెప్పుడు మాటలకు  మాత్రం ఆయన ప్రాధాన్యం ఇవ్వకూడదు. అప్పుడే లోకేష్ కు తిరుగుండదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి