తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనుకున్న విధంగా జోష్ పెంచలేకపోవడంతో టిడిపి నాయకత్వం ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర ఫట్ మంది అన్న వార్త ప్రచారం కాకుండా దారి మళ్లించేందుకు ఏం చేయాలా అని చంద్రబాబు నాయుడు చాణక్య పథకం ఒకటి రూపొందించారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ చతికిల పడింది. మరో 14 నెల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో జోష్ పెంచడంతో పాటు పార్టీని జనంలోకి తీసుకుపోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ క్రమంలో భాగంగానే యువగళం పేరిట పాదయాత్రకు ప్లాన్ చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను జనంలోకి పంపడం ద్వారా పార్టీకి ఊపు తీసుకురావడంతో పాటు జనంలో లోకేష్ పాపులారిటీ పెంచాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న వ్యూహంతోనే యువగళానికి రూపకల్పన చేశారు. చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలో ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 4వేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
400రోజుల పాటు యాత్ర సాగుతుందని ప్రకటించారు. జనవరి 27న కుప్పంలో యాత్రను ఆర్భాటంగా ప్రారంభించారు. ఇప్పటికే 20 రోజుల యాత్ర ముగిసింది. యాత్రలో లోకేష్ ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ పంచ్ లు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే లోకేష్ యాత్ర అనుకున్నంతగా పార్టీలో జోష్ పెంచలేకపోయిందని నాయకత్వం భావిస్తోంది. పార్టీలో సీనియర్ నేతలంతా లోకేష్ యాత్రకు సహాయ నిరాకరణ చేస్తున్నారన్న అనుమానాలూ ఉన్నాయి. అందుకే జనసమీకరణ చేయడం లేదని అంటున్నారు. అటువంటి నేతలందరిపైనా దృష్టి సారించిన చంద్రబాబు నాయుడు సరైన సమయం వచ్చినపుడు వారిపై సరైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ లోగా లోకేష్ పాదయాత్ర గురించి వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించారు చంద్రబాబు నాయుడు.
నిజానికి లోకేష్ పాదయాత్రకు నాలుగు రోజుల ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆరంభం కావలసి ఉంది. ఆ రోజున ఆయన తన వారాహి వాహానినికి పూజలు నిర్వహించారు. అయితే సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ యాత్ర కూడా లోకేష్ యాత్రతోనే సమాంతంరగా సాగితే లోకేష్ యాత్ర పేలవంగా ఉందన్న విషయం బట్టబయలైపోతుందని భయపడ్డ టిడిపి వ్యూహకర్తలు పవన్ కళ్యాణ్ ను బతిమాలి వారాహి యాత్రను కొద్ది వారాల పాటు వాయిదా వేసుకోమన్నట్లు సమాచారం. దానికి పవన్ కూడా ఒప్పుకున్నారట. అయితే పవన్ యాత్ర లేకపోయినా లోకేష్ యాత్రకు జనం లేకపోవడంతో జనం దృష్టిని మరల్చడానికి పవన్ ను తెరపైకి తీసుకురావాలని చాణక్యుడు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా వారాహి యాత్రకు సిద్దం కావాలని పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించినట్లు భోగట్టా.
పవన్ కళ్యాణ్ యాత్ర మొదలు కాగానే ఎలాగూ ఆయన యాత్రకు జనం బ్రహ్మరథం పడతారు కాబట్టి జనం లోకేష్ యాత్ర గురించి మర్చిపోతారన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. పవన్ యాత్ర టేకాఫ్ తీసుకోగానే ప్రభుత్వం, పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారని ఆరోపించి లోకేష్ ప్రాణాలకు ముప్పుందనో భద్రత సరిపోదనో చెప్పి లోకేష్ యాత్రను అర్ధంతరంగా ముగించేసేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని టిడిపివర్గాల భోగట్టా. ఒకటి మాత్రం నిజం. పవన్ వారాహి యాత్ర మొదలు పెడితే ఆయన ఎటు వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతారు. అపుడు మీడియా కూడా పవన్ యాత్రను హైలెట్ చేయక తప్పదు. అపుడు జనసేన కు మంచి ఊపు వస్తుంది. జనసేన ఎలాగూ టిడిపికి మిత్ర పక్షమే కాబట్టి మిత్రుడి జోష్ మనకీ కలిసొస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జనసేన వీలైనంత ఎక్కువగా జనంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కి ఓటు బ్యాంకు పెరిగితే అల్టిమేట్ గా అది వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయావకాశాలను కూడా పెంచుతుందన్నది బాబు వ్యూహంగా చెబుతున్నారు.
అటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర ద్వారా జనంలోకి చొచ్చుకుపోవాలని భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమన్నారు పవన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనిచ్చే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. అందుకే టిడిపి-బిజెపిల మధ్య సారధ్యం వహించే ప్రయత్నం చేశారు. ప్రాధమికంగా బిజెపి నేతలు టిడిపితో పొత్తుకు ససేమిరా అన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడ్డాక వారిమనసుకూడా మారుతుందని పవన్ నమ్ముతున్నారు. అందుకే 2024 ఎన్నికల సమయానికి బిజెపి అగ్రనాయకత్వాన్ని ఒప్పించి టిడిపి-బిజెపి-జనసేన కూటమిగానే ఎన్నికల బరిలో దిగాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. దానికి వారాహి యాత్ర మంచి ఊపునిస్తుందని ఆయన నమ్ముతున్నారు. వారాహి యాత్రతో జనసైనికుల్లోనూ హుషారు రావడం ఖాయం. పార్టీ అధినేత చురుగ్గా యాత్ర చేస్తోంటే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో కదం తొక్కడం ఖాయం. ఇదే చంద్రబాబు నాయుడి మాస్టర్ ప్లాన్ అంటున్నారు రాజకీయ పండితులు. అయితే ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.