వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. మెగాస్టార్, మామ బాలయ్యకు లోకేష్ సూచన

By KTV Telugu On 12 January, 2023
image

 

జగన్, చిరంజీవి మధ్య పెరుగుతోన్న గ్యాప్‌
మెగా బ్రదర్స్‌పై రోజా విమర్శలతో పొలిటికల్ హీట్
మెగా క్యాంప్‌కు దగ్గరవుతోన్న టీడీపీ పవన్‌తో దోస్తీ
చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో లోకేష్

జగన్ సర్కార్‌ చిరంజీవికి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జగన్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు చిరంజీవి. పలుమార్లు జగన్ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. సినీఇండస్ట్రీ సమస్యలపైనా చర్చించారు. అయితే తాజా పరిస్థితులు చూస్తే ఏదో జరుగుతోందనే అనుమానం కలుగుతోంది. మంత్రి రోజా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిత్రయూనిట్‌ను అధికారులు కొంత గందరగోళానికి గురిచేయడం అటు చిరంజీవి కూడా ఏపీ రాజకీయాలతో తనకు సంబంధమే లేదని చెప్పడం లాంటి పరిణామాలతో రాజకీయం వేడెక్కుతోంది. వాల్తేరు వీరయ్య ఓ ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రాజకీయాలకు దూరమై సినిమాలు చేసుకుంటున్న చిరు తన మద్దతు ఎప్పుడూ తన తమ్ముడికి ఉంటుందని చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఏదో ఓ రోజు ఉన్నతస్థానానికి వెళ్తారని ఆశీర్వదించారు.

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పవన్‌కు మద్దతుగా నిలిచేందుకు మాజీ ప్రజారాజ్యం నేతలంతా ఇటీవల ఒక చోటకు చేరారు. తాను కూడా వైజాగ్‌లో స్థలం తీసుకున్నానని త్వరలోనే ఇక్కడే ఇల్లుకట్టుకుంటానంటూ కూడా మెగాస్టార్ కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆయన తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీలో ఓటు హక్కు కూడా లేదన్న మెగాస్టార్ ఆంధ్రా రాజకీయాల్లో ఏం జరుగుతుంతో తనకు తెలియదన్నారు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదన్నారు. చిరంజీవి వ్యాఖ్యల్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చిరు అనూహ్య వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. తల్లిని దూషించిన వారితో తమ్ముడు రాజీపడితే అన్నయ్యకు రాజకీయాల పట్ల విరక్తి పుట్టిందేమో అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. తద్వారా గతంలో టీడీపీతో విడిపోయిన సందర్భంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు దానికి టీడీపీ నేతలు వీరి తల్లిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యల్ని మరోసారి తెరపైకి తెచ్చారు.

ఇటీవల మెగా బ్రదర్స్ టార్గెట్‌గా రోజా కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. మెగా బ్రదర్స్‌కు రాజకీయ భవిష్యత్ లేదని చెప్పారు. మానవత్వం, ఎమెషన్స్ లేని పవన్ కళ్యాణ్ ఆర్టిస్టు అయినందుకు సిగ్గుపడుతున్నామంటూ రోజా ఫైర్ అయ్యారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ లాంటి వాళ్లు అన్నీ వదులుకుని ప్రజలకి సేవ చేసి వారి మెప్పు పొందారని కానీ మెగా బ్రదర్స్ మాత్రం వాళ్లని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి ఏ చిన్న సహాయాన్ని కూడా చేయలేదని రోజా ఆరోపించారు. వాళ్లు ఏం చేయలేదు కాబట్టే, వారిని వారి సొంత నియోజకవర్గాల్లోనే ప్రజలు ఓడించారని రోజా అన్నారు. రోజా వ్యాఖ్యలకు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా చిరు మాత్రం తనకు సంస్కారం ఉందంటూ సైలెంట్‌గా వార్నింగ్ ఇచ్చారు. అడ్డదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లు తన గురించి తన కుటుంబ సభ్యుల సభ్యుల గురించి అలానే ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటారని వ్యాఖ్యానించారు. తనతో సన్నిహితంగా ఉంటూ అలా ఎలా మాట్లాడారో తెలవదని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు చిరు.

వైసీపీ, మెగా బ్రదర్స్ మధ్య వైరం పెరుగుతోన్న వేళబీటీడీపీ ఆ క్యాంప్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పవన్‌తో పొత్తు దాదాపు ఖరారు చేసుకున్న తెలుగుదేశం పార్టీ చిరంజీవిని మరింత ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన మామ బాలయ్యకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేష్ జాగ్రత్తగా ఉండాలంటూ కొన్ని సూచనలు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా విషెస్ చెబుతూనేబీఇద్దరూ ఎవరి ట్రాప్‌లోపడొద్దంటూ ట్వీట్‌ చేశారు. సినిమాల ముసుగులో హీరోల కులాలతో గొడవలు చేయడానికి ఒక గ్యాంగ్ రెడీగా ఉందని ఓ కులాన్ని అడ్డుపెట్టుకుని మరో కులంపై విష ప్రచారం చేయాలని చూస్తున్నారంటూ లోకేష్ వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. ఇలాంటి ట్రాప్‌లో ఎవరు పడొద్దంటూ సూచించారు. అధికార పార్టీ కుతంత్రాలను తిప్పికొడదాం. మన అందరిదీ ఒకటే కులం. అని చాటి చెబుదాం అంటూ లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.